ములాయంకు షాక్.. అఖిలేష్ లేకపోతే కుదరదు...

  యూపీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచార కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నాయి. యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా నిన్ననే తన ప్రచార యాత్రని ప్రారంభించారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పార్టీలు పొత్తుకు కూడా సిద్దమవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ విషయంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కు షాక్ తగిలినట్టు తెలుస్తోంది. గత కొద్ది కాలంగా ములాయం కుటుంబంలో రాజకీయ విబేధాలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. దీంతో అఖిలేశ్ యాదవ్ ను సీఎం అభ్యర్థిగా పెడితేనే చేతులు కలుపుతామని భాగస్వామ్య పార్టీలు స్పష్టం చేయడంతో ములాయం ప్రయత్నాలకు ఆరంభంలోనే హంసపాదు ఎదురైంది. సమాజ్ వాదీ పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా అఖిలేశ్ పేరును ఖరారు చేస్తేనే ఉమ్మడి పోరుకు అంగీకరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇక ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్ కూడా మాట్లాడుతూ.. ములాయం మహాకూటమి ఏర్పాటు చేయాలనుకుంటే ముందుగా తన కుటుంబంలో రేగిన కలహాలను పరిష్కరించుకోవాలని సూచించారు.  అంతేకాదు సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ కలిసి వస్తేనే మహాకూటమి సాధ్యమన్న అభిప్రాయాన్ని జేడీ(యూ) నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యక్తం చేశారు. మరి ములాయం దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

యూకే కొత్త వీసా రూల్స్... ఇండియన్స్ కు కష్టమే..

  ఇకనుండి యూకే వెళ్లడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా ఇండియన్స్... అందులోనూ ఐటీ రంగానికి చెందినవారు. ఎందుకంటే యునైటెడ్ కింగ్‌డ‌మ్ ప్ర‌భుత్వం త‌మ వీసా నిబంధ‌న‌ల‌ను క‌ఠిన‌త‌రం చేసింది. యూకే హోమ్ ఆఫీస్ ఈ కొత్త రూల్స్‌ను ప్ర‌క‌టించింది. టైర్ 2 ఇంట్రా కంపెనీ ట్రాన్స్‌ఫ‌ర్ (ఐసీటీ) కేట‌గిరీలో వీసా కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే ప్రారంభ‌ వేతనం 30 వేల పౌండ్లు ఉండాల్సిందే. ఇంత‌కుముందు ఇది 20800 పౌండ్లుగా ఉండేది. ఈ కొత్త నిబంధ‌న న‌వంబ‌ర్ 24 నుంచి అమల్లోకి రానుంది. ఈ ఐసీటీ కేట‌గిరీలో బ్రిట‌న్‌లో ఉండే ఇండియ‌న్ ఐటీ కంపెనీలే ఎక్కువ శాతం వీసాల కోసం ద‌ర‌ఖాస్తు చేస్తుంటాయి. ఇందులో సుమారు 90 శాతం వాటా ఇండియ‌న్ ఐటీ కంపెనీల‌వేన‌ని యూకే మైగ్రేష‌న్ అడ్వైజ‌రీ క‌మిటీ (ఎంఏసీ) వెల్ల‌డించింది.

మైనర్ బాలికలపై అత్యాచారం..11 మంది అరెస్ట్

  మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ సంజయ్ బావిష్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర, బుల్దాన జిల్లా హివర్‌ఖేడాలోని నినాదీ ఆశ్రమ పాఠశాలలో బాలికలపై ఉపాధ్యాయులు, సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారు. పాఠశాల ప్రెసిడెంట్, సెక్రెటరి, జాయింట్ సెక్రటరితో పాటు పలువురు సిబ్బంది ఈ ఘటనలో నిందితులుగా ఉన్నారని.. వీరిపై ఐపీసీ 376 సెక్షన్ కింద కేసు నమోదుచేసినట్లు వెల్లడించారు. కేసు విచారణ కోసం మహారాష్ట్ర డీజీపీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్‌)ను ఏర్పాటుచేశారు.

'టైమ్స్‌ నౌ' కి ఆర్నబ్‌ గోస్వామి వీడ్కోలు..

