చంద్రబాబు ఏసును ఏమని కోరుకున్నారు

క్రిస్మస్ పండుగను తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ సోదరులు ఆనందోత్సాహల మధ్య జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గుంటూరులో జరిగిన వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అనంతరం ప్రసంగిస్తూ.. నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా మారుస్తానని..రాష్ట్రాన్ని సంపూర్ణ, సుపంపన్న రాష్ట్రంగా మార్చాలని ప్రభువును కోరుకున్నట్లు తెలిపారు. జెరూసలేం వెళ్లే క్రైస్తవులకు ఇచ్చే రూ.20 వేల సాయాన్ని..రూ40 వేలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. గ్రామాల్లో చర్చి నిర్మాణ వ్యయాన్ని రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. చర్చిల నిర్మాణానికి ఆన్‌లైన్‌లోనే అనుమతులు మంజూరు చేయాలని నిర్ణయించామన్నారు. క్రైస్తవ మిషనరీల ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

చనిపోయిందని గంగలో పారేస్తే..40 ఏళ్ల తర్వాత బతికొచ్చింది

కొన్ని సంఘటనలు చూస్తే ఇలాంటివి కూడా జరుగుతాయా అనిపిస్తుంటుంది. అచ్చం అలాంటి సంఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. 40 ఏళ్లక్రితం చనిపోయిన ఒక పెద్దావిడ మళ్లీ తిరిగి వచ్చి ఆమె కుటుంబంతో పాటు గ్రామం మొత్తాన్ని షాక్‌కు గురిచేసింది. 1976లో విలాస అనే మహిళ పశువులకు మేత కోసం సమీపంలోని అడవికి వెళ్లింది. అయితే ఆమె పాముకాటుకు గురవ్వడంతో కుటుంబసభ్యులు నాటు వైద్యం చేయించారు. ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో విలాస కన్నుతెరవలేదు. ఇక ఆమె మరణించిందని భావించిన కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించి.. గ్రామానికి సమీపంలో పారుతున్న గంగానదిలో పడేశారు..   అయితే నదిలో కొట్టుకుపోతున్న ఆమెను జాలర్లు కాపాడి వైద్యం చేయించారు. విలాస స్పృహలోకి అయితే వచ్చింది కాని తన గతం మరచిపోవడంతో జాలర్ల దగ్గరే ఉండిపోయింది. ఇటీవల ఆమెకు గతం గుర్తుకు రావడంతో తన వాళ్ల గురించి చెప్పింది..దీంతో విలాసను స్వగ్రామానికి పంపించారు. తొలుత షాక్ తిన్నప్పటకీ..వెంటనే కోలుకుని పుట్టుమచ్చల ఆధారంగా ఆమె కుమార్తెలు తమ తల్లిని గుర్తించారు. ఇన్నేళ్ల తర్వాత తమ తల్లిని తిరిగి కలుసుకోవడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. అన్నట్లు ఆ బామ్మ గారి వయసు ఇప్పుడు 82 సంవత్సరాలు.

కొన్నాళ్లు భరించండి

దేశ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయడంతో పాటు నల్లధనాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రధాని మోడీ పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని మొదట్లో సమర్థించిన ప్రజలు..ఇబ్బందుల దృష్ట్యా వ్యతిరేకిస్తున్నారు. ఆ వ్యతిరేకత కాస్తా ప్రధానిని చుట్టుముట్టింది. సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా తెచ్చుకున్న పేరు పెద్దనోట్లు లాక్కెళ్లిపోయాయని పార్టీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నారు. అయినా ప్రధాని మోడీ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. తాజాగా ఇవాళ ఢిల్లీలో మాట్లాడుతూ..సమస్య కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని, కానీ దాని అనంతరం వచ్చే ప్రయోజనాలు ధీర్ఘకాలం ఉంటాయని చెప్పారు.   ప్రజలు కాస్త ఓపికతో ఇబ్బందులను భరించాలని విజ్ఞప్తి చేశారు. దేశ ఆర్థికాభివృద్దే లక్ష్యంగా తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని..రాజకీయ అవసరాల కోసం కాదని ఆయన గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చినట్లు ప్రధాని చెప్పారు. ఆర్థిక మాంద్యం దెబ్బకు ప్రపంచంలోని వివిధ దేశాలు అతలాకుతలం అవుతుంటే..భారత్ మాత్రమే తట్టుకుని నిలబడిందన్నారు.

