అటకెక్కిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ కొత్తపార్టీ...
posted on Dec 21, 2016 @ 11:19AM
బీజేపీ తరఫున ఎంపీగా పనిచేసి.. ఇటీవలే పార్టీకి రాజీనామా చేసిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ త్వరలో జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ సిక్కు పుణ్యక్షేత్రం అమృతసర్ నియోజకవర్గం నుండి పోటీకి దిగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే... తాను ఎన్నికల బరిలో దిగబోయేది తన కొత్త పార్టీ నుండి అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. కాంగ్రెస్ పార్టీ తరపున సిద్దూ పోటీ చేయనున్నట్టు సంకేతాలు అందుతున్నాయి.
బీజేపీ పార్టీ నుండి బయటకు వచ్చినా సిద్దూ ముందు ఆప్ పార్టీలో చేరతారని అనుకున్నారు. అయితే తన డిమాండ్లు వర్కవుట్ కాకపోవడంతో ఆప్ పార్టీలో చేరలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా చేరే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అదీ జరగలేదు. ఇక సిద్దూ.. ఆప్ పార్టీలో చేరతారా.. లేక కాంగ్రెస్ పార్టీలో చేరతారా అని అందరూ తర్జనభర్జనలు చేస్తుండగా.. ఇవన్నీ కాదన్నట్టు తానే కొత్త పార్టీ అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే పార్టీ పెట్టడానికి అయితే పెట్టాడు కానీ..ఇంతవరకూ ఎలాంటి ముందడుగు వేయలేదు. దీనికి తోడు సిద్దూ భార్య ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు సిద్దూ కూడా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో దిగనున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అంతేకాదు కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీని కలిసి చర్చలు జరిపిన సిద్ధూ, పార్టీలో తన చేరికపై తేదీని ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి కొత్త పార్టీ పెట్టి.. నానా హంగామా చేసిన సిద్దూ కొత్త పార్టీని ఎందుకు పెట్టినట్టో.. ఇప్పుడు కాంగ్రెస్ లో ఎందుకు చేరుతున్నారో..అంత కష్టపడి పెట్టిన పార్టీని ఏం చేస్తారో..? చూద్దాం..