  సీనియర్‌ జర్నలిస్ట్ ఆర్నబ్‌ గోస్వామి ప్రముఖ ఆంగ్ల న్యూస్‌ చానల్‌ 'టైమ్స్‌ నౌ' లో చీఫ్ ఎడిటర్ పదవిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన తన పదవినుండి తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలో ఆర్నబ్ గోస్వామి మాట్లాడుతూ.. 'ఆట ఇప్పుడే మొదలైదంటూ' తన సహచరులను ఉద్దేశించి ఆర్నబ్ భావోద్వేగ ప్రసంగం చేశారు. 'ఇండిపెండెంట్ మీడియా గురించి మనకు ఎవరూ బోధించరు. మనతంట మనమే నేర్చుకోవాలి. నేను ఇంత స్వేచ్ఛగా పనిచేయగలిగానంటే అందుకు మీరే కారణం. విధి నిర్వహణలో భాగంగా నేను కొంతమందిపై నోరు పారేసుకున్నాను. వారికి క్షమాపణ చెబుతున్నాను. మన చానల్ ను టాప్ లో నిలబెట్టాలన్న ఉద్దేశంతోనే ఇలా వ్యవహరించాన'ని వివరణయిచ్చారు. ప్రైమ్‌టైమ్‌ షో ‘ద న్యూస్‌ అవర్‌'తో పాపులరయిన ఆర్నబ్‌ గోస్వామి పదేళ్ల పాటు 'టైమ్స్‌ నౌ'లో పనిచేశారు. కాగా ఆయన సొంతంగా వార్తా చానల్ పెడతారని ప్రచారం జరుగుతోంది.

పాక్ ప్రతీకారం.. 8మంది ఉద్యోగులపై ఆరోపణలు..

భారత్ పై పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకోవడంలో ఏ అవకాశం వచ్చినా వదిలిపెట్టేట్టు కనిపించడంలేదు. ఇప్పటికే భారత్ లో పనిచేస్తూ గూఢాచార్య చేస్తున్న నేపథ్యంలో పాక్ ఉద్యోగిని విధుల నుండి బహిష్కరించిన సంగతి తెలిసిందే. దానికి పాక్ కూడా వెంటనే అక్కడ పనిచేస్తున్న ఉద్యోగిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఇప్పుడు తాజాగా ఇస్లామాబాద్ లోని భారత దౌత్య కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎనిమిది మంది భారత హై కమిషన్ అధికారులు పాక్ కు వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని ఆరోపిస్తుంది. దీనిపై విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ స్పందిస్తూ.. కేవలం ప్రతీకారం తీర్చుకోవడానికే  ఈ ఆరోపణలు చేస్తుందని అన్నారు. కేవలం ఒక్క పాక్ జాతీయుడినే భారత్ బహిష్కరించిందని గుర్తు చేసిన ఆయన, పాక్ ఎనిమిది మంది భారత ఉద్యోగుల గుర్తింపును బహిర్గతం చేసిందని, దీని వల్ల వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంటుందని.. పాకిస్థాన్ లో ఉన్న భారత ఉద్యోగులు, వారి కుటుంబీకులందరి రక్షణ బాధ్యత ఆ దేశానిదేనని ఆయన స్పష్టం చేశారు.

జయలలిత గది మార్పు..

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గత కొద్ది రోజులుగా చెన్నైలోని అపొలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే మొదట హెల్త్ బులిటెన్లు విడుదల చేసినా.. ఇప్పుడు అమ్మ ఆరోగ్యం కాస్త కుదుటపడిన నేపథ్యంలో బులిటెన్లు ఇవ్వడం కూడా ఆపేశారు. అయితే ఇప్పుడు ఆమె ఆరోగ్యం గురించి మరోసారి తెలిపారు అన్నాడీఎంకే నేతలు. అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు, అధికార ప్రతినిధి సి.పొన్నియన్ మాట్లాడుతూ.. ఆమె ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అదుపులోకి వచ్చిందని, ఇప్పుడు క్లిష్ట పరిస్థితి నుంచి బయట పడటం, శ్వాసకోశ వ్యవస్థ కూడా బాగుపడటంతో ఆమెను  క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ) నుంచి వేరే గదిలోకి మారుస్తున్నారని తెలిపారు. గత వారం రోజులుగా ఆమెకు ఒక మాదిరి ఘన ఆహార పదార్థాలను ఇస్తున్నారన్నారు. ఇప్పుడు ఆమె అందరితో మాట్లాడుతున్నారని కూడా తెలిపారు.

వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం నిధులు..

  తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నిధులు విడుదల చేసింది. హైదరాబాద్ మినహా మిగిలిన తొమ్మిది జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ.450 కోట్లు కేంద్రం విడుదల చేసింది.  2015-16 ఆర్థిక సంవత్సరానికి విడుదల చేసిన నిధులను రూ.382.34 కోట్లు వినియోగించుకున్నట్టు కేంద్రానికి రాష్ట్రం ఇటీవల నివేదిక సమర్పించి.. దీంతో పాటు రెండో విడుత నిధులు విడుదల చేయాలని కోరింది. దీనికి గాను కేంద్రం 2016-17 ఆర్థిక సంవత్సరానికి స్పెషల్ డెవలప్‌మెంట్ ప్యాకేజిగా రెండో విడుతగా ఈ నిధులను విడుదల చేసింది. పాత జిల్లాలను ప్రాతిపదికగా తీసుకొని తెలంగాణలో ఒక్కోజిల్లాకు రూ.50 కోట్ల చొప్పున మొత్తం తొమ్మిది జిల్లాలకు కలిపి రూ.450 కోట్లు విడుదల చేసింది.

కరుడుగట్టిన ఉగ్రవాది ఒమర్ కలిక్ అరెస్ట్..

  లష్కరే తోయిబాకు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాది ఒమర్ కలిక్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఇప్పటికే భారత్ లో పలు విధ్వంసాలు సృష్టించగా.. ఇప్పుడు ఇండియాలో భారీ ఎత్తున విధ్వంసం జరపడమే లక్ష్యంగా సరిహద్దులు దాటి జమ్మూకాశ్మీర్ లోకి ప్రవేశించిన ఒమర్ కలిక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఒమర్ కలిక్ జమ్మూకాశ్మీర్ లోకి ప్రవేశించిన విషయం తెలుసుకున్న ఇంటెలిజెన్స్ వర్గాలు సోపోర్ ప్రాంతంలో ఖలిక్ ను అరెస్ట్ చేశాయి. ఖలిక్ నుంచి అత్యాధునిక ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతన్ని గుర్తు తెలియని ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నట్టు సమాచారం.

ఆర్కే క్షేమంగానే ఉన్నాడు...

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) లో భారీ ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే.  ఈ ఎన్ కౌంటర్లో చాలా మంది మావోయిస్టులు మరణించగా.. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామకృష్ణ అలియాస్‌ ఆర్కే ఆరోజు నుండి కనిపించకుండా పోవడంతో పలు అనుమానాలు తలెత్తాయి. ఈనేపథ్యంలోనే ఆర్కే భార్య కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఇక దీనిపై విచారించిన హైకోర్టు..  ఆర్కే గురించి తమకు వివరాలు చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక పోలీసులు దీనికి గాను ఆర్కే గురించి మాకు తెలియదు అని నిన్న కోర్టుకు తెలియజేశారు. అయితే ఇప్పుడు ఆర్కే క్షేమంగానే ఉన్నాడని తమకు సమాచారం అందినట్లు పౌర హక్కుల సంఘం నేత వరవరరావు చెప్పారు. ఎన్ కౌంటర్ తరువాత ఆర్కే కనిపించకపోవడంతో తామంతా ఆందోళన చెందామని అయితే ఇప్పుడు పదిరోజుల తర్వాత ఆయన క్షేమంగా ఉన్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. ఏవోబీతో పాటు తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో పోలీసుల నిర్బంధం ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. గాలింపు చర్యలు వెంటనే నిలిపివేయాలని కోరారు.

జీఎస్టీ బిల్లు... 4 భాగాలుగా పన్ను రేట్లు..

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ బిల్లును అమలులోకి వచ్చే ఏడాది నుండి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన జీఎస్టీ మండలి సమావేశం ఏర్పాటు చేశారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..షెడ్యూల్ ప్రకారమే జీఎస్టీ (గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) అమలులోకి వస్తుందని ..ఇవాళ జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో పన్ను రేట్ల విధానం, పరిహారంపై సుదీర్ఘంగా చర్చించినట్లు.. జీఎస్టీ పన్ను రేటును 5,12, 18, 28 శాతాలుగా (4 భాగాలుగా)నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఆహారధాన్యాలపై సాధారణ ప్రజలకు పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. సామాన్యులు వినియోగించే వస్తువులపై 5శాతం పన్ను రేటును నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కూల్‌డ్రింక్స్, పాన్ మసాలా, లగ్జరీ కార్లు, పొగాకు ఉత్పత్తులపై 28శాతానికిపైగా పన్ను విధించనున్నట్లు తెలిపారు.

