కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం...
posted on Nov 7, 2016 @ 3:17PM
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఎప్పటినుండో వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై కేరళ ప్రభుత్వం ఓ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత కొద్ది సంవత్సరాలుగా రుతుక్రమానికి లోనయ్యే 10 ఏళ్ల బాలికల నుంచి 50 ఏళ్ల మహిళల వరకు శబరిమల ఆలయంలోకి ప్రవేశించరాదన్న నిబంధనను ఆలయ బోర్డు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆలయంలోకి వయస్సుతో నిమిత్తం లేకుండా మహిళలందరికీ ప్రవేశం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు కేరళ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సుప్రీంకు తెలియజేసింది. దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతండగా
‘దేవుణ్ణి పూజించడానికి ఫలానా భక్తులు మాత్రమే అర్హులని ఎక్కడైనా ఉంటుందా? అసలు దేవునికి భక్తుల విషయంలో తేడాలు ఉంటాయా? చిన్నాపెద్దా, కులం, మతంతోపాటు లింగబేధం కూడా ఉంటాయా?’ అని ప్రశ్నించింది. ‘ఏ విధానం ఆధారంగా ఆలయాలకు వెళ్లకుండా మహిళలను అడ్డుకుంటున్నారు? దేవుణ్ణి ఎవరైనా ఆరాధించవచ్చు. దేవుడు సర్వాంతర్యామి అయినప్పుడు ఆయన దర్శనానికి స్త్రీ, పురుష వివక్ష ఏమిట’ని సుప్రీం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో మహిళల ఆలయ ప్రవేశం విషయంలో సుప్రీంకోర్టుకు తన తాజా నిర్ణయాన్ని కేరళ ప్రభుత్వం తెలిపింది. కేరళ నిర్ణయాన్ని నమోదుచేసుకున్న సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణను ఫిబ్రవరికి వాయిదా వేసింది.