శాంసంగ్‌పై అవినీతి ఆరోపణలు..
posted on Nov 8, 2016 9:23AM
ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కంపెనీ శాంసంగ్‌కు వారి సొంతదేశంలో ఊహించని షాక్ తగిలింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఉన్న శాంసంగ్ ప్రధాన కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. దేశాధ్యక్షురాలు పార్క్ జ్యున్-హై ఆప్తమిత్రురాలు చాయ్ సూన్-సిల్ అవినీతి కేసుతో సంబంధం ఉందన్న అనుమానంతో శాంసంగ్ కంపెనీలో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
జర్మనీలో చాయ్ సూన్‌కు ఉన్న కంపెనీకి శాంసంగ్ అక్రమంగా 3.1 మిలియన్ డాలర్లు బదిలీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. చాయ్ సూన్ కుమార్తె చుంగ్ యో-రా గుర్రపు స్వారీ శిక్షణ నిమిత్తం ఈ నిధులను బదిలీ చేసినట్లు తెలియడంతో ఈ సోదాలు జరిగాయి. అవినీతి ఆరోపణలతో చాయ్ సూన్ అరెస్ట్ కావడంతో ప్రధాని, ఆర్థిక మంత్రులను దేశాధ్యక్షురాలు పార్క్ జ్యున్-హై ఈనెల 2న తొలగించారు. అంతేకాకుండా రెండు ఎన్జీవోలకు అక్రమంగా నిధులు ఇవ్వాలని స్థానిక కంపెనీలను చాయ్ సూన్ ఒత్తిడి చేస్తున్నారని శాంసంగ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వాంగ్మూలం ఇచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ సోదాలు జరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.