ఇకపై ఆన్‌లైన్‌లో "లింగనిర్థారణ" కుదరదు..
posted on Sep 19, 2016 @ 4:00PM
మాతృత్వం మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం. గర్భం దాల్చేమని తెలియగానే దంపతులు ఉప్పొంగిపోతారు. ఆ ఆనందంలోనే పుట్టేది మగ బిడ్డా..ఆడబిడ్డా అని తెలుసుకోవాలనుకుంటారు. అయితే మన చట్టాల ప్రకారం ఆసుపత్రుల్లో లింగ నిర్థారణ పరీక్షలు నిషిద్ధం. అయితే టెక్నాలజీ పుణ్యమా అని ఆన్‌లైన్‌లో దీనికి సంబంధించిన సమాచారం దొరుకుతుంది. దాని సాయంతో పుట్టేది ఎవరో తెలుసుకుంటున్నారు. అయితే దీని వల్ల భ్రూణ హత్యలు పెరిగిపోవటంతో సాబుమాథ్యూ జార్జ్ అనే వ్యక్తి దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. ఇంటర్నెట్ సెర్చింజిన్‌లో ఇలాంటి సమాచారం ఆగిపోయే దిశగా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీం ఆర్డర్‌తో నిద్రలేచిన కేంద్రం ఆయా సెర్చ్ ఇంజిన్ కంపెనీలతో చర్చలు జరిపింది. భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిగణనలోనికి తీసుకున్న సెర్చ్ ఇంజిన్లు ఇందుకోసం ఒక ప్రత్యేక ఆటో బ్లాక్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాయి. లింగనిర్థారణ సమాచారం నిమిత్తం వెతికే 22కీ వర్డ్స్‌ను గుర్తించామని..ఆ పదాలతో వెతికితే యూజర్లకు ఎటువంటి సమాచారం లభ్యం కాదని సెర్చ్ ఇంజిన్లు భారత ప్రభుత్వానికి తెలిపాయి. ఈ విషయాన్ని కేంద్రం సుప్రీంకోర్టుకు నివేదించింది.