ప్రణబ్, మోడీ, రాహుల్ కి శశికళ కృతజ్ఞతలు...

  తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించినప్పుడు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలు స్వయంగా వచ్చి అమ్మకు నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వారు వచ్చినందుకుగాను జయలలిత నెచ్చెలి అయిన శశికళ వారికి కృతజ్ఞతలు తెలిపారు. దీనిలోభాగంగానే.. జయలలిత మరణానంతరం వ్యక్తిగతంగా వచ్చి నివాళులర్పించి పరామర్శించినందుకు గాను ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ ముగ్గురికీ వేర్వేరుగా లేఖలు రాశారు. ‘చెన్నై వచ్చి, వ్యక్తిగతంగా మీ సంతాపాన్ని తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు. చెన్నై వచ్చే సమయంలో ఇబ్బందులు తలెత్తినా వెనుదిరగకుండా వచ్చారని ఆమె రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ’కి రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘భరించలేని బాధ, శోకంలో ఉన్న సమయంలో వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి సానుభూతిని వ్యక్తపరిచిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు’ అని ప్రధానికి రాశారు. ‘నా పట్ల మీరు చూపించిన సానుభూతి, పలికిని సాంత్వనవచనాలు ఓదార్పునిచ్చాయ’ని రాహుల్‌గాంధీకి రాసిన లేఖలో తెలిపారు. కాగా ఆమె ప్రస్తుతం చెన్నైలోని పొయెస్‌ గార్డెన్‌లోనే నివాసముంటున్నారు.

బ్లాక్ మనీ వివరాలు... 72 గంటల్లో 4వేల మెయిల్స్‌

  పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశ వ్యాప్తంగా ఐటీ శాఖ జరుపుతున్న దాడుల్లో కోట్ల కొద్దీ నల్లధనం బయటపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా నల్లధనాన్ని బయటపెట్టేందుకు పలు చర్యలు కూడా తీసుకుంటుంది. దీనిలో భాగంగానే నల్లధనానికి సంబంధించిన వివరాలను తెలియజేయాలంటూ  ఈమెయిల్ (blackmoneyinfo@incometax.gov.in) ను క్రియేట్ చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇది క్రియేట్ చేసిన కొద్ది గంటల్లోనే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం 72 గంటల వ్యవధిలో 4వేల మెయిల్స్‌ వచ్చినట్లు ఆర్థికశాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని.. ఆర్థిక మంత్రిత్వ శాఖ, బ్యాంకు ఖాతాల్లో అక్రమంగా జమ అవుతున్న రోజువారీ నగదు వివరాలను ఆదాయపన్ను శాఖ అధికారులకు ఫినాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌(ఎఫ్‌ఐయూ) ద్వారా ఎప్పటికప్పుడు అందుతోందని.. దీని ద్వారా ఎంతో విలువైన సమాచారాన్ని సేకరించగలిగామని అన్నారు.రోజువారీ డిపాజిట్ల నివేదికను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు అనుమానాస్పద ఖాతాలపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

కిర్గిస్తాన్ దేశాధ్య‌క్షుడితో మోడీ భేటీ.. పలు ఒప్పందాలు

  ప్రధాని నరేంద్ర మోడీ, కిర్గిస్తాన్ దేశాధ్య‌క్షుడు అల్మ‌జ్‌బెక్ అతంబ‌యే ఈ రోజు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా  రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ.. కిర్గిస్తాన్ అధ్య‌క్షుడి రాక సంతోషం క‌లిగించింద‌ని.. ఉగ్ర‌వాదం అణిచివేత‌, తీవ్ర‌వాదం లాంటి స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించిన‌ట్లు మోదీ చెప్పారు. ప్ర‌జాస్వామ్య విలువలు, సాంప్ర‌దాయాల్లో రెండు దేశాలు ఒక‌టే అని.. కిర్గిస్తాన్‌లో ప్ర‌జాస్వామ్యానికి గ‌ట్టి పునాది వేసిన అల్మ‌జ్‌బెక్‌కే క్రెడిట్ ద‌క్కుతుంద‌ని అన్నారు. అంతేకాదు రెండు దేశాల మద్య ద్వైపాక్షిక సంబంధాల‌ను మ‌రింత బ‌లోపేతం చేయ‌నున్న‌ట్లు చెప్పారు. ర‌క్ష‌ణ రంగం, ఆర్థిక సంబంధాల్లో స‌హ‌కారం అందించుకోనున్న‌ట్లు తెలిపారు. హెల్త్‌కేర్‌, టూరిజం, ఐటీ, వ్య‌వ‌సాయం, మైనింగ్‌, ఇంధ‌నం లాంటి అంశాల్లో కిర్గిస్తాన్‌కు స‌హ‌క‌రించ‌నున్న‌ట్లు మోదీ చెప్పారు.

