పవన్ సభకు సర్వం సిద్దం... తెలంగాణ నుండి కూడా..
posted on Sep 9, 2016 @ 10:27AM
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక పోరాటంలో భాగంగా ఈరోజు కాకినాడలో సీమాంధ్ర ఆత్మగౌరవ సభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. నేటి సాయంత్రం కాకినాడలోని జేఎన్టీయూ మైదానంలో 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు నిన్నటి నుండే ప్రారంభమయ్యాయి. జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు దగ్గరుండి మరీ అన్ని కార్యక్రమాలు చూసుకుంటున్నారు. ఈ సభకు పవన్ అభిమానులు, ప్రజలు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే పోలీసులు ముందుజాగ్రత్తగా.. బారికేడ్లు, భద్రతను ఏర్పాటు చేసి.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా నగరమంతా భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... పవన్ సీమాంధ్ర ఆత్మగౌరవ సభకు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. నిజామాబాద్, కరీంనగర్, ధర్మపురి, ఖమ్మం తదితర ప్రాంతాలకు చెందిన యువత ఇప్పటికే కాకినాడలోని జేఎన్టీయూ మైదానానికి చేరుకుంది. తామంతా పవన్ వీరాభిమానులమని, ఆయనేం మాట్లాడతారో వినేందుకే వచ్చామని వీరంతా చెబుతున్నారు.