మోడీని నిందించినందుకు గొడవ.. క్రికెట్‌ స్టంప్‌తో దాడి..

  పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు గంటల కొద్ది పడిగాపులు కాస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంపై కొంత మంది ప్రశంసలు కురిపిస్తున్నా.. కొంతమంది మాత్రం విమర్శిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు మోడీని విమర్శించినందుకు గాను ఓ వ్యక్తిపై దాడి చేశారు. ఈ ఘటన దేశ రాజధాని అయిన ఢిల్లీలో జరిగింది. వివరాల ప్రకారం... లల్లన్‌ సింగ్‌ కుష్వాహా (45) అనే వ్యక్తి టీవీ కొనేందుకు ఢిల్లీలోని ఇస్మయిల్‌ పూర్‌కు బయలుదేరాడు. ఇంతలో అతనికి ఏటీఎం ముందు బారులుతీరి డబ్బుల కోసం పడిగాపులు పడుతున్న ప్రజలు కనిపించారు. దీంతో కోపం కట్టలు తెంచుకొని వచ్చిన లల్లన్‌ సింగ్‌ మోడీని నిందించాడు. దీంతో ఏటీఎం సమీపంలో కిరాణ దుకాణం నిర్వహించే అస్తిక్‌ అనే వ్యక్తి కుష్వాహాతో గొడవ పడ్డాడు. ఇద్దరి తీవ్రంగా గొడవపడ్డారు. ఈ గొడవలో ఆస్తిక్‌ ఏకంగా కుష్వాహాపై క్రికెట్‌ స్టంప్‌తో దాడి చేశాడు. కుష్వాహా తలకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడు.

నగదు డిపాజిట్లపై ఆర్భీఐ కొత్త షరతులు...

  పెద్ద నోట్ల రద్దు అనంతరం కేంద్రం ఇప్పటివరకూ పలు విషయాల్లో షరతులు పెట్టింది. ఇప్పుడు  కూడా తాజాగా ఓ నగదు డిపాజిట్లపై కేంద్రం పరిమితి విధించింది. అదేంటంటే... డిసెంబర్‌ 30లోగా రూ.5వేలకు పైబడిన నగదును ఒక్కసారి మాత్రమే డిపాజిట్‌ చేసుకునేలా బ్యాంకులకు ఆర్బీఐ తాజా ఆదేశాలు జారీచేసింది.  అంతేకాకుండా రూ.5వేలు పైబడి మొత్తాల డిపాజిట్‌పై బ్యాంకు అధికారులకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఎందుకు డిపాజిట్‌ చేయలేదు? డిపాజిట్‌కు గల ఆలస్యమేమిటన్న ప్రశ్నలకు సంతృప్తికర సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. కేవైసీ పత్రాలు సక్రమంగా ఉంటేనే రూ.50వేలకు పైబడి డిపాజిట్లు తీసుకోవాలని బ్యాంకులకు సూచించింది. అయితే గరీబ్‌ కల్యాణ్‌ యోజన (పీఎంజీకేవై) డిపాజిట్లకు మాత్రం ఈ పరిమితి వర్తించదు.

మసూద్‌ అజర్‌ పై ఛార్జిషీటు దాఖలు...

  దేశంలో సంచలనం సృష్టించిన పటాన్‌ కోట్‌ దాడికి  సంబంధించి ఎన్‌ఐఏ ఈ రోజు ఛార్జిషీటు దాఖలు చేసింది. పాకిస్థాన్‌కు చెందిన జైషే- మొహమ్మద్‌ ఉగ్రసంస్థ చీఫ్‌ మసూద్‌ అజర్‌ ఈ దాడిలో కీలక నిందితుడిగా ఎన్‌ఐఏ  చార్జీషీటులో పేర్కొంది. మసూద్‌ అజర్‌ తోపాటు సోదరుడు అబ్దుల్‌ రౌఫ్‌, మరో ఇద్దరని కూడా ఈ చార్జిషీటులో చేర్చింది.   కాగా ఈ ఏడాది ప్రారంభంలో జనవరిలో కీలక భారత రక్షణ స్థావరమైన ఎయిర్‌ బేస్‌ పై పాక్‌ కు చెందిన ముష్కరులు అనూహ్యంగా దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మసూద్‌, అతడి సోదరుడు, మరో ఇద్దరిపై ఆయుధాల చట్టం, పేలుళ్లకు సంబంధించిన చట్టాలు, పబ్లిక్‌ ప్రాపర్టీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు.