కోర్టుకు హాజరైన ఢిల్లీ సీఎం..బెయిల్ మంజూరు

2013లో ఢిల్లీ ఎన్నికల సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు చిరునామా ఇచ్చారన్న అభియోగంతో ఆయనపై కేసు నమోదైంది. ఆ అఫిడవిట్‌లో కేజ్రీవాల్ తన ఆస్తులకు సంబంధించి తప్పుడు వివరాలు చూపించారని ఇద్దరు సామాజిక కార్యకర్తలు కోర్టులో కేసు వేశారు. ఈ కేసు విచారణకు ముందే బెయిల్ ప్రొసీడింగ్స్ ఉన్నాయని, అందువల్ల కేజ్రవాల్ ఒక రోజు కోర్టులో హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించడంతో ఢిల్లీ సీఎం ఇవాళ న్యాయస్థానం ముందు హాజరయ్యారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు రూ.10 వేల పూచీకత్తుపై కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేశారు. అనంతరం తదుపరి విచారణను వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

రావెల-జ‌డ్పీ ఛైర్మన్ వివాదంపై చంద్ర‌బాబు ఆగ్ర‌హం

గుంటూరుజిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు మ‌ధ్య త‌లెత్తిన వివాదంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌రిగిన ఘ‌ట‌న‌పై ఆయ‌న పార్టీప‌ర‌మైన విచార‌ణ‌కు ఆదేశించారు.  ఈ మేర‌కు త్రిస‌భ్య‌క‌మిటీని నియమించి నివేదిక ఇవ్వాల‌ని టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు క‌ళా వెంక‌ట్రావును ఆదేశించారు.   అధినేత ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన క‌ళా వెంక‌ట్రావు గుంటూరు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి చిన‌రాజ‌ప్ప‌, టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుచ్చ‌య్య చౌద‌రి, గుంటూరు జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు జివి ఆంజనేయులు స‌భ్యులుగా త్రిస‌భ్య క‌మిటిని ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాల‌ని సూచించారు. మంత్రి రావెల కిశోర్ బాబు నుంచి త‌నకు త‌న కుటుంబ‌స‌భ్యుల‌కు ప్రాణ‌హాని ఉంద‌ని గుంటూరు జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ షేక్ జానీమూన్ నిన్న జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. ఏకంగా మీడియా ముందే ఆమె క‌న్నీటిప‌ర్యంత‌మ‌వ్వ‌డంతో టీటీపీ అధిష్టానం సీరియ‌స్ అయ్యింది. అనంత‌రం మీడియాతో మాట్లాడిన రావెల జానీమూన్ నా కూతురి లాంటిదని..నేనే స్వ‌యంగా ఏమైనా ఇబ్బందులుంటే మాట్లాడి ప‌రిష్క‌రించుకుంటామ‌ని వివ‌రించారు.

క‌రెన్సీ క‌ష్టాల‌కు త్వ‌ర‌లో చెక్..!

పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత జ‌నం ప‌డుతున్న క‌ష్టాలు వ‌ర్ణనాతీతం ..రూపాయి నోటు కోసం గంట‌ల త‌ర‌బ‌డి బ్యాంకులు, ఏటీఎం ల వ‌ద్ద బారుతు తీరుతున్నారు. అంత క‌ష్ట‌ప‌డిన కాని ఫ‌లితం మాత్రం శూన్యం. రూ.2 వేల నోటుకు చిల్ల‌ర దొర‌క‌క జ‌నం నానా తంటాలు ప‌డుతున్నారు. డిమాండ్ కు స‌రిప‌డా నోట్ల ముద్ర‌ణ లేక‌పోవ‌డంతో అవి స్త్ర మూల‌కు రావ‌డం లేదు. అయితే త్వ‌ర‌లో ఈ ప‌రిస్థితిలో మార్పు రానుంది. కొత్త రూ.500 నోట్ల‌ను భారీగా చ‌లామ‌ణిలోకి తీసుకువ‌చ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు ప్రారంభించింది. దీనికి సంబంధించి ఇప్ప‌టికే నాసిక్ ముద్రాణాల‌యంలో ప‌నుల‌ను వేగ‌వంతం చేశారు.   ఇప్ప‌టి వ‌ర‌కు రోజుకు 35 ల‌క్ష‌ల నోట్ల‌ను మాత్ర‌మే ఇక్క‌డ ముద్రిస్తుండ‌గా తాజాగా వాటి సంఖ్య‌ను కోటికి పెంచిన‌ట్టు ప్రింటింగ్ ప్రెస్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. దేశ‌వ్యాప్తంగా నాలుగు క‌రెన్సీ ముద్రాణాల‌యాలు ఉండ‌గా రెండు మైసూరులో, ఒక‌టి స‌ల్బోనిలో...ఇంకోక‌టి నాసిక్ లో ఉన్నాయి. నాసిక్ ప్రెస్ ను పూర్తిగా 500 రూపాయ‌ల నోటు కోస‌మే కేటాయించారు. మ‌రో వైపు ప్ర‌జ‌ల ఇబ్బందుల దృష్ట్యా ఇక్క‌డ సిబ్బందికి సెల‌వుల‌ను సైతం ర‌ద్దు చేసి..రోజుకు 11 గంట‌లు ప‌నిచేస్తున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు.

ట్రంప్ కు షాకిచ్చిన ఒబామా..

  డొనాల్డ్ ట్రంప్ కు ఒబామా పెద్ద షాకే ఇచ్చారు. 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఎంట్రీ - ఎక్సిట్ రిజిస్ట్రేషన్ సిస్టం(ఎన్ఎస్ఈఈఆర్ఎస్) ను అమల్లోకి తెచ్చిన ఒబామా చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్ఎస్ఈఈఆర్ఎస్ ను రద్దు చేయాలని పలుమార్లు అమెరికా ప్రభుత్వానికి వినతులు వెళ్లిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఒబామా ట్రంప్ ఆలోచనలకు అడ్డుకట్ట వేసినంత పనైంది. కాగా ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ట్రంప్ ముస్లింలపై నిషేదం విధిస్తానని చెప్పి పలుమార్లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయకుముందు నుండే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలని చూసింది. ఇప్పుడు తాజాగా నిర్ణయం తీసుకున్నారు.   కాగా 2001 సెప్టెంబర్ 11 దాడుల తరువాత ఎన్ఎస్ఈఈఆర్ఎస్ కింద మొదట ఇరాక్, ఇరాన్, లిబియా, సుడాన్, సిరియాలకు చెందిన వారిపై ఆంక్షలు విధించగా.. తర్వాత ఆఫ్రికా, మధ్య ఆసియాల్లోని మరో 25 దేశాలపై ఆంక్షలు తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రాం ప్రకారం టెర్రరిస్టు దేశాల నుంచి అమెరికాకు వచ్చే సందర్శకులపై 2001-2011ల మధ్య ఆంక్షలు ఉండేవి.

హ‌రీశ్‌రావ‌త్‌ కు సీబీఐ సమన్లు...

  కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనడానికి  ఉత్త‌రాఖండ్ ముఖ్యమంత్రి హ‌రీశ్‌రావ‌త్‌ ప్రయత్నించారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ చేసి దానికి సంబంధించిన  ఆడియో, వీడియో టేపులు బయటపెట్ట‌డంతో దీనిపై సీబీఐ విచారణ ప్రారంభించింది. ఈ నెల ఏప్రిల్లో సీబీఐ విచారణ ప్రారంభించగా.. ఇప్పుడు హ‌రీశ్‌రావ‌త్‌కు సీబీఐ అధికారులు స‌మ‌న్లు జారీ చేశారు. ఈ కేసులో ఈ నెల 26 (సోమ‌వారం)న‌ విచార‌ణ‌కు హాజ‌రుకావాలని ఆదేశించారు. కాగా కొన్ని నెల‌ల క్రితం ఉత్త‌రాఖండ్‌లో ఏర్ప‌డిన రాజ‌కీయ అనిశ్చితి నేప‌థ్యంలో ఉత్త‌రాఖండ్ ముఖ్యమంత్రి హ‌రీశ్‌రావ‌త్‌ కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల‌ను కొన‌డానికి ప్ర‌య‌త్నించార‌న్న ఆరోపణలు వచ్చాయి.

