ఫ్యాన్సీ నెంబరు కోసం 60 కోట్లు...

  సాధారణంగా ఫ్యాన్సీ నెంబర్ల కోసం ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లిస్తారని తెలుసు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ.60 కోట్లు ఖర్చు చేశాడు. వివరాల ప్రకారం.. దుబాయిలో ప్రాపర్టీ డెవలపర్ అయిన భారతీయుడు బల్వీందర్ సహానీ తన కారు నెంబరు కోసం రూ.60కోట్ల్లు ఖర్చు చేశాడు. అక్టోబర్ 8న  ప్రభుత్వం నిర్వహించిన వేలంలో 33 మిలియన్ దిర్హామ్స్ పెట్టి డీ5 అనే సంఖ్యను దక్కించుకున్నాడు. ఇంకా రెండు రోల్స్ రాయిస్ కార్లకు ఇలాంటి నంబర్లే దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పాడు. గత ఏడాది కూడా 09 నంబర్‌ను 6.7 మిలియన్ డాలర్లు పెట్టి కొనుగోలు చేశాడు. కొంత మంది తాను డబ్బును వృథా చేస్తున్నానని ఆరోపిస్తారు.. కానీ తిరిగి ఇవ్వడంపై తనకు నమ్మకం ఉందని.. తాను వెచ్చించే డబ్బు చారిటీలకు, దుబాయ్ నగర అభివృద్ధికి ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు తెలిపాడు.

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం..ముగ్గురు సజీవదహనం

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈశాన్య ఢిల్లీలోని మోహన్ పార్క్ ప్రాంతంలోని ఓ భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. పార్కింగ్ ప్రదేశం నుంచి వచ్చిన మంటలు క్రమంగా అపార్ట్‌మెంట్ మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనమవ్వగా..మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పార్క్ చేసిన ఆటో రిక్షా నుంచి షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఏవోబీ ఎన్‌కౌంటర్‌.. మావోల బంద్ పిలుపు

  ఆంధ్ర, ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో వారం రోజుల క్రిందట భారీ ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్లో చాలా మంది మావోయిస్ట్ లు చనిపోయారు. అయితే ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోలు బంద్ కు పిలుపు ఇచ్చినట్టు తెలుస్తోంది. రేపు ఐదు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో  బంద్‌కు మావోలు పిలుపునిచ్చారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఏపీలో ఉత్తరాంధ్ర ఏజెన్సీ, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరుతోపాటు తెలంగాణలోని కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాచలం ఏజెన్సీలలో పోలీసులు అప్రమత్తమయ్యారు. బంద్ సందర్భంగా మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉండడం సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించారు. హై అలెర్ట్ ప్రకటించారు.

పాక్ వరుస పేలుళ్లు... 10మంది మృతి, 50మందికి గాయాలు..

  పాకిస్థాన్ వరస పేలుళ్లతో రక్తమోడుతుంది. ఇప్పటికే పలుమార్లు వరుస పేలుళ్లు సంభవించాయి. ఇప్పుడు తాజాగా మరోసారి పాకిస్థాన్‌లోని దక్షిణ బెలూచిస్థాన్‌లో పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 10మంది మృతి చెందగా, 50మందికి పైగా గాయాలపాలయ్యారు. కాలం చెల్లిన నౌకలను విచ్ఛిన్నం చేసే ప్రాంతంలో ఓ ఆయిల్‌ట్యాంకర్‌ కారణంగా ఈ పేలుళ్లు సంభవించినట్టు గుర్తించారు. పేలుళ్లు జరిగిన సమయంలో గద్దాని షిప్‌ బ్రేకింగ్‌యార్డులో 100మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. ఈ పేలుళ్లలో 10మంది మృతి చెందగా, 50మందికి పైగా గాయపడగా..30మంది ఆచూకీ తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. కాగా నౌకలో వెల్డింగ్‌ పనులు చేస్తుండగా ఎనిమిది వరుస పేలుళ్లు సంభవించాయి.