లంచ్ టైం... భారత్ స్కోర్ 477/5

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ లో భాగంగా నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. 391/4పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా లంచ్‌ విరామ సమయానికి భారత్‌ 135 ఓవర్లలో 463/5 స్కోరుతో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో కరుణ్‌ నాయర్ అశ్విన్ ఉన్నారు. ప్రస్తుతం కరుణ్ నాయర్ 122 పరుగులు చేసి టీమిండియాకు భారీస్కోరు సాధించిపెట్టాడు. చేతిలో ఐదు వికెట్లు ఉన్న కోహ్లీ సేన తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 14 పరుగులు వెనుకబడి ఉంది. ఇంగ్లాండ్‌ బౌలర్లు బ్రాడ్‌, అలీ, స్టోక్స్‌, రషీద్‌, డాసన్‌ తలో వికెట్‌ తీసుకున్నారు. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 477పరుగులు చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే 3-0 తో సిరీస్ ను చేజిక్కించుకున్న టీమిండియా పై ఇంగ్లండ్ ఈ ఒక్క మ్యాచ్ అయినా గెలవాలని ప్రయత్నించింది. కానీ అది కూడా జరిగే అవకాశం లేకుండా పోయింది.

రష్యాలో కుప్పకూలిన విమానం...

  రష్యాకు చెందిన ఓ విమానం కప్పకూలిపోయింది. రష్యాలోని రక్షణ శాఖకు చెందిన 2-18 విమానం సైబీరియాలోని బులున్‌స్కీ జిల్లా యాకుతియాలో కూలిపోయినట్లు ఎన్‌ఫోర్స్మెంట్‌ అధికారులు తెలియజేశారు. కోల్ట్‌ సోవో విమానాశ్రయం నుంచి బయలు దేరిన విమానం టిక్సీ అనే గ్రామానికి 16 కిలోమీటర్ల దూరంలో కూలిపోయిందని స్పుత్నిక్‌ న్యూస్‌ వెల్లడించింది. ఈ విమానంలో మొత్తం 40మంది ప్రయాణీకులు ఉండగా వారిలో ఎంతమంది ప్రాణాలతో ఉన్నారనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. అయితే, 27మంది చనిపోయినట్లు బీబీసీ ప్రకటించింది. అయితే, రష్యా రక్షణ శాఖ మాత్రం ఈవిషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు.

సీనియర్ల ర్యాగింగ్.. పాడైన విద్యార్ధి కిడ్నీలు

  కేరళలో ర్యాగింగ్ భూతం మరోసారి వెలుగు చూసింది. ఆఖరికి ర్యాగింగ్ కారణంగా విద్యార్ధి కిడ్నీలు పాడయ్యాయి. వివరాల ప్రకారం.. కేరళలోని కొట్టాయం జిల్లా నట్టకోంలో ఉన్న ఓ పాలిటెక్నిక్ కాలేజీలో ఓ విద్యార్థి మొదటి సంవత్సరం చదువుతూ కాలేజీ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఇదే హాస్టల్ లో ఉంటున్న కొందరు సీనియర్ విద్యార్ధులు సీనియర్‌ విద్యార్థులు జూనియర్లపై ర్యాగింగ్‌కు పాల్పడ్డారు.  దాదాపు 6 గంటల పాటు ఎండలో అదే పనిగా గుంజీళ్లు తీయిస్తూ.. పరుగులు పెట్టిస్తూ వ్యాయామం చేయించారు. ఆ తర్వాత వారితో బలవంతంగా మద్యం తాగించారు. దీంతో వారంతా అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఓ విద్యార్ధికి మాత్రం కిడ్ని సమస్య ఏర్పడింది. ఇప్పుడు ఆ విద్యార్ధి హాస్పిటల్ లో చికిత్స చేయించుకుంటున్నాడు. ఇక విషయం తెలుసుకున్న విద్యార్ధి తల్లిదండ్రులు పోలీసులకు, కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  మరో నలుగురు పరారీలో ఉన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిని సస్పెండ్‌ చేసినట్లు కళాశాల వర్గాలు ప్రకటించాయి.

ఒక్క ఫొటో... ఆరేళ్ల కష్టం..