ఉచితం లేకపోతే జియో పరిస్థితి అంతే..

  ఉచిత కాల్స్, డేటాతో రిలయన్స్ జియో ఇప్పటికే దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. జియో దెబ్బకి మిగిలిన కంపెనీలు బెంబేలెత్తిపోతున్నాయి. అయితే ఈ హవా అంతా ఉచితం అన్నది ఉన్నంతవరకే అంటున్నారు నిపుణులు. రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ మార్చి వరకు మాత్రమే ఉంది. అప్పటివరకూ 10 కోట్ల మంది వినియోగదారులకు చేరువ అవుతుందని జియో భావిస్తుంది. అయితే రీసెర్చ్ అండ్ రేటింగ్స్ సంస్థ 'ఫిచ్' జియోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఉచితం పేరుతో జియో సర్వీస్ బాగానే కొనసాగుతున్నా.. ఉచితం అనే ఆఫర్ తొలగిపోయిన తరువాత, సంస్థ కస్టమర్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గి వస్తుందని, ఇతర టాప్ కంపెనీల కన్నా దిగువకు వినియోగదారుల సంఖ్య పడిపోవచ్చని ఫిచ్ రేటింగ్స్ డైరెక్టర్ నితిన్ సోనీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎయిర్ టెల్, ఐడియా సేవలను వినియోగిస్తున్న వారు, రెండో సిమ్ గా రిలయన్స్ జియోను తీసుకుని ఉచిత ఆఫర్లు వాడుతున్నారని, ఒకసారి డబ్బు చెల్లించాలని చెప్పిన తరవాత, వీరిలో అత్యధికులు జియో సిమ్ లను పక్కన పెట్టవచ్చని అభిప్రాయపడ్డారు.

లంచ్ బాక్స్ తెచ్చుకున్న మోడీ....

  ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం వారణాసి పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈసందర్బంగా వార‌ణాసిలో స‌భ నిర్వ‌హించారు. ఈ సభకు వేల సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే ఈ సభకు వచ్చే ప్రతి ఒక్కరూ ఎవరి భోజనం వారు తెచ్చుకోవాలని చెప్పారు. అశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ప్రధాని మోడీ కూడా తన లంచ్ బాక్స్ తానే తెచ్చుకొని అందరిని అశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నేను కూడా ఓ కార్య‌క‌ర్త‌నే కాబ‌ట్టి నా లంచ్ బాక్స్ నేను తెచ్చుకున్నా అని చెప్పారు. ఈ స‌భ‌కు వ‌చ్చిన చాలా మంది మోదీ కోసం భోజ‌నం తీసుకొచ్చినా.. ఆయ‌న మాత్రం త‌న లంచ్ బాక్సే తిన్న‌ట్లు ట్వీట్‌లో పార్టీ తెలిపింది.

రాజకీయ పార్టీలకు ఈసీ ఝలక్.. 255 పార్టీలు రద్దు...

కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు భారీ షాకునిచ్చింది. ఒకటి రెండు కాదు ఏకంగా 255 పార్టీలను రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. నల్లధనంపై పోరాటంలో భాగంగా.. 2005 నుంచి 2015 వరకు జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీలు  పోటీచేయకపోవడంతో పాటు మనీ లాండరింగ్ కార్యకలాపాల్లో ఇవి పాలుపంచుకుంటున్నాయని భావించి 255 పార్టీల గుర్తింపును రద్దు చేస్తున్నట్టు తెలిపింది. రాజకీయ పార్టీలకు ఉన్న వెసులు బాటును అనుసరించి ఆయా పార్టీలు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటున్నాయని ఈసీ అనుమానం వ్యక్తం చేసింది. ఈనేపథ్యంలోనే పార్టీలను రద్దు చేసింది. కాగా గుర్తింపు రద్దు చేసిన రాజకీయ పార్టీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అన్నాటీడీపీ, ఎన్టీఆర్ టీడీపీ, జై తెలంగాణ వంటి 15 పార్టీలు ఉన్నాయి.