టాటా ఛైర్మన్ పదవి పోరులో మరో పేరు..

  టాటా ఛైర్మన్ పదవి నుండి సైరస్ మిస్త్రీని తొలగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రతన్ టాటా బాధ్యతుల స్వీకరించారు. ఛైర్మన్ ఎంపికకు దాదాపు నాలుగు నెలలు సమయం పడుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ ఛైర్మన్ పదవికి పలువురి పేర్లు వినిపిస్తుండగా..ఇప్పుడు మరో పేరు వినిపిస్తుంది. ఆయనే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ సీఈవో ఎన్‌.చంద్రశేఖరన్‌. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ సీఈవో ఎన్‌.చంద్రశేఖరన్‌ పేరు కూడా బలంగా వినిపిస్తోంది.  అయితే ఆయన ఎంపిక మాత్రం కొంత సంక్లిష్టంగా ఉండే అవకాశం ఉన్నట్లు వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే టాటా గ్రూప్‌లోని విలువైన కంపెనీలకు ఆయన హెడ్‌గా ఉన్నారు. కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనను టాటా ఛైర్మన్‌గా ఎంపిక చేస్తే ఆ స్థానాన్ని భర్తీ చేయగల మరొకరిని అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.  కాగా ఇప్పటికే .. ఎస్‌.రామదొరై పేరు బలంగా వినిపిస్తుండగా, పెప్సీ సీఈవో ఇంద్రనూయి, వోడాఫోన్‌ మాజీ హెడ్‌ అరుణ్‌ సైరిన్‌, టాటా రీటైల్‌ యూనిట్‌ ట్రెంట్‌ ఛైర్మన్‌ నోయల్‌ టాటాలు ఈ జాబితాలో ఉన్నారు. ఇందులో ఎన్‌ఎస్‌డీఏ, ఎన్‌ఎస్‌డీసీలకు రామదొరై రాజీనామా చేశారు. మరి ఎవరికి ఆపదవి దక్కుతుందో చూడాలి.

హద్దు దాటిన చైనా...

  భారత్ సరిహద్దు ప్రాంతంలోకి చైనా అప్పుడప్పుడు చొరబాట్లు చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి చైనా హ‌ద్దు దాటింది. వాస్త‌వాధీన రేఖ వెంబ‌డి జ‌మ్ములోని లే జిల్లా డెమ్‌చోక్ ప్రాంతంలోకి చైనా పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ బల‌గాలు చొచ్చుకొచ్చిన‌ట్లు ఓ ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారి వెల్ల‌డించారు. స‌రిహ‌ద్దులో గ‌స్తీ కాస్తున్న ఇండో టిబిటెన్ బోర్డ‌ర్ పోలీస్ (ఐటీబీపీ) బ‌ల‌గాల‌కు వారు ఎదురు వ‌చ్చారు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం వాస్త‌వాధీన రేఖ‌కు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చార‌ని, తిరిగి వెళ్ల‌డానికి వారు నిరాక‌రించార‌ని ఆ అధికారి వివ‌రించారు. 2014లోనూ డెమ్‌చోక్‌లో జ‌రుగుతున్న సాగునీటి ప్రాజెక్టును వ్య‌తిరేకిస్తూ చైనా బ‌ల‌గాలు మ‌న భూభాగంలోకి చొచ్చుకొచ్చారు. ఈ తాజా చొర‌బాటుపై స్పందించ‌డానికి లే డిప్యూటీ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న రామస్వామి నిరాక‌రించారు.

మాజీ జవానుకు ముగిసిన అంత్య క్రియలు.. కోటి నష్టపరిహారం..

  ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్(ఓఆర్ఓపీ) పథకం అమల్లో లోటుపాట్లపై మనస్తాపం చెంది మాజీ జవాను రాంకింషన్ గ్రెవాల్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆయన అంత్యక్రియలకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ రాంకింషన్ కు కోటి రూపాయలను నష్టపరిహారం ప్రకటించారు. ఈ పరిహారంతో పాటు, కుటుంబానికి ఉద్యోగ హామీని కూడా ఇస్తున్నట్టు కేజ్రీవాల్ పేర్కొన్నారు.   ఢిల్లీతో పాటు, ఇటు హర్యానా ప్రభుత్వం కూడా ఈ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందించనున్నట్టు వెల్లడించింది.

రతన్‌ టాటా పై స్వామి సంచలన వ్యాఖ్యలు..

  బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి అన్ని వ్యవహారాల్లో నేనున్నానంటూ తలదూర్చే సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు టాటా వివాదాల్లో కూడా ఆయన వేలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్‌టాటాపై సంచలన ఆరోపణలు చేశారు. టాటా గ్రూప్‌ చరిత్రలోనే రతన్‌ టాటా అత్యంత అవినీతిపరుడైన ఛైర్మన్‌ అని.. వాస్తవానికి రతన్‌ టాటా అసలు టాటా వారసుడు కాదని, ఆయన తండ్రే ఓ దత్తపుత్రుడని ఆరోపించారు. సైరస్‌ మిస్త్రీ వ్యవహారంలో రతన్‌ టాటా అన్యాయంగా వ్యవహరిస్తున్నారన్న స్వామి .. రెండు నెలల క్రితం మిస్త్రీ పనితీరును బోర్డు ప్రశంసించిందని అదే అతనిపై టాటా అసూయకు కారణమని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ కుంభకోణం, ఎయిర్‌ ఏసియా స్కామ్‌, విస్తారా భాగస్వామ్య వ్యవహారం వంటి అంశాల్లో టాటా ప్రమేయం ఉందని ఆరోపించారు. వీటినుంచి తప్పించుకోవడానికే ఆయన సైరస్‌ని తప్పించారని, కానీ ఒకసారి న్యాయవిచారణ మొదలైతే ఆయన తప్పించుకోలేరని స్వామి పేర్కొన్నారు. కాగా టాటా గ్రూపుల ఛైర్మన్ పదవి నుండి సైరస్ మిస్త్రీని తొలగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రతన్ టాటా తాత్కాలికంగా బాధ్యతలు స్వీకరించారు.

అమ్మాయిలతో మాట్లాడితే అంతే...

  కాలేజ్ అన్న తరువాత అమ్మాయిలు, అబ్బాయిలు మాట్లాడుకోవడం సహజం. అయితే కొంత మంది మాత్రం ప్రేమకు ఆకర్షితులై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి చైనాలోని  ‘క్వింగ్‌డావో బిన్‌హాయ్‌’ ఓ విశ్వవిద్యాలయం కొన్ని నిబంధనలు విధించింది. పాటించడానికి అవి కాస్త కష్టంగానే ఉన్నా విద్యార్ధులు మాత్రం తప్పక పాటించాల్సిందే. ఇంతకీ ఆ నిబంధనలు ఏంటంటే..   * విద్యార్థిని విద్యార్థులు కళాశాల ఆవరణలో కలిసి తిరగకూడదు. మాట్లాడుకోకూడదు. కనీసం కన్నెత్తి కూడా చూసుకోకూడదు. * చేతిలో చేయి వేసుకొని కనిపించకూడదు. * ఒకే హెడ్‌సెట్‌తో పాటలు వినడానికి వీల్లేదు. * క్యాంటీన్‌లో భోజనం చేసేప్పుడు అమ్మాయిలు.. అబ్బాయిలు ఎలాంటి సంభాషణలు, సంజ్ఞలు చేసుకోకూడదు.   ఒకవేళ ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే వారికి శిక్ష అమలు చేస్తారు. ఆ శిక్ష ఏంటంటే.. కళాశాల మరుగుదొడ్లను, పరిసరాలను శుభ్రం చేయాలి. ఈ శిక్షలు విద్యార్థులకే కాదండోయ్‌.. విశ్వవిద్యాలయ సిబ్బందికీ వర్తిస్తాయి.ఈ కఠినమైన నిబంధనల గురించి యూనివర్సిటీ మేనేజర్‌ మాట్లాడుతూ ‘సమాజంలో ప్రజలతో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో విద్యాలయం నుంచే అలవరుచుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. విద్యార్థుల భవిష్యత్తుకి ఇది బాగా ఉపయోగపడుతుంది’’ అని అన్నారు. మరి విద్యార్ధులు ఈ కఠినమైన నిబంధనలు పాటిస్తారా.. లేక ఏకంగా వేరే కాలేజ్ నే చూసుకుంటారా చూద్దాం..  

హిల్లరీ క్రిమినల్ కేసు చర్యలు ఎదుర్కోవాల్సిందే..

  అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వేడి మరింత పెరుగుతుంది. అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. అయితే ఇప్పుడు ఇది మరింత ఎక్కువైనట్టు కనిపిస్తోంది. ఓర్లాండాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ హిల్లరీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమెయిల్స్ వ్యవహారంలో ఆమె చేసిన తప్పిదాలకు హిల్లరీ క్రిమినల్ కేసు చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఓ ల్యాప్ టాప్ నుంచి పంపిన 65,000 ఈమెయిల్స్ ను హిల్లరీ భర్త, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, పార్టీ సన్నిహితులు షేర్ చేసుకున్నారని ఎఫ్ బీఐ తన దర్యాప్తులో కనుగొన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. స్వీయ తప్పిదాలకు హిల్లరీ ఒక్కరే ఇందులో బాధితురాలు కాదని, అమెరికన్ ప్రభుత్వ తీరుతో ప్రజలందరూ ఈమెయిల్స్ కుంభకోణంలో బాధితులుగా మిగిలారని ట్రంప్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు కోరుకునే వాళ్లు తన వెంట ఉండాలని ట్రంప్ పిలుపునిచ్చారు.

మ‌మ్మీ, డాడీ, డ‌మ్మీ కాదు..

  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఈరోజు నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం ఐనవోలులో వెల్లూరు సాంకేతిక విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఇంగ్లిష్ నేర్చుకోవాలి కానీ, ఇంగ్లిష్ వారి బుద్ధులు తెచ్చుకోకూడదని అన్నారు. ‘పిల్ల‌ల‌కు తెలుగు నేర్పించండి.. తెలుగు మ‌ర్చిపోతే అమ్మ‌ను కూడా మ‌ర్చిపోతారు. హిందీ, ఇంగ్లిష్ తో పాటు అన్ని భాష‌లు నేర్చుకోవాలి. మ‌మ్మీ, డాడీ, డ‌మ్మీ అని అన‌కూడ‌దు.. చ‌క్క‌గా తెలుగులో అమ్మ‌, నాన్న అనండి. అమ్మ అంటే క‌డుపులోంచి ప‌దం వ‌స్తుంది. మ‌మ్మీ అంటే గొంతులోనుంచి మాత్ర‌మే వ‌స్తుంది’ అని వ్యాఖ్యానించారు. తెలుగు వాడిగా తాను గ‌ర్విస్తున్నాన‌ని వెంక‌య్య‌నాయుడు అన్నారు. ప్ర‌పంచంలోని ఎన్నో సంస్థ‌ల‌కు అధిప‌తులుగా భారతీయులే ఉన్నార‌ని, అందులోనూ తెలుగు వారే ఎక్కువ‌గా ఉన్నార‌ని ఆయ‌న‌ చెప్పారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్య‌మ‌ని చెప్పారు. ఇంకా ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మంత్రులు చిన రాజప్ప, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్‌బాబు, ఎంపీ గల్లా జయదేవ్‌ తదితరులు పాల్గొన్నారు.   కాగా విట్‌ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాలు కేటాయించింది. తొలిదశలో వంద ఎకరాల్లో విట్‌ వర్సిటీ భవన నిర్మాణాలు చేపట్టనున్నారు. మెడికల్‌ జోన్‌ కింద డెంటల్‌, పారా మెడికల్‌, నర్సింగ్‌ కోర్సుల నిర్వహణకు అనుగుణంగా భవన నిర్మాణాలు చేపడతామని విట్‌ వైస్‌ఛాన్సలర్‌ విశ్వనాథన్‌ తెలిపారు.

ఆర్కే గురించి మాకు తేలీదు..

ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే దీనిలో భాగంగా.. తన భర్త ఆర్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని... అతనిని కోర్టులో హాజరుపరచాలని ఆయన భార్య పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు కూడా ఆర్కే గురించి చెప్పాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక దీనిపై ఈరోజు ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆర్కే తమ దగ్గర లేడని పోలీసులు చెప్పారు. మరోవైపు పోలీసులు అదుపులోనే ఆర్కే ఉన్నాడ‌ని మీ వ‌ద్ద ఆధారాలు ఉన్నాయా అని పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాదిని హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ప్ర‌శ్నించగా.. రెండు వారాల్లో ఆధారాలు స‌మ‌ర్పిస్తామ‌ని పిటిష‌న‌ర్ త‌ర‌ఫున్యాయ‌వాది చెప్పారు. దీంతో కోర్టు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.