  సాధారణంగా ఫొటో గ్రాఫర్స్ ఏదైనా ఫొటో తీయాలంటే దానికి కాస్తంత క్రియేటివిటీ జోడించి ఫొటో తీస్తుంటారు. ఇంకా పర్ ఫెక్ట్ ఫొటోగ్రాఫర్స్ అయితే ఎంత కష్టమైనా సరే వాళ్లు తీయాలనుకున్న ఫొటో వచ్చేంత వరకూ ఎదురుచూస్తారు. అలా ఓ పర్ ఫెక్ట్ ఫొటో కోసం ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరేళ్ల పాటు ఎదురుచూశాడంట. అసలు సంగతేంటంటే... స్కాట్లండ్ కు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ అలాన్ మెక్ ఫాడియెన్ అత్యంత పర్ ఫెక్ట్ గా ఉన్న ఈ ఫొటోను తీయడానికి 7 లక్షలకు పైగా ఫొటోలను తీశాడంట. అదేంటంటే..  నీళ్లలోకి దూసుకొస్తున్న కింగ్ ఫిషర్ ఫొటో. ప్రతి సీజన్ లో ఎన్నో ఫొటోలు తీసినప్పటికీ... ఒక్క ఫొటో కూడా తాను కోరుకున్నట్టు రాలేదని.. చివరకు ఆరేళ్ల తర్వాత తన శ్రమ ఫలించిందని... ఈ లక్కీ షాట్ ను ఇన్నాళ్లకు తీయగలిగానని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఆ ఫొటో మీరు కూడా ఓసారి చూడండి...

జాతీయ గీతాలాపన.. ఫోన్లో మహిళా ఎమ్మెల్యే..

  జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో ఫోన్ మాట్లాడి అడ్డంగా బుక్కయ్యారు ఓ మహిళా ఎమ్మెల్యే. ఈ ఘటన పశ్చిమబెంగాల్ లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... పశ్చిమబెంగాల్‌ బాలీ నియోజకవర్గం ఎమ్మెల్యే వైశాలి దాల్మియా ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి వచ్చారు. ఈ సందర్భంగా మ్యాచ్ ప్రారంభం కంటే ముందు స్టేడియంలో జాతీయగీతాలపన చేశారు. ఆ సమయంలో అందరూ జాతీయ గీతం పాడుతుంటే... ఎమ్మెల్యే మాత్రం ఫోన్‌లో మాట్లాడారు. ఇది కాస్త కెమెరా కంటికి చిక్కడంతో వెంటనే ఫొటో తీశారు. దీంతో ఇప్పుడు సదరు ఎమ్మెల్యేపై అందరూ మండిపడుతున్నారు. జాతీయ గీతాన్ని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా జాతీయ గౌరవానికి భంగం కలిగించడాన్ని నిరోధించే చట్టంలోని మూడో సెక్షన్ ప్రకారం సదరు ఎమ్మెల్యే చేసిన ఈ చ‌ర్య‌కు గానూ ఆమెపై చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉందని అంటున్నారు.

తమిళనాడు సీఎంగా శశికళ..?

  తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ముఖ్యమంత్రి బాధ్యతలు పన్నీర్ సెల్వం తీసుకున్నసంగతి తెలిసిందే. ఇక పార్టీ ప్రధాన కార్యదర్శిగా అమ్మ నిచ్చెలి అయిన శశికళకు బాధ్యతలు అప్పగించాలని పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ పగ్గాలు అమ్మచేతికి అప్పగిస్తున్నట్టు ప్రకటన కూడా చేసింది పార్టీ. అయితే ఇప్పుడు తాజాగా ఓ వార్త చక్కెర్లు కొడుతుంది. అదేంటంటే.. ముఖ్యమంత్రి పదవి కూడా శశికళకే కట్టబెట్టాలని చూస్తున్నారట. దీనిలో భాగంగానే.. సీనియర్ నాయకులు కొంతమంది శశికళను కలిసి.. ఇటు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టాలని కోరారట. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టడం ద్వారా కోటిన్నర మంది అన్నాడీఎంకే సభ్యులను, ముఖ్యమంత్రి పదవితో ఏడు కోట్ల మంది తమిళనాడు ప్రజలను కాపాడాల్సిందిగా చిన్నమ్మను కోరామని రాధాకృష్ణన్ చెప్పారు. వీళ్లతో పాటు వివిధ జిల్లాకు చెందిన పలువురు మంత్రులు కూడా ఇదే తరహా తీర్మానాలు చేసి, వాటి కాపీలను శశికళకు అందించారట. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఎంజీఆర్ కాలం నుంచి మంత్రులుగా పనిచేసిన కొంతమంది సీనియర్లు శశికళను వ్యతిరేకించినట్లు కథనాలు వచ్చినా.. తర్వాత ఏమైందో గానీ వాళ్లు కూడా సమాధాన పడిపోయినట్లు కనిపిస్తోంది. మొత్తానికి ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో శశికళ ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మంద కృష్ణ డిమాండ్ పై నితీశ్ కుమార్...