ఇండియా ఘనవిజయం.. సరీస్ కైవసం..

  చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. భార‌త్ త‌న తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు 757 ర‌న్స్ వ‌ద్ద డిక్లేర్ చేసిన విష‌యం తెలిసిందే. దీంతో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ ముందు నిలకడగానే ఆట ప్రారంభించి లంచ్ సమయానికి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 97 పరుగులు చేసింది. ఆ తరువాత రెచ్చి పోయిన బౌలర్ జడేజా వరుసగా మూడు వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఇక ఆ తరువాత కూడా వికెట్లు కోల్పోయి కేవలం 207 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఇంగ్లండ్ పై భారత్ ఇన్నింగ్స్ 75 పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది. ఇక 4-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది.

30 ఏళ్ల రికార్డ్ ను బద్దలు కొట్టిన అశ్విన్...

  భారత్ -ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా ఆటగాళ్లు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. ఇప్పటికే అనేక రికార్డులను సొంతం చేసుకున్న భారత స్పిన్నర్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడు తాజాగా మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. అది కూడా 30 ఏళ్లుగా ఎవరూ అందుకోలేని రికార్డ్.  టెస్ట్ సిరీస్ లో 28 వికెట్లను పడగొట్టడమే కాకుండా... 306 పరుగులు చేసి మూడు దశాబ్దాల తర్వాత చరిత్రను తిరగరాశాడు. ఓ ఆటగాడు ఈ రికార్డును అందుకోవడం ఇదే ప్రథమం. 1985లో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ ఇయాన్ బోథమ్ ఈ ఘనతను సాధించాడు. ఆ సంవత్సరం జరిగిన యాషెస్ సిరీస్ లో 250 పరుగులు చేయడమే కాక, 31 వికెట్లను బోథమ్ పడగొట్టాడు. ఆ తర్వాత మరెవరూ ఈ రికార్డును అందుకోలేకపోయారు. ఇప్పుడు అశ్విన్ ఆ రికార్డును కూడా బద్దలుకొట్టాడు.

చంద్రబాబుపై జేసీ.. ఆయనేం మహాత్మాగాంధీ కాదు..

  ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేయడం.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కామన్. కానీ జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్లు మాత్రం తన, మన అన్న బేధం లేకుండా సొంత పార్టీ పైన కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే సొంత పార్టీ పైనో.. పార్టీ నేతలపైనో అయితే ఓకే కానీ... ఏకంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం చంద్రబాబు వల్లే టీడీపీ అధికారంలోకి రాలేదని... దాని వెనుక చాలా మంది కష్టం ఉందని చెప్పారు. చంద్రబాబు అధికారులతో పాలిస్తున్నారని... అధికారుల రాజ్యం వద్దని ఆయనకు చాలా సార్లు చెప్పానని... ఆయన వినడం లేదని అన్నారు. ఇలాగైతే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మేలు జరగదని అందరూ భావించారని... అప్పటి పరిస్థితును బట్టే తాను టీడీపీలో చేరానని.. పిలవగానే జనాలంతా వచ్చేయడానికి చంద్రబాబేమీ మహాత్మాగాంధీ కాదంటూ తమ అధినేతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరి జేసీ వ్యాఖ్యలపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తారా..? లేక జేసీకి ఇవన్నీ మామూలే అని లైట్ తీసుకుంటారా..? ఎలా స్పందిస్తారో చూడాలి.