తెదేపా ఎంపీటీసీలు రాజీనామా...

  నలుగురు టీడీపీ ఎంపీటీసీలు రాజీనామా చేశారు. కృష్ణా జిల్లా నూజివీడు మండలానికి చెందిన పల్లలమూడి ఎంపీటీసీ సంధ్యారాణి, ఎంఎన్‌ పాలెం ఎంపీటీసీ శాంతకుమారి, దిగవల్లి ఎంపీటీసీ నాగేంద్రప్రసాద్‌, రావిచర్ల ఎంపీటీసీ సాంబశివరావు రాజీనామా చేశారు. గత కొంతకాలంగా నియోజకవర్గ ఇంఛార్జి ముద్రబోయిన వెంకటేశ్వరరావు, ఎంపీటీసీల మధ్య వివాదం నడుస్తోంది.  గ్రామాల్లో ఏ కార్యక్రమం చేపట్టినా ఎంపీటీసీలకు తెలియకపోవడం.. అధికారులను ప్రశ్నిస్తే నియోజకవర్గ ఇంఛార్జి ఏర్పాటుచేశారని చెప్పడంతో వారు మనస్తాపానికి గురవుతున్నారు. దీంతో వారు నూజివీడు ఎండీవో కార్యాలయానికి వెళ్లి తమ రాజీనామాలను ఎండీవో రాణికి అందజేశారు. అయితే వాటిని ఆమె తిరస్కరించి... ఇది తన పరిధిలోనిది కాదని జిల్లా పరిషత్‌ సీఈఓకు అందజేయాలని సూచించారు.

చిక్కుల్లో పాక్ ప్రధాని...

  నల్లధనానికి సంబంధించి పనామా పేపర్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పేపర్లలో పాకిస్థాన్ ప్రధాని మంత్రి న‌వాజ్ షరీఫ్ పేరు కూడా బయటపడిన సంగతి విదితమే.. అయితే ఇప్పుడు ఈ విషయంలో న‌వాజ్ ష‌రీఫ్ చిక్కుల్లో ప‌డ్డారు. ప‌నామా ప‌త్రాల కుంభ‌కోణంలో ష‌రీఫ్‌తోపాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై విచార‌ణ‌కు ఆదేశించింది పాక్ సుప్రీంకోర్టు. ఈ మేర‌కు ఓ న్యాయ‌మూర్తి నేతృత్వంలో విచార‌ణ క‌మిష‌న్‌కు కూడా నియ‌మించింది. ఈ క‌మిష‌న్‌కు సుప్రీంకోర్టుకు ఉండే అన్ని అధికారాలను క‌ట్ట‌బెట్టింది. ఈ కేసులో రోజువారీ విచార‌ణ జ‌ర‌ప‌డానికి కూడా సుప్రీంకోర్టు అంగీక‌రించింది.

పులితోనే గేమ్స్ ఆడుతున్న ప్రధాని మోడీ..

ప్రధాని నరేంద్ర మోడీ ఛత్తీస్‌గఢ్ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఇవాళ రాష్ట్ర ప్రజలకు పండుగరోజని, ఈ సమయంలో తాను ఇక్కడ గడపడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఇవాళ ఛత్తీస్‌గఢ్ ప్రజలు అటల్ బిహారీ వాజ్‌పేయ్‌ని గుర్తు చేసుకోవాలని అన్నారు. 2000 సంవత్సరంలోనే ఆయన హయాంలో ఛత్తీస్‌గడ్‌తోపాటు ఉత్తరాంచల్, జార్ఖండ్ రాష్ర్టాలు ఏర్పాటైన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాదు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ఫొటోగ్రాఫ‌ర్‌గా మారారు. అక్క‌డి నంద‌న్ వ‌న్ జంగిల్ స‌ఫారీకి వెళ్లిన ఆయన అక్క‌డే ఎన్‌క్లోజ‌ర్‌లో ఉన్న పులిని ఫొటో తీసే ప్ర‌య‌త్నం చేశారు. పులికి మ‌రీ ద‌గ్గ‌ర‌గా వెళ్లి ప్ర‌ధాని ఫొటో తీయ‌డానికి ప్ర‌య‌త్నించారు. ఆయ‌న వెంట చ‌త్తీస్‌గ‌ఢ్ సీఎం ర‌మ‌ణ్‌సింగ్ కూడా ఉన్నారు.