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్‌లో న్యాయం ఉందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. మంద కృష్ణ డిమాండ్ ఏమిటి.. నితీశ్ కుమార్ సమర్ధించడం ఏమింటి అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే... నిన్న మందకృష్ణ పాట్నాలో నితీశ్ కుమార్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఎస్సీ వర్గీకరణ అవసరాన్ని, ఉద్యమం జరుగుతున్న తీరును వివరించగా.. దీనిపై స్పందించిన నితీశ్ కుమార్..  సీఎం మాట్లాడుతూ మంద కృష్ణ డిమాండ్‌లో న్యాయం ఉందని పేర్కొన్నారు. దళితుల్లో ఉన్న అసమానతలను తగ్గించేందుకు బీహార్‌లో  దళిత్-మహాదళిత్‌గా వర్గీకరించినట్టు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత లభిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని.. వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాస్తానని మంద కృష్ణకు నితీశ్ హామీ ఇచ్చారు.

స్పెషల్ ప్యాకేజీపై పవన్ సంచలన వ్యాఖ్యలు

ఈ మధ్య కాలంలో ట్విట్టర్ ద్వారా రోజుకో అంశంపై స్పందిస్తున్న సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, తాజాగా ఏపీకి ప్రత్యేకహోదా అంశంపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించారు. ప్రత్యేక ప్యాకేజ్ అనేది కేవలం కంటితుడుపు చర్య. బీజేపీ చెబుతున్న స్పెషల్ ప్యాకేజ్‌లో "స్పెషల్" అనే పదం తప్ప ఎటువంటి ప్రత్యేకత లేదు. ఆంధ్రా ప్రజలను వెన్నెముక లేని వారిగా, లెక్కలేని మనుషులుగా బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదాపై బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేసిన హామీని నిలబెట్టుకోవాలి. ఆంధ్రులను అవమానపరుస్తూ, బాధకు గురిచేస్తూ, కనీసం రాజధాని లేకుండా కట్టుబట్టలతో వెళ్లగొట్టారు. జైఆంధ్ర ఉద్యమంలో బలిదానం చేసిన 400 మందికి పైగా విద్యార్థులపై మేము ప్రమాణం చేసి చెబుతున్నాం..ఏపీకి పత్యేకహోదా ఇస్తామని హామి ఇచ్చిన బీజేపీ, అందుకు సమాధానం చెప్పే వరకు వదిలిపెట్టం అని జనసేనాని హెచ్చరించారు.

శశికళకు రాములమ్మ మద్దతు

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తర్వాత ఆమె స్నేహితురాలు శశికళకే పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని మద్ధతు పలుకుతున్న వారిలో ప్రముఖ సినీనటి విజయశాంతి కూడా చేరారు. అలాగే అన్నాడీఎంకే‌ పార్టీ అధికారాన్ని లాక్కునే వ్యక్తిలా శశికళ కనిపించడం లేదని విజయశాంతి అన్నారు. తాను ఈ రోజు శశికళను కలిశానని, ఆమె చాలా బాధపడుతు ఉన్నట్లు అనిపించిందని, బయట మాట్లాడుకుంటున్నట్లు ఆ ఉద్దేశ్యం ఆమెలో ఉన్నట్లు తనకు అనిపించలేదని విజయశాంతి అన్నారు. జయలలిత స్థానాన్ని భర్తీ చేయడానికి శశికళే తగిన వ్యక్తి అన్నారు. శశికళతో ప్రాబ్లం ఏమీ లేదని స్వయంగా జయలలిత తనతో చాలాసార్లు అన్నట్లు తెలిపారు. ఆమె అధినేత్రి అవుతానంటే అన్నాడీఎంకే పార్టీలో ఏ సమస్యాలేదని అన్నారు. పార్టీలో అందరూ ఒప్పుకునే మనిషి కాబట్టి, శశికళ ముఖ్యమంత్రి అయితే పార్టీలోనూ ఏ విభేదాలు రాకుండా ఉంటాయని తాను అనుకుంటున్నట్లు చెప్పారు.

