ప్రణబ్, మోడీ, రాహుల్ కి శశికళ కృతజ్ఞతలు...
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించినప్పుడు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలు స్వయంగా వచ్చి అమ్మకు నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వారు వచ్చినందుకుగాను జయలలిత నెచ్చెలి అయిన శశికళ వారికి కృతజ్ఞతలు తెలిపారు. దీనిలోభాగంగానే.. జయలలిత మరణానంతరం వ్యక్తిగతంగా వచ్చి నివాళులర్పించి పరామర్శించినందుకు గాను ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ ముగ్గురికీ వేర్వేరుగా లేఖలు రాశారు. ‘చెన్నై వచ్చి, వ్యక్తిగతంగా మీ సంతాపాన్ని తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు. చెన్నై వచ్చే సమయంలో ఇబ్బందులు తలెత్తినా వెనుదిరగకుండా వచ్చారని ఆమె రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ’కి రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘భరించలేని బాధ, శోకంలో ఉన్న సమయంలో వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి సానుభూతిని వ్యక్తపరిచిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు’ అని ప్రధానికి రాశారు. ‘నా పట్ల మీరు చూపించిన సానుభూతి, పలికిని సాంత్వనవచనాలు ఓదార్పునిచ్చాయ’ని రాహుల్‌గాంధీకి రాసిన లేఖలో తెలిపారు. కాగా ఆమె ప్రస్తుతం చెన్నైలోని పొయెస్ గార్డెన్‌లోనే నివాసముంటున్నారు.