ఇండియన్-అమెరిన్లకు ట్రంప్ థ్యాంక్స్...వైట్హౌస్కు భారత్ బెస్ట్ ఫ్రెండ్

  అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులపై, హిందువులపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి ట్రంప్ హిందువులను గొప్పగా కొనియాడారు. అమెరికా ఎన్నికల్లో గెలిచినందుకు గాను ఆయన విజయోత్సవ ర్యాలి నిర్వహించారు. ఎన్నికల్లో అనూహ్య భరితంగా విజయం సాధించడంతో కీలక రాష్ట్రాలైన ఓర్లాండ్, ఫ్లోరిడాలో ట్రంప్ కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇండియన్-అమెరిన్లకు కృతజ్ఞతలు చెప్పారు. తన విజయానికి కృషిచేసినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ''వారందరూ ఎక్కడున్నారు. వారికి నేను థ్యాంక్సూ చెప్పాలి. మీరు నాకు ఓటు వేయడం అమేజింగ్'' అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న ఆర్థికసంస్కరణలను కూడా ట్రంప్ మెచ్చుకున్నారు. భారత్-అమెరికా సంబంధాలను మంచిగా కొనసాగించేందుకు కృషిచేస్తానని ట్రంప్ ఈ సందర్భంగా వాగ్దానం చేశారు. వైట్హౌస్కు భారత్ బెస్ట్ ఫ్రెండ్ కాబోతుందని పేర్కొన్నారు.

కేసీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే పొగడ్తలు...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రశంసలు కురిపించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో.. శాసనసభలో  విద్యుత్ అంశంపై చర్చ జరుగుతుంది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో గతంలో కంటే మెరుగైన విద్యుత్ ను పొందుతున్నామని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ విషయంలో తీసుకున్న విధానాన్ని తాను అభినందిస్తున్నానని... సోలార్ ప్యానల్స్ మీద రైతులకు సబ్సిడీ ఇవ్వాలని... సోలార్ విద్యుత్ పై రైతులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం తనకు ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పారు. మరి ఈ విషయంపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూద్దాం..

జేఎన్‌టీయూ కాదు జేఎన్‌యూ... ఫాలోవ‌ర్ల‌కు పవన్ సారీ...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా బీజేపీపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గోవధ, రోహిత్ వేముల ఆత్మహత్య పై పలు ప్రశ్నలు సంధించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో అంశంపై  ప్ర‌శ్నించిన సంగతి విదితమే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ‘జేఎన్‌టీయూలో విద్యార్థుల‌పై దేశ ద్రోహం పెట్టారు, కానీ, వారు దేశ ద్రోహానికి పాల్పడ‌లేదు.. తరువాత ఆ విషయం రుజువైంది’ అని పేర్కొన్నారు. అయితే తరువాత మ‌రికొద్ది సేప‌టికి తాను త‌న ట్వీట్‌లో జేఎన్‌టీయూ అని పేర్కొన్నాన‌ని, దాన్ని స‌రిచేస్తున్నాన‌ని అది ‘జేఎన్‌టీయూ కాదు- ఢిల్లీలోని జేఎన్‌యూ’ అని తన ఫాలోవ‌ర్ల‌కు సారీ చెప్పారు. రేపు తాను ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంపై పోస్ట్ చేస్తాన‌ని చెప్పారు. ఆఖ‌రికి జై హింద్ అని పేర్కొన్నారు.   కాగా దేశం ద్రోహంపై పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసిన సంగతి విదితమే. 'ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ అభిప్రాయంతోగానీ, విధానంతోగానీ విభేదిస్తే.. వారిని దేశద్రోహులుగా ముద్ర వేయకూడదు. ఇకవేళ వారు తమ ప్రత్యర్థుల గురించి తీవ్ర అభిప్రాయాలు వెల్లడించినా.. వారి గొంతును నులిమివేయకుండా మొదట వారు చెప్పేది వినాలి. ఆ తర్వాత అవసరమైన చర్యలు తీసుకోవాలి. అలాకాకుండా హడావిడిగా చర్యలు తీసుకుంటే జేఎన్‌యూ విద్యార్థులపై 'దేశద్రోహం' కేసు మాదిరిగానే ఎదురుదెబ్బ తగిలే అవకాశముంటుంది. జేఎన్‌యూ విద్యార్థుల కేసులో చివరకు వారి వీడియో కావాలని మార్చినట్టు తేలింది' అని అన్నారు.   