పాక్‌లో భారతీయ చిత్రాలకు గ్రీన్‌సిగ్నల్

ఉరీ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో చాలా రంగాలపై దాని ప్రభావం పడింది. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది సినీ పరిశ్రమ. భారతీయ చిత్రాలను పాక్‌లో ప్రదర్శించబోమని పాక్‌ థియేటర్ యజమానులు ప్రకటించారు..దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారతీయ సినీ రంగం..పాక్ కళాకారులపై కన్నెర్ర చేసింది. భారతీయ చిత్రాల్లో పాక్ నటీనటులు, కళాకారులు నటించకూడదని వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని అల్టీమేటాన్ని జారీ చేశాయి. అయితే ఈ విషయంలో పాకిస్థాన్ కాస్త మెత్తబడింది..తమ దేశంలో భారతీయ చిత్రాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు పాక్ థియేటర్ల సంఘం ప్రకటించింది. దీంతో రేపటి నుంచి పాక్‌లో సినిమాలను ప్రదర్శించనున్నారు. భారతీయ చిత్రాలపై నిషేధం కొనసాగడం వల్ల దానిపై ఆధారపడిన థియేటర్ల యజమానులు, ఇతర వ్యాపారులపై ఆ ప్రభావం పడుతోందని..అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రకటించింది.

ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లాలంటే ఆధార్ ఉండాల్సిందే

ప్రస్తుతం దేశంలో ప్రభుత్వా పథకాలు పొందాలన్నా..చివరికి సిమ్‌కార్డ్ తీసుకోవాలన్నా ఇలా ప్రతి పనికి ఆధార్ తప్పనిసరైంది..ఇకమీదట ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లాలన్నా కూడా ఆధార్ కావాల్సిందే. ఇప్పటికే హైదరాబాద్‌‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయోగాత్మకంగా నడుస్తున్న ఆధార్ ఎంట్రీ విధానాన్ని ముంబై, బెంగళూరు ఎయిర్‌‌పోర్టుల్లోనూ అమలు చేసేందుకు విమానయాన శాఖ సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్ విమానాశ్రయంలో ఆధార్ నంబర్ చెప్పగానే భద్రతా సిబ్బంది అతడి గుర్తింపును సరిచూసి లోపలికి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ఒకే ప్రవేశ ద్వారం వద్ద ఇది అమల్లో ఉంది. తాజాగా దీన్ని అన్ని గేట్ల వద్ద అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఆధార్ నంబర్ లేకపోతే ఇతర గుర్తింపు కార్డులను చూపించినా అనుమతించనున్నారు. అయితే ఆధార్ నంబర్ వల్ల చెకింగ్ అనేది వేగంగా జరుగుతుందని అధికారులు తెలిపారు.

చెన్నై టెస్టులో టీమిండియా దూకుడు

ఐదు టెస్టుల సిరీస్‌‌లో భాగంగా ఇంగ్లాండ్‌లో చెన్నైలో జరుగుతున్న చివరిటెస్టులో టీమిండియా దూకుడుగా ఆడుతోంది. మూడో రోజు ఆటలో భాగంగా లంచ్ విరామ సమయానికి 48 ఓవర్లకు వికెట్ నష్టపోయి 173 పరుగులు చేసింది. తొలుత ఓవర్‌నైట్ స్కోరు 60/0తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ తొలి వికెట్‌కు 152 పరుగులు చేసింది. ముఖ్యంగా వికెట్ కీపర్ పార్థివ్‌పటేల్ దూకుడుగా ఆడి అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు..ఈ క్రమంలో మొయిన్ అలీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. లంచ్ విరామానికి రాహుల్ 89 పరుగులతోనూ, పుజారా 11 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. భారత్, ఇంగ్లాండ్ కంటే 304 పరుగులు వెనకబడి ఉంది.

ఇంఫాల్‌లో పుకార్లు..నెట్ సేవలు కట్

మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ఓ చర్చిపై దాడి జరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో పుకార్లు రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో రాజధానిలో మొబైల్, ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధిస్తున్నట్లు మణిపూర్ ప్రభుత్వం ప్రకటించింది. సామాజిక మాధ్యమాలు, ఎమ్మెస్‌ల ద్వారా అసత్య ప్రచారం జరుగుతోందని..అందుకే వెంటనే మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచనలు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా సున్నిత ప్రదేశాల్లో ముందస్తుగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. విషయంపై స్పష్టత వచ్చే వరకు ఇంటర్నెట్ సేవలపై నిషేధం కొనసాగుతుందని మణిపూర్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.