మహిళ కోసం ఐసిస్ ఆఫర్.. 1 మిలియన్ డాలర్లు

  తమకు వ్యతిరేకంగా నడుంకట్టి.. ఉగ్రవాదులు హతమార్చినందుకుగాను ఓ మహిళను చంపితే భారీ నజరానా ఇస్తామని ప్రకటించింది ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌. వివరాల ప్రకారం... జోనా పలానీ (23) అనే కుర్దీష్‌ మహిళ.. పాలిటిక్స్‌ లో డిగ్రీ చదువుతూ దానిని మధ్యలోనే వదిలేసి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నడుంకట్టింది. అంతేకాదు సిరియా, ఇరాక్‌లోని ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులతో పోరాటానికి దిగి పలువురిని హతం చేసి అప్పట్లో వార్తల్లో నిలిచింది. దీంతో పగతో రగిలిపోతున్న ఐసిస్ తనను చంపాలని... కనీసం ఆమె జాడ తమకు చెప్పినా కానీ మిలియన్ డాలర్లు ఇస్తామని ప్రకటిస్తున్నారు. కాగా జోనా పలానీ ప్రస్తుతం కోపెన్‌ హాగన్‌ జైలులో ఉంది. 2015 జూన్‌లో ఆమెపై ఎక్కడికి వెళ్లొద్దంటూ డెన్మార్క్‌ విధించిన నిషేధాన్ని అతిక్రమించిందని జైలులో పెట్టారు. నిజంగానే ఆమె నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే దాదాపు రెండేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది.

చిర్రెత్తుకొచ్చిన ప్రజలు.. బ్యాంకులపై దాడులు...

  ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు పడుతున్న కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్రజలు బారులు తీస్తూ గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. అంతేకాదు అలా పడిగాపులు కాస్తూ అప్పుడప్పుడూ తమ సహనాన్ని కోల్పోతూ దాడులు చేసే ఘటనలు కూడా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు గుజరాత్ లోకూడా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. డ‌బ్బు లేక వ‌రుస‌గా మూడు రోజుల నుంచి ప‌లు బ్యాంకులు మూత‌పడే ఉండ‌టంతో చిర్రెత్తుకొచ్చిన ప్ర‌జ‌లు వాటిపై దాడి చేశారు. రాష్ట్రంలోని అమ్రేలి, సురేంద‌ర్ న‌గ‌ర్ జిల్లాల్లో ఉన్న ప‌లు బ్యాంకు బ్రాంచ్‌ల‌పై ఈ దాడులు జరిగాయి. సురేంద‌ర్‌న‌గ‌ర్ జిల్లాలో కొన్ని బ్యాంకు బ్రాంచీల‌పై దాడి చేసిన ప్ర‌జ‌లు.. వాటి త‌లుపులు, కిటికీల‌ను ధ్వంసం చేశారు. వంద‌ల మంది క్యూలో వేచి ఉన్న స‌మ‌యంలో.. బ్యాంకులో డ‌బ్బు లేద‌ని చెప్ప‌డంతో అమ్రేలీ జిల్లాలోని ఎస్‌బీఐ, దేనా బ్యాంకు బ్రాంచ్‌లకు తాళాలు వేసి నిర‌స‌న తెలిపారు.

భారత్ రూట్ లోనే పాకిస్థాన్..

  పెద్ద నోట్లు రద్దు చేస్తూ భారత్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో ప్రత్యర్ధ దేశమైన పాకిస్థాన్ కూడా నడుచుకుంటుంది. తమ దేశంలో నల్లధనాన్ని అరికట్టడానికి దేశంలో ఉన్న అతిపెద్ద నోటు అయిన 5వేల రూపాయల నోటును రద్దు చేయాలని పాకిస్థాన్ సెనేట్ ఒక తీర్మానం ఆమోదించింది. పాకిస్థాన్ ముస్లింలీగ్‌కు చెందిన సెనేటర్ ఉస్మాన్ సైఫ్ ఉల్లా ఖాన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 5వేల రూపాయల నోటును రద్దు చేయడం వల్ల బ్యాంకు ఖాతాల వినియోగం పెరుగుతుందని, లెక్కల్లోకి రాకుండా పోతున్న డబ్బు తగ్గుతుందని తీర్మానంలో పేర్కొన్నారు.  మార్కెట్లకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు మూడు నుంచి ఐదేళ్లపాటు ఈ నోట్ల ఉపసంహరణ ప్రక్రియ జరగాలని సూచించారు. అంతేకాదు ఈ తీర్మానాన్ని పార్లమెంటు ఎగువసభలో ప్రవేశపెట్టగా అత్యధిక సంఖ్యలో సభ్యులు ఆమోదం తెలిపారు.

