మోడీ తో రాహుల్ భేటీ.. ఇద్దరం కలుస్తూ ఉందాం..

  ప్రధాని నరేంద్ర మోడీతో, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. పెద్ద నోట్ల రద్దు తరువాత రాహుల్ గాంధీ మోడీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈనేపథ్యంలో రాహుల్ గాంధీ, మోడీని కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే రాహుల్ గాంధీ, ఇంకా పలువురు కాంగ్రెస్ నేతలు మోడీని కలిసి  రైతు రుణాలను మాఫీలు, ఇతర విషయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా భేటీ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ..రైతు రుణాలను మాఫీ చేయాలని కోరేందుకు వెళ్లామని.. రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్న విషయాన్ని ప్రధానమంత్రి కూడా అంగీకరించారు గానీ, రుణ మాఫీ విషయంలో మాత్రం ఏమీ చెప్పలేదని ఆయన తెలిపారు. ఇంకా ఒకవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. మరోవైపు ప్రభుత్వం గోధుమల మీద దిగుమతి సుంకాన్ని ఎత్తేయడం సరికాదని ఆయన చెప్పారు. అంతేకాదు మనమిద్దరం తరచు కలుస్తూ ఉందామని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ... రాహుల్‌తో చెప్పినట్టు తెలుస్తోంది.

శశికళ vs శశికళ... పదవికి పనికిరారు

  శశికళ నటరాజన్ పై ఆ పార్టీ బహిష్కృత నేత శశికళ పుష్ప ఇప్పటికే పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతికి శశికళనే కారణమంటూ ఆమె ఆరోపించారు. ఇప్పుడు మరోసారి ఆమె శశికళపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మ మరణానంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి శశికళను ఎంపిక చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ పేరును సూచించిన సందర్భంగా దీనిపై శశికళ పుష్ప స్పందించి...శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎంపిక చేయడం సరికాదని, ఆ పదవికి జయలలిత ఆమె పేరును ఎప్పుడూ సూచించలేదని పుష్ప పేర్కొన్నారు. అందుకే ఆమెకు కనీసం కౌన్సిలర్‌ పదవిగానీ, ఎమ్మెల్యే సీటు గానీ ఇవ్వలేదని, శశికళ రాజకీయాలకు పనికిరారని అన్నారు. జయ మృతికి ఇంతకుముందు కుట్ర పన్నినందుకే ఆమెను జయలలిత బహిష్కరించారని అన్నారు. అంతేకాదు ప్రజాస్వామ్య బద్ధంగా ప్రధాన కార్యదర్శి నియామకం చేపట్టాలంటూ తాను మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. పెద్ద నోట్ల రద్దుపై చర్చ..

  తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రారంభమైన ఈ సమావేశాలు... ఈ నెల 30 వరకు జరుగుతాయి. అసెంబ్లీ సమావేశాలలో పెద్దనోట్ల రద్దుపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. పెద్ద నోట్ల రద్దుపై చర్చను ప్రారంభించారు. దేశ ప్రయోజనాల కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తున్నదని.. అవినీతి, ఉగ్రవాదం, నల్లధనం నిర్మూలనకు ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారని...అవినీతి రహిత భారతాన్ని నిర్మించేందుకు సహకరిస్తామని తెలిపారు. నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నామని.. ప్రధానిని కలిసి చేపట్టాల్సిన పనులను సూచించామని చెప్పారు. ఆసరా పెన్షన్లు విషయంలో ఏర్పడుతున్న ఇబ్బందులను వివరించామన్నారు. నగదు కొరత తీర్చేందుకు రెండుసార్లు ఆర్‌బీఐకి లేఖ రాశామని తెలిపారు. నల్లధనం నిర్మూలించే దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. ఇదిలా ఉండగా.. విపక్షాలు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, పలు సమస్యలపై చర్చించేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. దీంతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై ఆసక్తి రేగుతోంది. కాగా ఇప్పటికే పార్లమెంట్ లో ఉభయ సభల్లో పెద్ద నోట్లపై రచ్చ జరుగుతుంది. ఇప్పుడు ఈ సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య ఎన్ని మాటల యుద్ధాలు తలెత్తుతాయో చూడాలి.

