కేసీఆర్.. ట్రంప్ ఇద్దరూ ఒకటే..
posted on Dec 22, 2016 9:25AM
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి దిట్ట అని అందరికి తెలిసిందే. పక్క పార్టీనేతలపైనే.. సొంత పార్టీ నేతలపై కూడా విమర్శలు చేయగల ధైర్యం ఆయనది. ఇప్పుడది కూడా చాలదన్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కూడా వ్యాఖ్యలు చేశారు. నిన్న తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన జేసీ అక్కడ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో కొంచం సేపు ముచ్చటించారు. ఈ సందర్బంగా కేసీఆర్ గురించి మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లది ఒకే మాట, ఒకే యవ్వారం అని.. కేసీఆర్ ఆంధ్రవాళ్లను కేసీఆర్ జాగో, భాగో అన్నారని... ట్రంప్ కూడా విదేశీయులను అలాగే అన్నారని చమత్కరించారు. ఇంకా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి ఆయన మాట్లాడుతూ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు నీతివంతమైన రాజకీయనాయకుడని... పైసలిస్తేనే ఫైలుపై సంతకం చేసే వ్యక్తి కాదని... తాను విపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి చంద్రబాబును చూస్తున్నానని చెప్పారు. ఇంకా చంద్రబాబు ముందుగానే బ్లాక్ మనీని వైట్ చేసుకున్నారని కొందరు ఆరోపిస్తున్న నేపథ్యంలో దానిపై కూడా స్పందించిన జేసీ.. ఆయన అలాంటి వాడు కాదని అన్నారు. తెలంగాణలోని రెడ్ల వద్ద డబ్బుల్లేవని... డబ్బంతా యాదవులు, గౌడ్ ల వద్ద ఉందని చెప్పారు. మరి జేసీ వ్యాఖ్యలపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి...