అమ్మే ఉంటే ఇలా జరిగేదా..?
ఐటీ దాడులు, ఆసుపత్రిలో చికిత్స అనంతరం తొలిసారి మీడియా ముందుకు వచ్చారు తమిళనాడు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు. తన ఇంట్లో దొరికిన ఆస్తులకు సంబంధించిన అన్నిటికి ఆధారాలున్నాయని వాటిని మీడియాకు అందజేస్తున్నట్టు తెలిపారు. తన కుమారుడి పేరుతో సెర్చ్ వారెంట్ ఉంటే తన నివాసం, ఆఫీసులను తనిఖీ చేసే అధికారం సీఆర్పీఎఫ్‌కు ఎవరిచ్చారని అన్నారు. అయినా తన కుమారుడు విదేశాల్లో ఉంటాడని, తనతో ఉండటం లేదని చెప్పారు.
అయినా తనను అమ్మ చీఫ్ సెక్రటరీగా నియమించిందని..జయ బతికి ఉంటే కేంద్రం ఇంత ధైర్యం చేయగలిగేదా..? సీఎస్‌గా ఉన్న నా ఛాంబర్‌లో తనిఖీలు రాజ్యాంగ విరుద్ధమేనన్నారు. తనను బదిలీ చేసిన తర్వాత తనిఖీలు నిర్వహించాల్సిందని రామ్మోహన్ అన్నారు. తన ఇంట్లో 1,12,320 రూపాయలు పట్టుకున్నారని..తన కుమార్తె, భార్యలకు చెందిన 50 తులాల బంగారం, 25 కేజీల దేవుళ్ల విగ్రహాలు సీజ్ చేశారని వెల్లడించారు. 32 ఏళ్లపాటు సర్వీసు చేసిన తనకే ఇలా ఉంటే, సామాన్యుల పరిస్థితి ఏంటని అన్నారు. నేను శేఖర్‌రెడ్డికి సంబంధించిన ఏ వ్యవహారంలోనూ తల దూర్చలేదన్నారు.