పీపీఎఫ్ పై కన్నేసిన కేంద్రం...

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) వడ్డీ రేట్లను తగ్గించేందుకు కేంద్రం చూస్తుందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) తగ్గిస్తున్నట్టు ప్రకటించిన కేంద్రం... ఇప్పుడు పీపీఎఫ్ పై కూడా కన్నేసినట్టు తెలుస్తోంది. పీపీఎఫ్ ఖాతాల్లో డబ్బు దాచుకుంటుండగా, వీరికి ఇచ్చే వడ్డీపై కోత పెట్టనున్న సంకేతాలను వెలువరించింది. అంతేకాదు పీపీఎఫ్ పై నియమించిన గోపీనాథ్ కమిటీ సిఫార్సు కూడా వడ్డీ రేట్లను తగ్గించాల్సిన అవసరం ఉందని కేంద్రానికి సిఫార్స్ చేసింది. మరి ఈ సిఫార్స్ లను పరిగణలోకి తీసుకొని మోదీ సర్కారు కనుక ఆమోదం పలికితే ప్రస్తుతం 8 శాతంగా ఉన్న వడ్డీ రేటు ఒక శాతం వరకూ తగ్గి 7 శాతానికి చేరుతుంది. ఇటీవలి కాలంలో 10 ఏళ్ల కాలపరిమితిపై విక్రయించిన ప్రభుత్వ బాండ్లపై రాబడి 6.5 శాతానికి తగ్గిన నేపథ్యంలో, వచ్చే జనవరి - మార్చి త్రైమాసికంలో పీపీఎఫ్ ను తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆర్థిక నిపుణులు అంచనాలు వేస్తున్నారు.

రివాల్వర్ తో కాల్పుకొని పోలీస్ అధికారి ఆత్మహత్య...

  పోలీసు అధికారులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఈ మధ్యకాలంలో తరచూ వింటూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా రాజస్థాన్ లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రాజ‌స్థాన్‌లో ఆశిష్ ప్ర‌భాక‌ర్‌ అనే పోలీస్ ఆఫీసర్ యాంటీ టెర్ర‌ర్ స్క్వాడ్‌లో ప‌నిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్ర ప్ర‌భాక‌ర్ ఆఫీసు నుంచి బ‌య‌ట‌కు వెళ్లాడు. త‌న కారులోనే అత‌ను శ‌వ‌మై తేలాడు. స‌ర్వీస్ రివాల్వ‌ర్‌తో త‌న‌ను తాను కాల్చుకున్న‌ట్లు పోలీసులు నిర్ధారించారు. అంతేకాదు పోలీస్ ఆఫీస‌ర్ హ‌త్య చేసుకున్న కారులోనే.. ప‌క్క సీటులో ఓ మ‌హిళ శ‌వాన్ని కూడా కనుగొన్నారు. ఆమె సుమారు 30 ఏళ్లు ఉంటుంద‌ని అంచనా వేస్తున్నారు. మ‌హిళ ద‌గ్గ‌ర మొబైల్ ఫోన్ ఉండటంతో ఆ ఫోన్ ఆధారంగా ఆమె ఎవ‌ర‌న్న‌ది పోలీసులు ఛేదిస్తున్నారు. ఇదిలా ఉండగా త‌న‌ను క్ష‌మించ‌మంటూ పోలీస్ అధికారి త‌న భార్య‌కు లేఖ రాసిన‌ట్లు ఓ లేఖ‌ను గుర్తించారు. ప్ర‌భాక‌ర్ సూసైడ్ వెనుక కుటుంబ స‌మ‌స్య‌లు కార‌ణ‌మై ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్న పోలీసులు ఆదిశగా దర్యాప్తు చేపట్టారు.

జయలలితకు 'భారత రత్న' అర్హత లేదు...