త్రిపుర అసెంబ్లీలో విచిత్రమైన ఘటన... స్పీకర్ గదను ఎత్తుకెళ్లిన ఎమ్మెల్యే..

  త్రిపుర అసెంబ్లీలో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. టీఎంసీకి చెందిన ఎమ్మెల్యే స్పీకర్ దగ్గర ఉన్న మూడు సింహాల గద తీసుకొని పరుగులు తీసిన వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తుంది. వివరాల ప్రకారం.. త్రిపుర అసెంబ్లీలో భాగంగా... అట‌వీశాఖ మంత్రి న‌రేశ్ జామ‌తియాపై ఆరోప‌ణ‌లు వ‌చ్చిన స‌మ‌యంలో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది. న‌రేశ్‌పై వస్తున్న ఆరోపణలపై చర్చలు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే స్పీక‌ర్ ఆ డిమాండ్‌ను కొట్టిపారేశారు. దీంతో సభ్యులు స్పీకర్ వెల్ లోకి దూసుకొచ్చారు. ఈ గందరగోళం మధ్య టీఎంసీ ఎమ్మెల్యే సుదీప్ రాయ్ బ‌ర్మ‌న్ స్పీక‌ర్ చైర్‌పై ఉన్న మేస్ ను తీసుకొని బయటకి పరుగులు తీశారు.  దాంతో స‌భ‌ను వాయిదా వేశారు.

మోడీని కలిసిన పన్నీర్ సెల్వం... శశికళ పేరెత్తని పన్నీర్ సెల్వం..

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ముఖమంత్రిగా పన్నీర్ సెల్వం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే పన్నీర్ సెల్వం పదవి చేపట్టిన తరువాత మొదటిసారి ప్రధాని నరేంద్రమోడీని కలుసుకున్నారు. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే జయలలితకు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలని మాత్రమే కోరినట్టు తెలుస్తోంది. దేశానికి 32 సంవత్సరాల పాటు సేవ చేసిన జయలలిత భారతరత్న పురస్కారానికి అర్హురాలని పన్నీర్ సెల్వం, మోదీకి సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇక వీరిద్దరి చర్చల్లో జయలలిత నెచ్చెలి శశికళా నటరాజన్ పేరు ప్రస్తావన రాలేదని తెలుస్తోంది. అంతేకాదు చర్చ అనంతరం.. బయటకు వచ్చిన తరువాత కూడా ఆయన శశికళా నటరాజన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోయారు.

పాపను 15వ అంతస్తు నుండి కిందకి...

  ముంబైలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల పాపను 15 అంతస్తులపై నుంచి విసిరేసి తమ పైశాచికాన్ని చూపించాడు ఓ దుండగుడు. వివరాల ప్రకారం.. ముంబయిలోని బైకుల్లాలో గల న్యూ హింద్‌ మాదా కాలనీలో 22 అంతస్తుల భవనం ఉంది. అదే భవంతిలో అందులో అశోక్‌, ఆర్తి అనే భార్యభర్తలు 15వ అంతస్తులో ఉంటున్నారు. ఆర్తి వర్లీ ట్రాఫిక్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ గా పనిచేస్తుండగా అశోక్‌ మాత్రం ఆటో మొబైల్‌ వ్యాపారం చూసుకోవడంతోపాటు ఓ షోరూంలో పనిచేస్తున్నాడు. వీరికి ఐదేళ్ల పాప కూడా ఉంది. అయితే ఆ పాప బయట ఆడుకుంటున్న సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి పాపను  15వ ఫ్లోర్‌ నుంచి కిందకు విసిరేశాడు.  కింద పడగానే పెద్ద శబ్దం రావడంతో వెళ్లి చూసిన వాచ్‌మెన్‌ షాక్‌కు గురయ్యాడు. బాలికను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతానికి ఆ బిల్డింగ్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మరోవైపు పాప తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ట్రక్కు భీభత్సం... 12 మంది మృతి