కోహ్లీని టార్గెట్ చేసిన సెహ్వాగ్... పేరు మార్చుకో...

టీమిండియా డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ మన దేశంపై కానీ, భారత్ జట్టు, జట్టు సభ్యులపై కానీ ఎవరైనా కాస్త విమర్సించినట్టు మాట్లాడినా వారికి ట్విట్టర్ వేదికగా గట్టి కౌంటర్లు ఇస్తుంటారు. అలాంటి సెహ్వాగ్ కన్ను ఇప్పుడు కోహ్లీపై పడింది. అదేదో నెగిటివ్ గా కాదులెండి.. పాజిటివ్ గానే. ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సెహ్వాగ్ ప్రస్తుతం కోహ్లీ ఫామ్ గురించి ట్వీట్ చేశాడు. విరాట్‌ వెంటనే తన పేరును మార్చుకోవాలని సూచించాడు. కోహ్లీ అద్భుతమైన బ్యాట్స్ మెన్ అని, మెరుపులాంటి వాడని కితాబిచ్చాడు. అంతేకాదు, అతని పేరును 'మెరుపు'గా మార్చుకోవాలని అన్నాడు.   కాగా కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంగతి క్రికెట్‌ అభిమానులకు తెలిసిందే. బ్యాట్స్‌మన్‌గా, టెస్టు కెప్టెన్‌గా రికార్డులు తిరగరాస్తున్నాడు. అన్ని ఫార్మాట్లలో పరుగుల సగటు దాదాపు 90 శాతం ఉంది.

పార్లమెంట్ సమావేశాలు.. ఆఖరి రోజు..

పార్లమెంట్ ఉభయ సభలు ఈరోజు ప్రారంభమయ్యాయి. గత నెల 16వ తేదీన ప్రారంభమైన శీతాకాల సమావేశాలు ఈరోజుతో ముగియనున్నాయి. సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి సభల్లో పెద్ద నోట్ల రద్దుపై ఆందోళనలు తప్ప చర్చలు జరిగింది మాత్రం లేదు. ప్రధాని మోడీ సభకు రావాలని.. నోట్ల రద్దుపై చర్చించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఒకటి రెండు సార్లు మోడీ సభకు వచ్చినా.. చర్చించే అవకాశం మాత్రం ఇవ్వలేదు ప్రతిపక్షపార్టీలు. దీంతో ఒకరకంగా చెప్పాలంటే శీతాకాల సమావేశాలు అర్థ్రాంతంగా ముగిశాయనే చెప్పొచ్చు. మరి ఈ ఆఖరిరోజు కూడా సభలో అదే పరిస్థితి కనిపిస్తోంది.

అనురాగ్ ఠాకూర్ స్థానంలో మహిళా ఎంపీ...

బీసీసీఐ అధ్యక్షుడు  అనురాగ్ ఠాకూర్ ను పదవి నుండి తొలగించనున్నారా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. బీసీసీఐ అధ్యక్షుడు, భారతీయ యువమోర్చా ఉన్న అనురాగ్ ఠాకూర్ ను పదవి నుంచి తొలగిస్తూ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తాజాగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అంతేకాదు ఆ స్థానంలో యువ మహిళా ఎంపీ పూనమ్ మహాజన్ ను నియమించనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ దివంగత నేత ప్రమోద్ మహాజన్ కుమార్తె అయిన పూనమ్ మహాజన్  (36) ముంబై నార్త్ సెంట్రల్ ఎంపీగా ఉన్నారు. ఇదే విధంగా... బీజేపీ ఎస్సీ, ఎస్టీ, కిసాన్ మోర్చా, ఓబీసీ విభాగాల అధ్యక్షులను కూడా మార్చారు. ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా కౌశాంబి ఎంపీ వినోద్ సర్కార్, ఎస్టీ విభాగం అధ్యక్షుడిగా ఛత్తీస్ గఢ్ రాజ్యసభ సభ్యుడు రాంవిచార్ నేతమ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా వీరేంద్ర సింగ్ మస్త్, ఓబీసీ విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎంపీ దారాసింగ్ చౌహాన్ లను నియమించారు.

ఢిల్లీలో మరో దారుణం.... కారులోనే అత్యాచారం...