  తమిళనాడు దివంగత ముఖ్యమంత్రికి భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రధాని నరేంద్ర మోడీని కోరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అమ్మకు భారత రత్న ఇవ్వడంపై పీఎంకే యూత్‌వింగ్‌ నాయకుడు అన్బుమణి రాందాస్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. జయలలితకు 'భారత రత్న' పొందే అర్హత లేదని.. ఎలాంటి మచ్చలేని సమగ్ర వ్యక్తిత్వం, దేశ అభివృద్ధికి నిస్వార్థ కృషి చేసినవారికే ఈ అత్యున్నత పురస్కారం ఇవ్వాలని అన్నారు. జయలలిత 15 అవినీతి కేసులను ఎదుర్కొంటున్నారని, ఆమెను నిర్దోషిగా వదిలేసిన కేసుకు సంబంధించి అప్పీల్‌ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని రాందాస్‌ తెలిపారు.

ఆపదవికి నేనూ పోటీ చేస్తా...

  అన్నా డీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప...శశికళ నటరాజన్ పై మొదటి నుండి విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అసలు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చనిపోవడానికి కారణం శశికళ నటరాజనే అని.. ఆమెనే అమ్మను చంపేసిందని..  దీనిపై విచారణ చేయించాలని పలుమార్లు ఆమె ఆరోపించారు. అయితే ఇప్పుడు తాజాగా శశికళ నటరాజన్ కు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టడంపై కూడా ఆమె స్పందించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేయాలని తాను భావిస్తున్నాని.. పార్టీ నుంచి తనను బహిష్కరించలేదని, అన్నా డీఎంకే తరఫున ఎంపీగా కొనసాగుతున్నానని.. అయితే శుక్రవారం వచ్చే హైకోర్టు తీర్పును బట్టి తన నిర్ణయం ఆధారపడి ఉంటుందని చెప్పారు. పార్టీ పగ్గాలు శశికళ నటరాజన్‌కు అప్పగించడానికి పార్టీ కేడర్‌లో దాదాపు 75 శాతం మంది సంతోషంగా లేరని అసలు ఆమె పార‍్టీలో సభ్యురాలే కాదని అన్నారు. మరి కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం..

నజీబ్ జంగ్ ను కలిసిన కేజ్రీవాల్.. ఏ ఉద్దేశం లేదు...

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నిన్న తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇంత సడెన్ గా నజీబ్ జంగ్ రాజీనామా చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ చర్చల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈరోజు ఉదయం నజీబ్ జంగ్ ను కలిశారు. దీంతో ఈయన ఎందుకు కలిశారని సర్వత్రా అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్ మాత్రం... తాను తాను మర్యాద పూర్వకంగానే నజీబ్ జంగ్ ను కలిశానని, ఇందులో మరే ఉద్దేశాలూ లేవని ఆయన స్పష్టం చేశారు. తన వ్యక్తిగత కారణాల వల్లే మాత్రమే నజీబ్ జంగ్ పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారని అన్నారు. తనకెంతో ప్రియమైన విద్యా బోధన రంగంలోకి వెళ్లనున్నట్టు జంగ్ తెలిపారని, ఆయన భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని తాను కోరుకున్నానని వెల్లడించారు. మరి ఎందుకు రాజీనామా చేశారో.. అందులో ఆంతర్యం ఏమిటో బయటకి వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

హైదరాబాద్ చేరుకోనున్న రాష్ట్రపతి...

  శీతాకాల విడిది నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. ఆయన హైదరాబాద్‌లోని హాకీంపేట విమానాశ్రయంలో ల్యాండ్ కానున్నారు. ఇండియన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్‌కు వస్తున్నారు. ప్రణబ్‌కు స్వాగతం పలికేందుకు ఇప్పటికే గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఇతర మంత్రులు, మండలి ఛైర్మన్, స్పీకర్ తదితరులు విమానాశ్రయానికి చేరుకున్నారు.   కాగా నెల‌ 31 వరకు ప్రణబ్ ముఖర్జీ ఇక్కడే ఉంటారు. తన పర్య‌ట‌న‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వ‌హించ‌నున్న ప‌లు కార్య‌క్ర‌మాలకు హాజ‌ర‌వుతారు. రేపు ఆర్మీ కాలేజ్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌లో ఎండీఎస్‌, బీడీఎస్‌ల స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్ర‌సంగిస్తారు. అనంత‌రం ఎఫ్‌టీఏపీసీసీఐ సెంటినరీ ఇయర్‌ సెలబ్రేషన్స్‌కి హాజ‌ర‌వుతారు. అనంత‌రం ఈ నెల 24న న‌గ‌రంలో మహిళా దక్షత సమితి, బన్సీలాల్‌ మలాని కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ లను ప్రారంభిస్తారు.

