అందుకే ప్యాకేజీకి అంగీకరించా:చంద్రబాబు
posted on Sep 19, 2016 @ 3:12PM
రాష్ట్ర విభజనతో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని..ఆస్తుల విభజనలో హేతుబద్ధత పాటించలేదన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కృష్ణాజిల్లా పామర్రు మండలం నెమ్మలూరులో బెల్ పరిశ్రమకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. ప్రత్యేక హోదాపై వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ పోరాడారని..అయితే ఆ హామీని చట్టంలో పొందుపరచకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందన్నారు. హోదా ఇవ్వడం కుదరనందువల్ల, దానికి సమానమైన ప్రయోజనాలతో ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ప్యాకేజీని అంగీకరించినట్లు చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయంతో పాటు పరిశ్రమలు నెలకొల్పాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి అనేక సంస్థలు వస్తున్నాయని..వాటికి కావాల్సిన భూములను రాష్ట్రప్రభుత్వం ఇస్తోందన్నారు.