మోదీ మళ్లీ నిషేధించాడు... నోట్లను కాదు!
posted on Nov 16, 2016 @ 1:27PM
మోదీ ప్రభుత్వం ఒక దాని వెంట ఒకటి కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. వాటి పర్యవసానం ఎలా వుంటుందో నెక్స్ట్ ఎలక్షన్సే తేల్చాలి. సర్జికల్ స్ట్రైక్స్ తో పాక్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన నమో ఇప్పుడు నోట్ల రద్దుతో బ్లాక్ డాగ్స్ ని బెంబేలెత్తిస్తున్నాడు. కాని, అదే సమయంలో సామాన్య జనం ఇబ్బంది పడుతున్నారు. వాళ్లకంటే ఎక్కువగా మీడియా, మేధావులు, ప్రతిపక్ష నేతలు హంగామా చేస్తున్నారు. ఎవరిది నిజమో, ఎవరిది అతో అర్థం కానంత గందరగోళంగా వుంది పరిస్థితి. కాని, ఈ మొత్తం హడావిడిలోనే మరో డేరింగ్ అండ్ డాషింగ్ డెసిషన్ జరిగిపోయింది మోదీ పాలనలో! అదే జకీర్ నాయక్ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ఎన్జీవోపై నిషేధం!
జకీర్ నాయక్ మామూలోడు కాదు. క్రిస్టియన్స్ లో కేఏ పాల్, బ్రదర్ అనిల్ కుమార్ లాంటి వారికి వున్నట్టుగా ముస్లిమ్స్ లో మంచి ఫాలోయింగ్ వున్నవాడు. కాని, సమస్యల్లా అతని చుట్టూ గత కొంత కాలంగా ఉగ్రవాదాన్ని నూరిపోస్తున్నాడన్న ఆరోపణలు రావటమే! సామాన్యంగా ఇలాంటి ఆరోపణలు ఎన్ని వచ్చినా మన దేశంలోని కాంగ్రెస్ , దాని అనుబంధ సెక్యులర్ పార్టీలు అస్సలు నోరు మెదపవు. ఇక బ్యాన్ చేయటం అయితే ఊహించటమే కష్టం. కాని, విషయం మైనార్టీలకు సంబంధించింది అయినా మోదీ క్యాబినేట్ గో అహెడ్ అనేసింది. ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ బ్యాన్ చేసేసింది. అయిదేళ్ల వరకూ ఈ నిషేధం కొనసాగనుంది.
ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ కు భారీగా విదేశీ నిధులు వస్తుండేవి.వాటిని జకీర్ నాయక్ విచ్చలవిడిగా తన పీస్ టీవీకి మళ్లించాడు. ఇందులో శాంతి గురించి తక్కువ, మత చాందసం గురించి ఎక్కువ మాట్లాడేవాడు. అసలు నాయక్ తాలూకూ ఏ ఒక్క వీడియో ఇప్పుడు యూ ట్యూబ్ లో చూసినా ఆయన వాదన , అభిప్రాయం మనకు అర్థం అయిపోతాయి. ఇప్పటికీ భూమి గుండ్రంగా వుందని ఒప్పుకోని కరుడుగట్టిన మత వాది ఆయన! ఆయన వల్లే తమ దేశంలో మారణకాండ జరిగిందని బంగ్లాదేశ్ మన కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చింది. జకీర్ మాటలు టీవీల్లో, యూట్యూబ్ లో విన్న ఒక ఉగ్రవాది ఢాకాలో కిరాతకానికి పాల్పడ్డాడు! ఈ కారణంగానే ఇస్లామిక్ దేశమైనప్పటికీ బంగ్లాదేశ్ జకీర్ నాయక్ ను విచారించాలని కోరింది. అయితే, అప్పట్నుంచీ విదేశాలకు వెళ్లిన జకీర్ ఇంత వరకూ తిరిగి రాలేదు. అరెస్ట్ భయంతో దేశం బయటే కాలం గడుపుతున్నాడు...
ఇప్పటికే దేశంలో లేని జకీర్ కు సంబంధించిన ఇస్లామిక్ రీసర్చ్ ఫౌండేషన్ ను తాజాగా కేంద్రం అయిదేళ్ల పాటూ నిషేదించింది. నిజానికి ఉగ్రవాదానికి ఉతం ఇస్తున్నాడని ఒక ఇస్లామిక్ దేశమైన బంగ్లాదేశే ఆరోపించినప్పడు జకీర్ ను సీరియస్ గా తీసుకోవాల్సిందే. అదీ కాక ఢిల్లీలో బీజేపి ప్రభుత్వం స్వంత మెజార్జీతో అధికారంలో వుండటం కూడా ఆయనకి రివర్స్ గా మారింది. కాంగ్రెస్ లాంటి మెతక పార్టీలు వుండి వుంటే ఇలా నిషేధం దాకా పరిస్థితి వెళ్లేది కాదేమో. కాని, మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ పీస్ టీవీపై గట్టిగానే దృష్టి పెట్టింది. మైనార్టీ సంతుష్టీకరణకు దిగకుండా జాతి శ్రేయస్సుకు నిర్ణయం తీసుకుంది. ఆఫ్ట్రాల్, ఉగ్రవాదానికి ఉతం ఇస్తే ఏ మతం వ్యక్తి అయినా, సంస్థ అయినా కఠిన శిక్షలు అనుభవించాల్సింది. ఇందులో సందేహం లేదు...