  దేశ రాజధాని ఢిల్లీ అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. అక్కడ యువతులపై అత్యాచారాలు జరగడం రోజుకో ఘటన అయిన చూస్తూనే ఉంటాం. ఇప్పుడు తాజాగా మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఉద్యోగం కోసం వచ్చిన ఓ యువతిపై  ట్యాక్సీ డ్రైవర్‌ కారులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉద్యోగం వెతుక్కునేందుకు ఢిల్లీకి వచ్చిన యువతి గురువారం రాత్రి ఎయిమ్స్‌ సమీపంలో ఉండగా.. ఓ టాక్సీ డ్రైవర్‌ నోయిడా వరకు లిఫ్ట్‌ ఇస్తానని కారులో ఎక్కించుకున్నాడు. ఆ తరువాత మోతీబాగ్‌ సమీపంలో కారు ఆపి ఆమెపై అత్యాచారం చేశాడు. అదే సమయంలో అటువైపుగా పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం రావడంతో నిందితుడు కారును అక్కడే వదిలి పారిపోయాడు. పోలీసులు యువతిని రక్షించి సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు కొన్ని గంటల్లోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.

భారత్-ఇంగ్లండ్... తుది పోరు..

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ ఈ రోజు జరుగుతున్న సంగతి తెలిసిందే. చెన్నెలోని చెపాక్‌ స్టేడియం వేదికగా ఈ ఆఖరి మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ ఇప్పటికే 3-0తో కైవసం చేసుకుంది. 4-0తో సిరీస్‌ను గెలుచుకోవాలని భారత్‌ చూస్తుండగా.. ఈ ఒక్క మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తీరాలని ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు భావిస్తున్నారు.   ఇండియా : మురళీ విజయ్, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, కెకె నాయర్, పార్ధీవ్ పటేల్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్   ఇంగ్లండ్: అలిస్టర్ కుక్, జెన్నింగ్స్, రూట్, అలీ, బారిస్టో, స్టోక్స్, బట్లర్, డాసన్, రషీద్, బ్రాడ్, బాల్

చిక్కుల్లో బీసీసీఐ అధ్య‌క్షుడు అనురాగ్ ఠాకూర్...

  ఇప్పటికే బీసీసీఐ, లోధా కమిటీ మధ్య వివాదాలు ఉన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ కూడా జరుగుతున్న సంగతి విదితమే. అయితే ఇప్పుడు తాజాగా బీసీసీఐ అధ్య‌క్షుడు అనురాగ్ ఠాకూర్ చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తోంది. లోధా కమిటీ సంస్కరణల అమలును అడ్డుకొనేందుకు, తాత్సారం చేసేందుకు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ సుప్రీం కోర్టులో అసత్య ప్రమాణం చేశారని అమికస్‌ క్యూరీ గోపాల్‌ సుబ్రమణ్యం వాదించారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు.. కేసు న‌మోదుపై సూచనప్రాయంగా వెల్లడించింది. దీనిపై విచార‌ణ‌కు ఆదేశిస్తామ‌ని కోర్టు స్ప‌ష్టంచేసింది. ఒక‌వేళ దీని నుంచి త‌ప్పించుకోవాలంటే క్ష‌మాప‌ణ చెప్పుకోవ‌చ్చ‌ని, అయితే దానిని కూడా తాము అంగీక‌రిస్తామో లేదో చెప్ప‌లేమ‌ని ధ‌ర్మాస‌నం తెలిపింది.

