భయపడ్డ జకీర్ నాయక్.. తండ్రి అంత్యక్రియలకూ రాలేదు...
జకీర్ నాయక్ గత కొద్ది రోజులుగా భారత్ రాకుండా విదేశాల్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. భారత్ కు ఎక్కడ వస్తే తనను ఎక్కడ పట్టుకుంటారో అని ఇండియా రావడానికి వెనకడుగు వేస్తున్నారు. అయితే ఇప్పుడు తాను భయపడుతున్నది నిజమే అని మరోసారి రుజువు చేశారు. తన తండ్రి అంత్యక్రియలకు సైతం జకీర్ నాయక్ డుమ్మా కొట్టారు. బాంబే సైకియాట్రిక్ సొసైటీ అధ్యక్షుడు అయిన జకీర్ తండ్రి డాక్టర్ అబ్దుల్ కరీం నాయక్ నిన్న తెల్లవారుజామున మరణించారు. అయితే ప్రస్తుతం మలేసియాలో ఉన్నారని భావిస్తున్న జకీర్ నాయక్.. తన తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు. ఆయన అంత్యక్రియలకు భారీ మొత్తంలో జనం హాజరయ్యారు. పలువురు న్యాయవాదులు, వైద్యులు, రాజకీయ నాయకులు, పాత్రికేయులు, వ్యాపారవేత్తలు వచ్చారు. కానీ జకీర్ నాయక్ మాత్రం.. భారతదేశానికి వస్తే తనను పోలీసులు అరెస్టుచేస్తారన్న భయంతో రాకుండా ఆగిపోయారు. కాగా నాయక్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని, ఆయనపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆయన నడిపించే పీస్ టీవీ మతపరమైన కార్యక్రమాలనే ప్రసారం చేస్తూ.. మత విద్వేషాలను రెచ్చగొడుతోందని అంటున్నారు.