ప్రభుత్వ సలహాదారుగా మాజీ ఎంపీ వివేక్...

  తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా మాజీ ఎంపీ వివేక్ నియామకం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోని డీ బ్లాక్‌లోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన తన ఛాంబర్‌లో పండితులు పూజలు చేశారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. పొరుగు రాష్ర్టాలతో మాట్లాడి తెలంగాణ హక్కులు రక్షించుకోవడంతో కీలకపాత్ర పోషిస్తానని.. కృష్ణా, గోదావరి జలాల వాటాలను సాధించడంలోనూ, విద్యుత్ విషయంలోనూ నిర్విరామంగా కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ సలహాదారుగా నియమించినందుకు సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి కడియం శ్రీహరి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు వివేక్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

కరుణానిధిని పరామర్సించిన రాహుల్ గాంధీ...

  డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం మరింత క్షీణించడంతో కావేరి హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కరుణానిధిని పరామర్శించేందుకు గాను చెన్నై వెళ్లారు. అక్కడ కరుణానిధిని పరామర్శించిన ఆయన అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడారు.ఈ సందర్భంగా, కరుణ కుమార్తె, డీఎంకే ఎంపీ కనిమొళి కన్నీరుమున్నీరు అయ్యారు. రాహుల్ వెంట, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా ఉన్నారు.   కాగా గొంతు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా గత రెండు రోజులుగా చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో కరుణ చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో 'ట్రక్యోస్టమీ' అనే పరికరం సహాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు.

పుతిన్ కు ఒబామా వార్నింగ్...

  ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బ‌రాక్ ఒబామా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు వార్నింగ్ ఇచ్చారంట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. అసలు సంగతేంటంటే...  సెప్టెంబ‌ర్‌లో జ‌రిగిన ఓ స‌మావేశంలో ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌ను ఒబామా క‌లుసుకున్నారు. ఆ స‌మావేశంలో పుతిన్‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్లు ఒబామా చెప్పారు. ఈ-మెయిళ్ల హ్యాకింగ్‌ను త‌క్ష‌ణ‌మే ఆపేయాల‌ని, లేదంటే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని పుతిన్‌ను హెచ్చ‌రించిన‌ట్లు ఒబామా తెలిపారు. కాగా అమెరికా ఎన్నిక‌ల స‌మ‌యంలో డెమోక్ర‌టిక్ అభ్యర్థి హిల్ల‌ర్లీ క్లింట‌న్ ఈమెయిళ్లు హ్యాక్‌కు గురైన విష‌యం తెలిసిందే. దీనిపై ఒబామా స్పందిస్తూ, పుతిన్‌కు తెలియ‌కుండా ర‌ష్యాలో ఏమీజ‌ర‌గ‌ద‌ని ఆయ‌న అన్నారు. సైబ‌ర్ నేరాల‌ను అడ్డుకునేందుకు తాము దూకుడుగా వ్య‌వ‌హ‌రించనున్న‌ట్లు ఒబామా అన్నారు. ర‌ష్యా త‌మ‌కు ఏది చేయాల‌నుకున్నా, తాము కూడా ఆ దేశానికి అదే చేసే సామ‌ర్థ్యం ఉంద‌న్నారు. మరి దీనిపై పుతిన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత దిగజారిన కరణానిధి ఆరోగ్యం..

  మొన్నటి వరకూ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై ఆందోళనలు నెలకొన్నాయి. ఇప్పుడు  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు తలెత్తుతున్నాయి. గత కొంత కాలంగా కరుణానిధి అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో గొంతు, ఊపిరితిత్తుల్లో సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో గురువారం రాత్రి ఆస్పత్రిలో చేర్పించారు. ఈనెల 7వ తేదీనే డిశ్చార్జి అయిన ఆయన మళ్లీ కావేరీ ఆస్పత్రిలో చేరడంతో డీఎంకే కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. కరుణ ఆస్పత్రిలో చేరిన సమయంలో ఆయన వెంట సతీమణి రాజాత్తి అమ్మాళ్, తనయుడు స్టాలిన్, కుమార్తె కనిమొళి, సీనియర్ నేతలు ఉన్నారు. కనిమొళి కన్నీరు పెట్టుకుంటూ ఆస్పత్రి నుంచి బయటకు రావడంతో ఆందోళన మరింత ఎక్కువైంది.   ఇదిలా ఉండగా కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై కావేరి ఆస్పత్రి ఈడీ ఆరవిందన్ హెల్త్ బులిటెన్ విడుదుల చేశారు. కరుణానిధి గొంతు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారని.. ఐసీయూలో వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నామని తెలిపారు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు పడుతుంటే గొంతుకు రంధ్రం చేసి ఈ  పరికరాన్ని అమర్చినట్టు వైద్యులు తెలిపారు. యాంటీబయాటిక్స్‌తో ఆయనకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్టు వివరించారు.