వారికి కొత్త నోట్లు ఎక్కడి నుండి వస్తున్నాయి... కేంద్రానికి సుప్రీం ప్రశ్న

పెద్ద నోట్ల రద్దుపై సుప్రీం కోర్టులో ఎప్పటి నుండి విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు విషయాల్లో కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించిన సుప్రీం కోర్టు.. ఇప్పుడు తాజాగా మరోసారి కేంద్రం పై ప్రశ్నలు కురిపించింది. పెద్ద నోట్ల రద్దు తరువాత దేశవ్యాప్తంగ ఐటీ శాఖ పలు దాడులు జరపగా పెద్ద మొత్తంలో డబ్బు బయటపడుతున్న సంగతి విదితమే. అది కూడా కొత్త నోట్లు కావడం గమనార్హం. ఇప్పుడు దీనిపైనే సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒకపక్క సామాన్య ప్రజలు కొత్త నోట్ల కోసం బ్యాంకుల దగ్గర, ఏటీఎంల దగ్గర పడిగాపులు కాస్తుంటే.. కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి లక్షల కొద్దీ కొత్తనోట్లు ఎలా చేరుతున్నాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రస్తుతం దేశంలో రెండు రకాల ప్రజలు ఉన్నారనీ.. కట్టలకొద్దీ కొత్తనోట్లు ఉన్నవారు ఒకరైతే.. చేతిలో చిల్లిగవ్వలేని వారు మరొకరని.. దేశంలో కొందరికి కట్టలకొద్దీ నోట్లు ఎలా వెళ్తున్నాయని నిలదీసింది. దీనికి అటార్నీ జనరల్‌ మాట్లాడుతూ.. కొందరు బ్యాంకు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని.. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

పఠాన్ కోట్ లో తెలియని కారు.. భద్రత కట్టుదిట్టం..

  పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ వద్ద మరోసారి భద్రత కట్టుదిట్టం చేశారు. పఠాన్ కోట్ వద్ద ఎవరో ఒక పాత కారును వదిలివెళ్లడంతో గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారమిచ్చారు. అంతేకాదు  అంతేకాక కొంతమంది స్థానికులు కాని, అపరిచితులు ఆ ప్రాంతంలో తిరుగుతున్నట్లు కూడా గమనించామని వారు పోలీసులకు తెలిపారు. దీంతో అక్కడ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పఠాన్‌కోట్‌ జిల్లా పోలీస్‌ చీఫ్‌ రాకేశ్‌ కౌశల్‌ మాట్లాడుతూ... ఫర్వాల్‌ అనే గ్రామం వద్ద ఈ కారును కనుగొన్నామని..జమ్ముకశ్మీర్‌కి చెందిన నంబర్‌ప్లేట్‌ ఉన్న ఆ కారును క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని తెలిపారు. గతంలో కూడా పాకిస్థాన్‌ నుంచి తీవ్రవాదులు ఈ ప్రాంతం నుంచే దేశంలో ప్రవేశించడంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.

డిజిట‌ల్ చెల్లింపు ప్రోత్సాహ‌కానికి రెండు ప‌థ‌కాలు...

  పెద్ద నోట్ల రద్దు అనంతరం కేంద్రం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి పలు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఇప్పుడు దేశంలో దేశంలో డిజిట‌ల్ చెల్లింపుల ప్రోత్సాహ‌కానికి కేంద్ర ప్రభుత్వం రెండు ప‌థ‌కాలు ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ మాట్లాడుతూ న‌గ‌దుర‌హిత లావాదేవీల‌ ప్రోత్సాహకానికి లక్కీ గ్రాహక్ యోజన, డిజిధన్ వ్యాపారి యోజనల‌ను తీసుకురానున్న‌ట్లు తెలిపారు. ఈ నెల 25 నుంచే ఈ రెండు ప‌థ‌కాలను అమ‌ల్లోకి తీసుకురానున్న‌ట్లు పేర్కొన్నారు. ల‌క్కీ గ్రాహ‌క్ యోజ‌న కింద ప్ర‌తిరోజు 15 వేల మంది విజేత‌లను ఎంపిక చేసి, వారికి ప్రోత్సాహ‌కంగా రూ.1000 అందిస్తామ‌ని.. డిజిధ‌న్ వ్యాపారి యోజ‌న కింద వారానికి ఒక‌సారి 7 వేల మందిని ఎంపిక చేసి వారికి బ‌హుమతులు అందిస్తామ‌ని చెప్పారు. ఈ డిజిటల్ చెల్లింపులు ప్రచారం కోసం రూ 340 కోట్ల  రూపాయలను  కేటాయించినట్టు వెల్లడించారు.

చిన్నారికి పురుగులు పట్టిన సెలైన్‌ బాటిల్‌.. పరిస్థితి విషమం..