సీఎం గారి విమానం గాల్లో... అధికారుల ఆందోళన...

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ దాదాపు 45 నిమిషాలపాటు గాలిలోనే ఉండటంతో అందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈరోజు పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేసేందుకు, పలు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందజేసేందు సీఎం కోరాపుట్ వెళ్లారు. కార్యక్రమాల్లో పాల్గొన్న తిరిగి 12.40 గంటలకు రావాల్సి ఉంది. కోరాపుట్ జిల్లాలోని కోట్‌పాద్‌ వద్ద ల్యాండింగ్‌ సమయంలో కొంత సమన్వయ లోపం ఏర్పడటంతో ల్యాండింగ్ కు ప్రాబ్లమ్ అయింది. దీంతో చాలాసేపు విమానం గాల్లోనే ఉండాల్సి వచ్చింది. దీంతో ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యమైపోయిందంటూ వెంటనే వదంతులు వ్యాపించాయి. అధికారుల మధ్య తప్పుడు సమన్వయం వల్ల సీఎం హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ ప్రదేశం కన్నా ముందుకు వెళ్లిపోయింది. ఆ తర్వాత 45 నిమిషాలు గాలిలో ఊగిసలాడి.. చివరకు సురక్షితంగా కోరాపుట్ హెలీప్యాడ్‌ వద్ద ల్యాండ్‌ అయింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆకస్మిక రాజీనామా...

  ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గురువారం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఈ లేఖలో ఇప్పటి వరకు తనకు సహకారం అందించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు నజీబ్‌జంగ్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా తనపై అపారమైన ప్రేమ, అభిమానం చూపిన ఢిల్లీ ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో ప్రజలంతా తనకు ఎంతో సహకరించారని... అందువల్ల పాలనకు ఏమాత్రం అడ్డంకులు ఎదురుకాలేదని చెప్పారు. ఇదిలా ఉండగా నజీబ్‌జంగ్‌ ఆకస్మికంగా రాజీనామా చేయడానికి గల కారణాలపై దిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు నజీబ్‌జంగ్‌ తిరిగి తన బోధనా వృత్తిలో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

  ఈరోజు  నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాలతోనే ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 26వేల పాయింట్ల కీలక స్థాయిని కోల్పోగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌ నిఫ్టీ 8వేల కిందకు జారిపోయింది. సెన్సెక్స్‌ అత్యధికంగా 262.78 పాయింట్లు నష్టపోయి 25,979.60కు చేరింది. నిఫ్టీ అయితే 82.20 పాయింట్ల నష్టంతో 7,979.10 వద్ద స్థిరపడింది.  ఏషియన్‌ పెయింట్స్‌, ఐటీసీ, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, టాటా మోటార్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ తదితర షేర్లు లాభపడగా, హిందాల్కో, అదానీ పోర్ట్స్‌, ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌ మొదలైన షేర్లు నష్టాలు చవి చూశాయి.

వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి

  గత కొద్దికాలంగా పార్టీ ఫిరాయింపులు తగ్గాయి అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఉప్పులేటి కల్పనతో మరోసారి ఊపందుకునే అవకాశం కనిపిస్తుంది. వైసీపీ ఎమ్మెల్యే కల్పన టీడీపీలో చేరుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 23 అంటే రేపు ఆమె టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆమె టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే  ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ నాయకత్వ వైఫల్యం, భవిష్యత్తుపై బెంగ, తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలన్న ఆకాంక్షతోనే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తున్నారని.. టీడీపీలోకి మరికొంత మంది ఎమ్మెల్యేలు రాబోతున్నారంటూ వ్యాఖ్యానించారు. అయితే ఎవరెవరు చేరబోతున్నారన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.

రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డ్.. క్రికెటర్ ఆఫ్ ద ఇయర్

  భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ తో టీమిండియా ఆటగాళ్లు పలు రికార్డులు బద్దలుకొట్టారు. ఇప్పటికే పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్న టీమిండియా స్పిన్నర్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ మరో అవార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటంటే.. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్. దీనితో పాటు సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని కూడా అతడు గెలుచుకున్నాడు. ఇక ఐసీసీ ఈ సంవత్సరానికి టెస్ట్, వన్డే టీమ్‌లను ప్రకటించింది. వన్డే టీమ్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, టెస్ట్ టీమ్ కెప్టెన్‌గా ఆలిస్టర్ కుక్ ఎంపికయ్యారు.2015 సెప్టెంబర్ 14 నుంచి 2016 సెప్టెంబర్ 20వ తేదీ వరకు వాళ్లు చూపిన ప్రతిభ ఆధారంగా ఈ జట్లను ఎంచుకున్నారు.   ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2016   1. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) 2. క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా - వికెట్ కీపర్) 3. రోహిత్ శర్మ (ఇండియా) 4. విరాట్ కోహ్లీ (కెప్టెన్ -ఇండియా) 5. ఏబీ డివీలియర్స్ (దక్షిణాఫ్రికా) 6. జాస్ బట్లర్ (ఇంగ్లండ్‌) 7. మిషెల్ మార్ష్ (ఆస్ట్రేలియా) 8. రవీంద్ర జడేజా (ఇండియా) 9. మిషెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) 10. కగిసో రబడా (దక్షిణాఫ్రికా) 11. సునీల్ నరైన్ (వెస్టిండీస్) 12. ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా)     ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ 2016   1. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) 2. అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్ - కెప్టెన్) 3. కేన్ విలియంసన్ (న్యూజిలాండ్) 4. జో రూట్ (ఇంగ్లండ్‌) 5. ఆడమ్ వోగ్స్ (ఆస్ట్రేలియా) 6. జానీ బెయిర్‌స్టో (ఇంగ్లండ్ - వికెట్ కీపర్) 7. బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్) 8. రవిచంద్రన్ అశ్విన్ (ఇండియా) 9. రంగనా హీరత్ (శ్రీలంక) 10. మిషెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) 11. డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) 12. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)

ముస్లింలపై ట్రంప్.. నేనే కరెక్ట్..

  డొనాల్డ్ ట్రంప్ మొదటినుండి ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన  ఎన్నికల ప్రచారంలో పలుమార్లు ముస్లింల గురించి ప్రస్తావిస్తూ.. తాను కనుక అధికారంలోకి వస్తే ముస్లింలపై నిషేదం విధిస్తానని చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు కూడా మరోసారి ముస్లింలపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బెర్లిన్ లో ట్రక్కుతో ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 12 మంది మృతి చెందగా.. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది తామే అంటూ ఐసిస్ ప్రకటించింది.  మరోవైపు టర్కీ రాజధాని అంకారాలో ఓ ఆర్ట్‌ గ్యాలరీ తిలకించేందుకు వచ్చిన రష్యా రాయబారిపై కాల్పులు జరిపి హతమార్చారు. ఇక దీనిపై స్పందించిన ట్రంప్ బెర్లిన్‌, అంకారాల్లో జరిగిన దాడులు మానవత్వంపై జరిగిన దాడులని, వీటిని వెంటనే ఆపేయాలని అన్నారు. అమెరికాకు వలస వస్తున్న ముస్లింలపై నిషేధం విధించాలన్న మాటకు తాను కట్టుబడి ఉన్నానని, అదే కరెక్ట్‌ అని ఆయన అన్నారు. ముస్లింల వల్లే ఈ దాడులు జరుగుతున్నాయనే దాన్ని నిరూపిస్తానని, తాను చెప్పింది నూటికి నూరుశాతం కరెక్ట్‌ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

రాహుల్ గాంధీకి మోడీ కౌంటర్...

  పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ ఎప్పటినుండో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చారు మోడీ. నేను మాట్లాడితే భూకంపం వస్తుందని మోడీపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో... దీనిపై స్పందించిన మోడీ...''వాళ్లకు ఒక యువ నాయకుడు ఉన్నాడు. అతడు ఎలా మాట్లాడాలో నేర్చుకుంటున్నాడు. ఆయనకు మాట్లాడటం వస్తే నేను చాలా సంతోషిస్తాను. నిజానికి ఆయన మాట్లాడి ఉండకపోతేనే భూకంపం వచ్చేదేమో. ఆ భూకంపాన్ని ప్రజలు పదేళ్ల పాటు అనుభవించాల్సి వచ్చేది. ఆయన మాట్లాడం మొదలు పెట్టడం మంచిదైంది. ఇప్పటికైతే భూకంపం వచ్చే అవకాశం ఏమీ లేదు'' అని మోదీ అన్నారు.

వారు అవినీతిపరులకు కొమ్ముకాస్తున్నారు..

ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మదన్ మోహన్ మాలవ్య క్యాన్సర్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆస్పత్రికి పది ఎకరాలు విరాళం ఇచ్చిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో క్యాన్సర్ కేంద్రం ఏర్పాటు చేశామని.. పేదలకు తక్కువ ఖర్చుతో మందులు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.   ఇంకా నోట్ల రద్దు గురించి ఆయన మాట్లాడుతూ.. కొందరు నేతలు అవినీతిపరులకు కొమ్ముకాస్తున్నారు.. కొందరి ముసుగు తొలగిపోతుంది. కొన్ని చోట్ల నల్లధనం దొరుకుతుంది.. నోట్లరద్దుతో మావోయిస్టులు భారీగా నష్టపోతున్నారు.. ఏమైనా దేశం స్వచ్ఛమైన బంగారంలా మారుతుంది అని అన్నారు. 125 కోట్ల ప్రజలపై నాకు నమ్మకం ఉంది..అవినీతికి తావు లేని దేశం కోసం నాకు చదువుకున్న యువత మద్దతు కావాలని కోరారు.

తమిళనాడుకు కొత్త సీఎస్.. గిరిజా వైద్యనాధన్

  తమిళనాడు కొత్త సీఎస్ గా పాలమూర్తి రామ్మోహన్ రావును తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈయన స్థానంలో గిరిజా వైద్యనాధన్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజా ప్రస్తుతం ల్యాండ్ సర్వే కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.   కాగా ప్రస్తుతం ఉన్న సీఎస్ రామ్మోహన్ రావు ఇంటిపై ఐటీ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. నిన్నటి నుండి ఈరోజు వరకూ ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ఉదయం 5.30 నుంచి గురువారం ఉదయం 6.30 వరకు ఐటీ దాడులు జరగడంతో ఆయన ఇళ్లు, బంధువుల ఇళ్లలో భారీగా నగలు, నగదు, ఆస్తుల దస్తావేజులు స్వాధీనమయ్యాయి. వీటీపై అధికారులు విచారణ చేపట్టనున్నారు. దీంతో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వెంటనే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి రామ్మోహన్ రావును తొలగిస్తూ.. ఆయన స్థానంలో గిరిజా వైద్యనాధన్ ను నియమించాలని నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేశారు.

అక్కడ కూడా ప్రియాంకను రంగంలోకి దింపనున్న కాంగ్రెస్..

  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీని ఉపయోగించుకోవాలని పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు యూపీతో పాటు, త్వరలో జరగబోయే పంజాబ్ ఎన్నికల్లో కూడా ఆమెకే కీలక బాధ్యతలు అప్పగించాలని పార్టీ నిర్ణయించుకుంది. ఈ సందర్బంగా పంజాబ్  రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్, మాజీ సీఎం అమరిందర్ సింగ్ మాట్లాడుతూ.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక ప్రచారబరిలో దిగితే పార్టీ నేతల్లోనూ నూతనోత్సాహం వెల్లువెత్తుతుందని.. ప్రియాంక అయితే సమర్దవంతంగా పార్టీ కేడర్ ను నడిపిస్తారని అన్నారు. దీంతో ఈసారి పంజాబ్ ఎన్నికల్లో ప్రియాంకను రంగంలోకి దించి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తుంది. మరి ప్రియాంక మంత్రం ఎంతవరకు పనిచేస్తుందో చూద్దాం.