టీడీపీ నేతలు కూడా ఔట్...

  తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పటికే సభలో గందరగోళం సృష్టిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. పార్టీ ఫిరాయింపులు, కేజీ టు పీజ ఉచిత విద్య, బోధన రుసుంల అంశాలపై చర్చించాలని పట్టుబట్టిన నేపథ్యంలో వారిని సభనుండి సస్పెండ్ చేశారు. ఇప్పుడు వారితో పాటు ఇద్దరు తెదేపా సభ్యులు కూడా సస్పెండయ్యారు. వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని కోరుతూ ఆందోళనకు దిగిన తెదేపా సభ్యులు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యను ఒక రోజు సస్పెండ్‌ చేస్తున్నట్లు సభాపతి మధుసూదనాచారి ప్రకటించారు. ఇక సభ్యుల సస్పెన్షన్‌ అంశంపై స్పందించిన భాజపా ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి.. పార్టీ ఫిరాయింపులపై చర్చ అడిగిన సభ్యులను సస్పెండ్‌ చేయడం సరికాదని.. చట్టాలను సంరక్షించాల్సిన బాధ్యత సభపై ఉందన్నారు. దీనిపై స్పీకర్‌ మధుసూదనాచారి స్పందిస్తూ.. పార్టీ ఫిరాయింపుల అంశం తమ పరిశీలనలో ఉందన్నారు. తాము నిర్ణయం తీసుకునే వరకు సభ్యులు వేచి చూస్తే బాగుంటుందన్నారు.

విషమంగా మారిన ఛోటా రాజన్ ఆరోగ్యం...

  మాఫియా డాన్ ఛోటా రాజన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అసలు తనకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతోనే పోలీసులకి దొరికాడన్న ఆరోపణలు ముందు నుండి వస్తున్న సంగతి తెలిసిందే. మూత్రపిండాలు, గుండె సమస్యలతో బాధపడుతున్న ఛోటా రాజన్ కు హైపర్ టెన్షన్, లాపరోటమీ, ఇన్సిషనల్ హెర్నియాలు కూడా ఉన్నాయట. దీనికి తోడు అప్పుడప్పుడు కడుపునొప్పి, ముక్కులో నుంచి రక్తం కూడా వస్తోందట. కొన్నిసార్లు అసలు నిద్ర కూడా పట్టదట. దీంతో కార్డియాలజీ, యూరాలజీ విభాగాల్లో అతనికి చికిత్స అందించాలంటూ ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ హాస్పిటల్ డాక్టర్లు సూచించారు. ఇక అతని ఆరోగ్యంపై స్పందించిన కోర్టు సైతం అతనికి సరైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ అసెంబ్లీ... కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సస్పెన్షన్..

  తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఇక సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలు మొదలు పెట్టగా.. పార్టీ ఫిరాయింపులు, కేజీ టు పీజ ఉచిత విద్య, బోధన రుసుంల అంశాలపై విపక్షాలు వాయిదా తీర్మానాలను ఇచ్చిన నేపథ్యలో వాటిపై చర్చించాల్సిందే అని పట్టుబట్టాయి. ప్రశ్నోత్తరాల సమయం తర్వాతనే వాయిదా తీర్మానాలను తీసుకుంటామని స్పీకర్ తెలిపినా వారు ఆందోళనను విరమించలేదు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేశారు. 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. భట్టి విక్రమార్క, డి.కె. అరుణ, జీవన్‌రెడ్డి, చిన్నారెడ్డి, గీతారెడ్డి, పద్మావతిరెడ్డి, వంశీచందర్‌రెడ్డి, సంపత్‌కుమార్, రాంమోహన్‌రెడ్డిలను సభ నుండి సస్పెండ్ చేశారు.