  ఈ మధ్య ఆస్పత్రుల్లో ఎన్నో దారుణమైన ఘటనలు చోటుచేసుకోవడం చూస్తునే ఉన్నాం. నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ ఎంతో మంది ప్రాణాలు బలిగొంటున్నారు. ఇలాంటి ఘటనే ఇప్పుడు నగరంలోని గాంధీ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వైద్యానికి వచ్చిన ఆరేళ్ల చిన్నారికి వైద్యులు, సిబ్బంది పురుగులు పట్టిన సెలైన్‌ బాటిల్‌ ఎక్కించారు. దీంతో బాలిక పరిస్థితి విషమంగా మారింది. విషయాన్ని గమనించిన చిన్నారి తల్లిదండ్రులు వైద్యులను నిలదీయగా.. వారు సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. ఈ క్రమంలో వారు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా అక్కడ ఆయన కూడా లేకపోవడంతో వారు ఆస్పత్రి వద్ద ధర్నాకు దిగారు. వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

పదవికి రాజీనామా చేయాలనిపిస్తుంది...

  పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటినుండీ ఈరోజు వరకూ ఉభయ సభల్లో ఏం జరుగుతుందో అందరికి తెలిసిన విషయమే. రాజ్యసభలో కానీ, లోక్ సభలో కానీ పెద్ద నోట్ల రద్దుపై విపక్షాలు చేస్తున్న ఆందోళనలు అంతా ఇంతా కాదు. వీరు చేస్తున్న ఆందోళనల వల్ల సభలో ఉన్న సీనియర్ రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి కూడా విదితమే. ఇప్పటికే సభలో జరుగుతున్న తీరుపై బీజేపీ అగ్రనేత అద్వానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉభయసభలు జరుగుతున్న తీరు చూస్తుంటే... సభలో ఉండటం కన్నా ఎంపీ పదవికి రాజీనామా చేయడమే మేలనిపిస్తోందని ఆయన అన్నారు. బాధ్యత గల ఎంపీలు ప్రజాసమస్యలపై చర్చించకుండా... సమావేశాలను తప్పుదారి పట్టించడం సరికాదని వ్యాఖ్యానించారు.

శశికళకే పార్టీ పగ్గాలు..

  తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం పార్టీ పగ్గాలు ఎవరు చేపడుతారబ్బా అని అందరూ అనుకున్న నేపథ్యంలో.. ఆమె నిచ్చెలి అయిన శశికళకే పార్టీ బాధ్యతలు అప్పగించాలని పార్టీ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. జయ స్థానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పన్నీర్ సెల్వం నుండి పార్టీ నేతలందరూ శశికళకే బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ విషయంపై పూర్తి స్పష్టత వచ్చింది. ఈ రోజు పార్టీ తరఫున అధికారికంగా ప్రకటించింది. అన్నా డీఎంకే తదుపరి ప్రధాన కార్యదర్శిగా 54 ఏళ్ల శశికళ బాధ్యతలు చేపడుతారని పార్టీ ప్రతినిధి పొన్నయన్‌ ప్రకటించారు. పార్టీ నాయకులందరూ ఆమె నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, అవసరమైతే పార్టీ నిబంధనలను సవరిస్తామని చెప్పారు.

టాప్ టెన్ లో ప్రధాని మోడీ...

  ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల జాబితాలో టాప్ టెన్ లో స్థానం సంపాదించుకున్నారు. ఫోర్బ్స్ పత్రిక మొత్తం 74 మందితో కూడిన ఈ జాబితాను విడుదల చేయగా.. టాప్ టెన్ లో ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈసారి కూడా మొదటి స్థానంలోనే చోటు సంపాదించుకోగా.. ట్రంప్‌కు రెండోర్యాంకు వచ్చింది. జర్మనీ చాన్స్‌లర్‌ మెర్కల్‌ మూడవ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నాల్గవ, పోప్‌ ఫ్రాన్సిస్‌ ఐదో స్థానాల్లో ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ 7, ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ 10, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ 23, యాపిల్ సీఈవో టిమ్ కుక్ 32, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ 43, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల 51వ, ఐసిస్‌ ఉగ్రనేత అబుబకర్‌ అల్ బాగ్దాదీ 57వ ర్యాంక్‌ పొందారు. ఇంకా అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా 48వ స్థానంలో నిలిచారు.