పీపీఎఫ్ పై కన్నేసిన కేంద్రం...

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) వడ్డీ రేట్లను తగ్గించేందుకు కేంద్రం చూస్తుందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) తగ్గిస్తున్నట్టు ప్రకటించిన కేంద్రం... ఇప్పుడు పీపీఎఫ్ పై కూడా కన్నేసినట్టు తెలుస్తోంది. పీపీఎఫ్ ఖాతాల్లో డబ్బు దాచుకుంటుండగా, వీరికి ఇచ్చే వడ్డీపై కోత పెట్టనున్న సంకేతాలను వెలువరించింది. అంతేకాదు పీపీఎఫ్ పై నియమించిన గోపీనాథ్ కమిటీ సిఫార్సు కూడా వడ్డీ రేట్లను తగ్గించాల్సిన అవసరం ఉందని కేంద్రానికి సిఫార్స్ చేసింది. మరి ఈ సిఫార్స్ లను పరిగణలోకి తీసుకొని మోదీ సర్కారు కనుక ఆమోదం పలికితే ప్రస్తుతం 8 శాతంగా ఉన్న వడ్డీ రేటు ఒక శాతం వరకూ తగ్గి 7 శాతానికి చేరుతుంది. ఇటీవలి కాలంలో 10 ఏళ్ల కాలపరిమితిపై విక్రయించిన ప్రభుత్వ బాండ్లపై రాబడి 6.5 శాతానికి తగ్గిన నేపథ్యంలో, వచ్చే జనవరి - మార్చి త్రైమాసికంలో పీపీఎఫ్ ను తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆర్థిక నిపుణులు అంచనాలు వేస్తున్నారు.

రివాల్వర్ తో కాల్పుకొని పోలీస్ అధికారి ఆత్మహత్య...

  పోలీసు అధికారులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఈ మధ్యకాలంలో తరచూ వింటూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా రాజస్థాన్ లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రాజ‌స్థాన్‌లో ఆశిష్ ప్ర‌భాక‌ర్‌ అనే పోలీస్ ఆఫీసర్ యాంటీ టెర్ర‌ర్ స్క్వాడ్‌లో ప‌నిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్ర ప్ర‌భాక‌ర్ ఆఫీసు నుంచి బ‌య‌ట‌కు వెళ్లాడు. త‌న కారులోనే అత‌ను శ‌వ‌మై తేలాడు. స‌ర్వీస్ రివాల్వ‌ర్‌తో త‌న‌ను తాను కాల్చుకున్న‌ట్లు పోలీసులు నిర్ధారించారు. అంతేకాదు పోలీస్ ఆఫీస‌ర్ హ‌త్య చేసుకున్న కారులోనే.. ప‌క్క సీటులో ఓ మ‌హిళ శ‌వాన్ని కూడా కనుగొన్నారు. ఆమె సుమారు 30 ఏళ్లు ఉంటుంద‌ని అంచనా వేస్తున్నారు. మ‌హిళ ద‌గ్గ‌ర మొబైల్ ఫోన్ ఉండటంతో ఆ ఫోన్ ఆధారంగా ఆమె ఎవ‌ర‌న్న‌ది పోలీసులు ఛేదిస్తున్నారు. ఇదిలా ఉండగా త‌న‌ను క్ష‌మించ‌మంటూ పోలీస్ అధికారి త‌న భార్య‌కు లేఖ రాసిన‌ట్లు ఓ లేఖ‌ను గుర్తించారు. ప్ర‌భాక‌ర్ సూసైడ్ వెనుక కుటుంబ స‌మ‌స్య‌లు కార‌ణ‌మై ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్న పోలీసులు ఆదిశగా దర్యాప్తు చేపట్టారు.