జియో కు ధీటుగా బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్....

  జియో ఇస్తున్న ఉచిత సర్వీసులకు ఇతర నెట్ వర్కింగ్లు బెంబేలెత్తిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జియో కు ధీటుగా పలు నెట్ వర్కింగ్లు ఆఫర్ల మీద ఆఫర్లు వినియోగదారులకు అందిస్తున్నా.. జియో ప్రభంజనం ముందు తట్టుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ కూడా వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది .ప్రీపెయిడ్ కస్టమర్లకు పరిమిత ఉచిత డేటాతో కూడిన అపరిమిత వాయిస్ కాలింగ్ ఆఫర్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు సంస్థ తెలిపింది. అదేంటంటే..కేవలం రూ.99తో రీఛార్జ్ చేపించుకుంటే చాలని.. నెల రోజుల పాటు అపరిమితంగా లోకల్ కాల్స్, బీఎస్ఎన్ఎల్ నుంచి బీఎస్ఎన్ఎల్ ఎస్టీడీ కాల్స్ వాడుకోవచ్చని, వాటితో పాటు 300 ఎంబీ డేటా కూడా ఉచితంగా అందుబాటులో ఉంచుతామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ప్రస్తుతం ఈ రేటు సర్వీసు కోల్కత్తా టీడీ, పశ్చిమబెంగాల్, బిహార్, జార్ఖాండ్, అసోం, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, మహారాష్ట్ర, రాజస్తాన్లు నెట్వర్క్ పరిధిలోని కాల్స్కు అందుబాటులో ఉందని... ఇదే ఆఫర్ ఇతర సర్కిళ్లలో రూ.119 నుంచి రూ.149కు కల్పిస్తామని కంపెనీ పేర్కొంది.

రూ.24వేలు విత్ డ్రా అమలుచేయాలి.. కేంద్రానికి సుప్రీం ఆదేశాలు

  పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో సూచనలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు కేంద్రానికి కొత్త ఆదేశాలు జారీచేసింది. పెద్ద నోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేసిన సుప్రీం.. వారానికి రూ.24వేలు విత్ డ్రా చేసుకునే సదుపాయాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయాలని ఆదేశాలు జారీచేసింది. కాగా పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత ఆర్‌బీఐ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఒక వ్యక్తి వారానికి రూ.24వేలు విత్ డ్రా చేసుకోవచ్చని పేర్కొన్న నేపథ్యంలో.. దీన్ని ఉల్లంఘించడానికి వీలు లేదని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్‌తో నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం కేంద్రానికి నిర్దేశించిన విషయం తెలిసిందే.

తొలిరోజు ముగిసిన ఆట.. ఇంగ్లండ్ 4 వికెట్ల‌కు 284 ప‌రుగులు

  భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. చెన్నై చెపాక్‌ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 4 వికెట్ల‌కు 284 ప‌రుగులు చేసింది. ముందు బ్యాటింగ్ కు దిగిన కుక్, ఆతరువాత జెన్నింగ్స్ వికెట్లు కోల్పోయిన వెంటనే ఇంగ్లండ్ జట్టు కాస్త ఇబ్బందుల్లో పడింది. అయితే ఈ తరువాత వచ్చిన  అలీ రూట్ నిలదొక్కుకొని టీమ్ కు బాగానే పరుగులు తీసి పెట్టాడు. అతనికి రూట్ తోడవ్వడంతో జట్టుకు భారీగానే స్కోర్ అందించారు. దీంతో జట్టు కాస్త కుదుటపడింది అనుకునేలోపు జడేజా బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట‌య్యాడు రూట్. త‌రువాత‌ క్రీజులోకి వ‌చ్చిన బెయిర్ స్టో 49 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద జ‌డేజా బౌలింగ్‌లో రాహుల్ కి క్యాచ్ ఇచ్చి అవుట‌య్యాడు. ప్రస్తుతం..  ప్ర‌స్తుతం క్రీజులో అలీ 111, స్టోక్స్ 5 ప‌రుగులతో ఉన్నారు.

రోహిత్ వేముల ఆత్మహత్యపై పవన్ కళ్యాణ్.. బీజేపీకి వ్యతిరేకంగా..

  హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్‌ వేముల సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అంతేకాదు ఈ విషయాన్ని కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయంగా కూడా బాగానే ఉపయోగించుకున్నారు. అది గతకొద్ది రోజులుగా ఈ విషయం గురించి ఎక్కడా చర్చలులేవు. దాదాపు అందరూ మర్చిపోయారు. అయితే ఇప్పుడు దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించి.. మరోసారి ఈ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు ట్విట్టర్ ఖాతా తన అభిప్రాయాలు వెల్లడిస్తారు. నిన్న గోవధ గురించి పలు ప్రశ్నలు సంధించిన ఆయన ఈరోజు రోహిత్‌ వేముల ఆత్మహత్య అంశంపై ట్విట్టర్‌లో స్పందించి.. తన అభిప్రాయాలను వెల్లడించారు.   * రోహిత్‌ వేములకు క్యాంపస్‌ నుంచి సస్పెన్షన్‌తో పాటు వెలివేత శిక్ష పడింది. అదే అతడిని ఆత్మహత్యకు పురికొల్పింది. తన వర్గంనుంచి అవసరమైన నైతిక బలం లభించకపోవడం కూడా అందుకు మరో కారణమైంది. * రోహిత్‌ వేముల ఆత్మహత్యలో అత్యంత విచారకరమైన అంశం భాజపా వ్యతిరేక పార్టీలన్నీ దాన్ని రాజకీయం చేయడం. వారంతా తమకు అనుకూలంగా దానిని మలచుకుంటే మరోవైపు భాజపా, మిత్రపక్షాలు ఆయన దళితుడు కాదని నిరూపించడంలో నిమగ్నమయ్యాయి. కానీ అందరూ ఒక ప్రశ్నను మాత్రం మర్చిపోయారు.. భవిష్యత్తులో యువత ఇలా నిరాశా నిస్పృహలతో ప్రాణాలు తీసుకోకుండా చూడాలంటే ఏం చేయాలనే విషయాన్ని వారు విస్మరించారు. * ఎప్పటికైనా మన యూనివర్శిటీలు విద్యా వేదికలుగా నిలుస్తాయని.. రాజకీయ పార్టీలకు యుద్ధభూములు కావని ఆశిస్తాను.   ఇంకా దేశభ‌క్తి, పెద్ద‌నోట్ల ర‌ద్దు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదాల‌ పై కూడా ఆయన ప్రశ్నించారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ బీజేపీని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది.

వెళ్లే వారిలో మనమే ఫస్ట్.. ఇచ్చే వాళ్లలో అమెరికా ఫస్ట్

  ఉద్యోగాల కోసమో, లేక ఇతర పనుల కోసమో మన దేశం నుండి ఇతర దేశాలకు వలస వెళ్లివాళ్లు చాలామందే ఉన్నారు. మన ఒక్క దేశం నుండే కాదు.. పలు దేశాల ప్రజలు.. ఇతర దేశాలకు వెళుతూనే ఉంటారు. అయితే అన్ని దేశాల సంగతేమో కానీ.. ఇలా అధికంగా వలస వెళ్లే వారి విషయంలో మాత్రం మన దేశం అగ్రస్థానంలో నిలిచింది. ప్యూ రీసెర్చ్‌ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం..ఇతర దేశాల్లో కోటి 56 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నట్టు వెల్లడించింది. అత్యధిక వలసదారుల సంతతి కలిగిన దేశాల్లో భారత్‌ తర్వాతి స్థానాల్లో వరుసగా మెక్సికో (కోటి 23 లక్షల మంది), రష్యా (కోటి 6 లక్షల మంది), చైనా (95 లక్షల మంది), బంగ్లాదేశ్‌ (72 లక్షల మంది) ఉన్నాయి.   ఇదిలా ఉండగా వలసదారులకు అశ్రయం ఇచ్చే దేశాల్లో అమెరికాది మొదటి స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత జర్మనీ (కోటి 20 లక్షల మంది), రష్యా (కోటి 16 లక్షల మంది), సౌదీ అరేబియా (కోటి 2 లక్షల మంది), బ్రిటన్‌ (85 లక్షల మంది) దేశాలు ఎక్కువ మంది వలసదారులకు ఆశ్రయం ఇచ్చాయి.