నోట్ల రద్దుపై... నోళ్లలో నానుతున్న ఏడు పుకార్లు!
posted on Nov 19, 2016 @ 11:33AM
500, 1000 నోట్లు రద్దయ్యాయి. దేశం మొత్తం రచ్చరచ్చైపోయింది. ఎక్కడ చూసినా క్యూ లైన్లు. ఊసూరుమంటున్న జనం. మరో వైపు మీడియా వాళ్ల హడావిడి. ఆ రిపోర్ట్స్ విన్నా, చదివిన వారు మరింత ఆందోళన చెందుతున్నారు. పనిలో పనిగా తాము విన్నది, చదివింది కొంచెం మసాలా దట్టించి ప్రచారం చేసేస్తున్నారు. మొత్తానికి ఇలా ఇప్పుడు భారత్ దేశం మొత్తం నోట్లో... నోట్ల రద్దు మాటలతోనే రోజులు గడిపేస్తోంది! ఫలితంగా ఒళ్లు జలదరించే అబద్ధపు గాసిప్స్ కూడా ప్రచారంలోకి వచ్చేస్తున్నాయి. అసలు వీట్ని ఎవరు, ఎక్కడ, ఎలా స్టార్ట్ చేస్తున్నారో కూడా అర్థం కావటం లేదు...
దేశంలోని 86శాతం డబ్బుని బ్యాన్ చేసి కొత్తగా మళ్లీ అంత మనీని రొటేషన్లోకి తీసుకురావాలంటే చాలా దమ్ము, ధైర్యం కావాలి. అవ్వి మోదీకి మెండుగానే వున్నాయి కాని కాస్త పుకార్లను కంట్రోల్ చేయటంలోనే ఆయన టీమ్ ఫెయిలవుతోంది. కాని, తాజాగా ఆర్దిక శాఖ ఓ క్లారిటీ ఇచ్చింది. అందులో ప్రధానమైన ఏడు వదంతుల్ని పేర్కొంది. అవ్వి ఎలా నిజం కావో వివరణ ఇచ్చింది...
రూమర్ నెంబర్ వన్... 500, 1000 నోట్ల లాగే మోదీ త్వరలో 100, 50 నోట్లని కూడా రద్దు చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రకటన త్వరలో రానుంది. ఇది పచ్చి అబధ్ధం అంటోంది ఆర్దిక శాఖ. చిన్న నోట్లు రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి అస్సలు లేదు.
రూమర్ నెంబర్ టూ... కొన్ని వ్యాపార సంస్థలకి, బీజేపీ నేతలకి, బడా వ్యాపార వేత్తలకి నోట్ల రద్దు విషయం ముందే తెలుసు! ఇది కూడా ప్రభుత్వం నిజాయితీపై బురదజల్లే దుర్మార్గ ప్రచారం. ఇందులో ఎలాంటి నిజం లేదు. నోట్ల రద్దు మోదీ ప్రటించే వరకూ ఎవ్వరికీ తెలియదు...
రూమర్ నెంబర్ త్రీ... నోట్లు రద్దు చేసి కొత్త నోట్లు తేవటం వల్ల వచ్చే లాభం కన్నా అవుతోన్న ఖర్చే ఎక్కువ. ఇది కూడా ఉబుసుపోని మేధావులు సృష్టించిన పుకారే అంటోంది ఫైనాన్స్ డిపార్ట్ మెంట్! నోట్ల రద్దుతో బారతదేశంలో నడుస్తోన్న సమాంతర ఆర్దిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయిపోతుంది. దాని వల్ల ధరలు నల్లధనం లెక్క తేలి ప్రభుత్వ ఖాతాలో చేరి ధరలు తగ్గు ముఖం పడతాయి. అంటే, మధ్యతరగతి, పేద వర్గాలకి ఎంతో లాభం అన్నమాట....
రూమర్ నెంబర్ ఫోర్... కొత్త రెండు వేల రూపాయల నోట్లలో నానో చిప్స్ వున్నాయన్నది మరో క్రియేటివ్ రూమర్! దీని వల్ల నల్లదనం ఎక్కడ వున్నా ఉపగ్రహం పట్టేస్తుందని వదంతలు వ్యాపింపజేశారు. ఇది కేవలం పాంటసీ తప్ప నిజం కాదు. కొత్త నోట్లలో ఎలాంటి చిప్స్ లేవు. అవ్వి నార్మల్ కరెన్సీ నోట్లు మాత్రమే...
రూమర్ నెంబర్ ఫైవ్ ... నోట్ల రద్దు వల్ల బ్లాక్ మనీ ఏం బయటకు రాదు. ఆల్రెడీ నల్ల ధనం వున్న వాళ్లు వైట్ చేసుకోటానికి మార్గాలు కనిపెట్టేశారు. ఇలాంటి మాటలు చెబితే కూడా జనం నమ్మొద్దంటోంది ఆర్దిక శాఖ. ఎవ్వరూ తమ బ్లాక్ మనీ వైట్ చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు ఎప్పటికప్పుడు కేంద్ర సంస్థలు తీసుకుంటున్నాయి. నిరంతరం నిఘా పెడుతూ అలెర్ట్ గా వున్నాయి...
రూమర్ నెంబర్ సిక్స్ ... 2వేల రూపాయల నోటు తక్కువ క్వాలిటీది. దాని రంగు పోవటమే దీనికి ఉదాహరణ. ఇలాంటి వాదన కూడా కొందరు చే్స్తున్నారు. కాని, నిజం ఏంటంటే... రెండు వేల రూపాయల నోటు రంగు పోతేనే అది ఒరిజినల్. ఈ సెక్యురిటీ ఫీచర్ ని ఇంటాగ్లియో ప్రింటింగ్ అంటారు. ఇలా చేసిన నోటును బట్టతో రుద్దితో రంగు అంటుకుంటుంది! అది చీప్ క్వాలిటి అని అర్థం కాదు...
రూమర్ నెంబర్ సెవన్... ఇది అన్నిటికంటే దుర్మార్గమైన , భయంకరమైన రూమర్. కొందరు సామాన్యుల్ని బ్యాంకు లాకర్లు ప్రభుత్వం సీజ్ చేయనుందని బెంబేలెత్తిస్తున్నారు. వాటిల్లోని బంగారు, వెండి, వజ్రాల నగల్ని సర్కార్ స్వాధీనం చేసుకోనుందని చెబుతున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. మోదీ సర్కార్ కి అలాంటి ఉద్దేశ్యం ఏమీ లేదని తేల్చి చెబుతోంది ఆర్దిక శాఖ!
నోట్ల రద్దుతో నానా తిప్పలు పడుతున్న మాట వాస్తవమే కాని అసలు ఇబ్బందుల కంటే ఈ దుష్ఫప్రచారాల గోల ఎక్కువైపోయింది. వార్తల వరద పారుతుండటంతో ఏది నిజమో, ఏది అబద్ధమో అర్థం కాని గందరగోళ స్థితి దాపురించింది. వాటికి చెక్ పెట్టేందుకే కేంద్ర ఆర్దిక శాఖ తాజా వివరణ ఇచ్చింది!