ప్రెషర్ కుక్కర్ లో బాంబు దాడి..

ఈ మధ్య ప్రెషర్ కుక్కర్ లో బాంబులు పెట్టి పేలుస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కేరళ మలప్పురం కోర్టు ఆవరణలో కోర్టు ఆవరణలో పార్క్ చేసి ఉన్న కారులో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో మూడు వాహనాలు ధ్వంసం కాగా, ఒకరు గాయపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డాగ్, బాంబ్ స్క్వాడ్ సిబ‍్బందితో  సోదాలు చేపట్టారు. దుండగులు ప్రెషర్ కుక్కర్ బాంబును అమర్చి పేల్చినట్టు పోలీసులు గుర్తించారు. కారు యజమాని హోమియో డీఎంవోదిగా గుర్తించారు. అలాగే ఘటనా స్థలంలో ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఫోటోను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అద్దె ఇంటి కోసం వెతుకులాట.. యువతిపై సామూహిక అత్యాచారం..

  ముంబైలో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అద్దె ఇంటి కోసం వెతుకుతున్న ఓ యువతిపై సామూహిక హత్యాచారం జరిపారు. వివరాల ప్రకారం.. ముంబైలోని అంబోలి ప్రాంతంలో  ఓ యువతి తన భర్తతో కలసి అద్దె ఇంటిని వెతుక్కుంటూ వెళ్లింది. ఆ క్రమంలో అంబోలీ ప్రాంతంలో అద్దె ఇంటిని వెతుకుతున్న సమయంలో, ఖాళీగా ఉన్న ఓ ఇంటిని చూసేందుకు ఆమె లోపలకు వెళ్లింది. ఆ సమయంలో ఇల్లు చూపించేందుకు లోపలికి వచ్చిన వారిలో ముగ్గురు ఆమె భర్తను బయటే నిర్బంధించగా, నలుగురు ఆమెపై అదే ఇంట్లో అత్యాచారం చేశారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.

పాక్ కవ్వింపు చర్యలు.. ఇద్దరు బాలురు మృతి..

  పాక్ సైన్యం సరిహద్దు ప్రాంతంలో మరోసారి కాల్పులకు తెగబడింది. పాక్ చేస్తున్న కవ్వింపు చర్యలకు జవాన్లతో పాటు, సాధారణ పౌరులు కూడా నష్టపోతున్నారు. పాక్ బ‌ల‌గాలు జ‌మ్ముక‌శ్మీర్‌లోని సాంబా, నౌషేరా ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే. అయితే, సాంబా ప్రాతంలోని రామ్‌గ‌ఢ్ సెక్టార్‌లో పాక్ రేంజ‌ర్ల కాల్పుల‌తో ఇద్ద‌రు బాలురు మృతి చెందారు. మ‌రో 8 మందికి గాయాల‌య్యాయి. భార‌త్ దాడుల‌ను తిప్పికొడుతూ గట్టిగా బుద్ధి చెబుతోన్నా పాకిస్థాన్ త‌మ తీరు మార్చుకోవ‌డం లేదు. రెచ్చిపోయి మ‌రీ కాల్పులు జ‌రుపుతూ సామాన్యుల‌ను బ‌లిగొంటోంది.

మిచెల్ కు ఆఫర్ ఇచ్చిన హిల్లరీ క్లింటన్..

  అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈనెలలో జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తెలియదు కానీ.. అప్పుడే ఈ ఎన్నికల బరిలో ఉన్న హిల్లరీ క్లింటన్ మాత్రం అప్పుడే  ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిచెల్ కు ఆఫర్ ఇచ్చేశారు. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటనుకుంటున్నారా..? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే, తనను క్యాబినెట్ లోకి ఆహ్వానిస్తానని.. హిల్లరీ క్లింటన్ స్పష్టం చేశారు. ఆమె ప్రభుత్వంలో భాగం కావాలని భావిస్తే, తనకో ఉత్తమ భాగస్వామి లభించినట్లని ఆమె అన్నారు. అమెరికా తొలి మహిళగా గడచిన ఆరేళ్లలో ఆమె దేశానికి ఎంతో సేవ చేశారని.. ప్రపంచవ్యాప్తంగా బాలికా విద్యపై అవగాహన పెంచేందుకు ఆమె ఎంతో కృషి చేశారని, తాము కలిసిన ప్రతిసారీ ఈ విషయంలో చర్చించుకునే వాళ్లమని అన్నారు.

కానిస్టేబుల్ పాడెను మోసిన ముఖ్యమంత్రి..

  భోపాల్ సెంట్రల్ జైలు నుండి 8మంది ఉగ్రవాదులు పారిపోయి ఆతరువాత ఎన్ కౌంటర్ కు గురైన సంగతి తెలిసిందే. అయితే వారు పారిపోయేముందు హెడ్ కానిస్టేబుల్ రమాశంకర్ యాదవ్ ను చంపేసి పారి పోయారు. ఈనేపథ్యంలో ఈరోజు ఆయన భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా హాజరయ్యారు. రమాశంకర్ కు నివాళి అర్పించి, అతని కుటుంబసభ్యులను ఓదార్చారు. అంతేకాదు, రమాశంకర్ పాడెను మోసి, అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంకా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ఉగ్రవాదులతో పోరాడి రమాశంకర్ ప్రాణత్యాగం చేశారని కొనియాడారు. అతని కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం అందిస్తామని... అతని కుమార్తె వివాహానికి రూ. 5 లక్షల ఆర్థికసాయం చేస్తామని తెలిపారు.

రెచ్చిపోతున్న పాక్ రేంజర్లు..సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం

ఎన్నిసార్లు చావుదెబ్బలు తిన్నా పాక్ సైన్యానికి బుద్ధిరావడం లేదు. సరిహద్దులో నియంత్రణ రేఖ వెంబడి మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. సాంబా, నౌషేరా సెక్టార్లలో కాల్పులకు తెగబడింది. వెంటనే అప్రమత్తమైన భారత బలగాలు ధీటుగా స్పందించాయి. మరోవైపు పాక్ సైన్యానికి మద్ధతుగా ఉగ్రవాదులు కూడా రెచ్చిపోతున్నారు. జమ్మూకశ్మీర్ లోని బందిపొరా జిల్లా అజార్ లో ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారు. దీనిని బీఎస్ఎఫ్ అడ్డుకుంది. దీంతో సైన్యం, ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు జరుగుతోంది. ఈ రెండు ఘటనలతో భారత్-పాక్ సరిహద్దుల్లో యుద్ధవాతావరణం నెలకొంది. ఉద్రిక్తతల దష్ట్యా ప్రజలను సైన్యం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. 

కేంద్రం వాళ్ల ఫోన్లు ట్యాపింగ్ చేస్తుంది..

  ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై ఎప్పుడూ ఏదో ఒక విషయంలో విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. ఇప్పుడు తాజాగా మరోసారి కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఇవాళ ఢిల్లీ హైకోర్టు 50వ వార్షికోత్సవం సందర్బంగా మాట్లాడిన ఆయన న్యాయమూర్తుల పోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యవహారాలుంటే న్యాయ వ్యవస్థ స్వాతంత్రం ఎక్కడుంటుందని అడిగారు. అయితే దీనికి సంబంధించి తనవద్ద కచ్చితమైన సమాచారం లేదని అన్నారు. అయితే ట్విస్ట్ ఏంటంటే.. కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు అదే సభలో ఉన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖండించారు. తన శాఖలో ఎవరి ఫోన్లను ట్యాప్ చేయలేదని తెలిపారు.