తమిళనాడు సీఎస్ ఇంటిపై ఐటీ దాడులు.. నేతల గుండెల్లో గుబులు...
posted on Dec 21, 2016 @ 10:27AM
తమిళనాడులో ఐటీ శాఖ అధికారులు వరుస దాడులు చేస్తున్న నేపథ్యంలో ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే శేఖర్ రెడ్డి ఇంట్లో భారీగా డబ్బును పట్టుకున్న ఐటీ శాఖ అధికారులు ఇప్పుడు తాజాగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు ఇంట్లో సోదాలు చేపట్టింది. శేఖర్‌రెడ్డి ఇంట్లో భారీగా నగదు, బంగారం, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో డాక్యుమెంట్లలో రామ్మోహన్‌రావుకు సంబంధించి పలు వివరాలు లభించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇసుక కాంట్రాక్ట్ లలో భారీగా ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలు రావడంతో.. పక్కా సమాచారంతో ఏక కాలంలో ఏడు చోట్ల ఐటీ శాఖ అధికారులు దాడులు జరిపారు. అన్నా నగర్ నివాసంలో ఉదయం నుండి తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా శేఖర్ రెడ్డికి జయలలిత రికమెండేషన్ ద్వారానే టీడీడీ బోర్డు సభ్యుడిగా పదివి దక్కింది. ఇప్పుడు సీఎస్ రామ్మోహన్ జయ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించేవారు. దీంతో వీరిపై ఐటీ దాడులు జరపగా.. మిగిలిన అన్నాడీఎంకే నేతల్లో కూడా గుబులు పట్టుకున్నట్టు సమాచారం.