  ఓ ట్రక్కు చేసిన భీభత్సానికి 12 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన జర్మనీ రాజధాని బెర్లిన్ లో చోటుచేసుకుంది. క్రిస్మస్‌ పండుగ సందర్భంగా జర్మనీ లోని బెర్లిన్ లోని కైసెర్‌ విల్హెమ్‌ మెమోరియల్‌ చర్చికి సమీపంలో ఉన్న మార్కెట్‌ అంతా పర్యాటకులు, స్థానికులు షాపింగ్ చేసుకుంటుండగా అదుపుతప్పిన ట్రక్కు మార్కెట్‌లోకి దూసుకెళ్లడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు ఈ ఘటనలో ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నోట్ల రద్దుపై మరో బాంబు పేల్చిన స్వామి..

పెద్ద నోట్ల రద్దుపైన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి ఇప్పటికే సొంత పార్టీ అని కూడా చూడకుండా మోడీ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో బాంబు పేల్చారు స్వామి. నోట్ల రద్దు విషయం ముందుగానే లీకైందని.. బీజేపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయిందని, నోట్లు రద్దు చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సిందని అన్నారు. అంతేకాదు ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. నోట్ల రద్దు ప్రకటనకు ముందు ఏటీఎంలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని, పన్నులను తగ్గించాలని తాను సూచించినా ఆర్థికమంత్రి జైట్లీ పక్కనపెట్టారని.. ప్రస్తుత నోట్ల కష్టాలకు ఆయనే కారణమని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి ఇప్పటి వరకూ ప్రతిపక్ష పార్టీలే నోట్ల రద్దు ముందుగానే లీకైంది అని ఆరోపిస్తున్నారు.. ఇప్పుడు సొంత పార్టీ నేత కూడా అనడంతో అగ్నికి కాస్త ఆజ్యం పోసినట్టు అయింది. మరి చూద్దాం దీనిపై బీజేపీ పార్టీ ఎలా స్పందిస్తుందో.

కరణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ రికార్డ్..

చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ లో భారత్ జట్టు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పుడు తాజాగా టెస్ట్ తన ప్రతిభను కనపరిచి రికార్డు సృష్టించాడు కరణ్ నాయర్. అతని కెరీర్లో తొలి ట్రిపుల్ సెంచ‌రీ చేసి సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచ‌రీ చేసిన భారత బ్యాట్స్ మన్ గా రికార్డు సృష్టించాడు. తొలి సెంచ‌రీనే ట్రిపుల్ సెంచరీగా చేసినందుకుగాను.. టెస్టు క్రికెట్ చరిత్రలో గ్యారీ సోబర్స్, బాబ్ సింప్సన్ తర్వాత తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మలచిన మూడో ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. ఇక అతను చేసిన భారీ స్కార్ వలన టీమిండియా కూడా టెస్టుల్లో అత్యధిక స్కోరు సాధించింది. అంతేకాదు...ఇంతకుముందు ఉన్న 726 పరుగుల రికార్డు బద్దలైంది. చివరికి 7 వికెట్లకు 759 పరుగుల దగ్గర భారత్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియాకు 282 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ పై ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు కావడం మరో రికార్డు.

దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసు.. నిందితులకు మరణశిక్ష..

దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్లే కేసులో నిందితులకు శిక్ష ఖరారు చేశారు. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులుగా ఉండగా.. వారికి ఎన్ఐఏ కోర్టు మరణశిక్ష విధించింది. అసదుల్లా, రెహ్మాన్, అక్తర్, యాసిఫ్ భత్కల్, సయ్యద్ లకు మరణశిక్ష విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.   కాగా 2013 ఫిబ్రవరి 21వ తేదీ సాయంత్రం జరిగిన బాంబు పేలుళ్లలో 18 మంది దుర్మరణం పాలవ్వగా.. 138 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేసును దర్యాప్తు చేసిన ఎన్ఐఏ... దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. ఇదిలాఉండగా ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును నిందితులు హైకోర్టునుసమాచారం. ఇప్పటికే నిందితుల తరపు న్యాయవాది సంబంధిత డాక్యుమెంట్లపై ఐదుగురు నిందితుల నుంచి సంతకాలు తీసుకొని వెళ్లినట్టు తెలుస్తోంది.