తెలుగువాడికి నోబెల్ వస్తుందంటారా
తిరుపతిలో జరుగుతున్న భారత సైన్స్ కాంగ్రెస్లో భాగంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ- నోబెల్ బహుమతి సాధించే తొలి ఆంధ్రునికి వందకోట్ల రూపాయలు అందిస్తామని ఘనంగా ప్రకటించారు. వినడానికి ఈ మాట ఎంత బాగుందో! కానీ నోబెల్ స్థాయిని చేరుకోవడానికి తెలుగువారు సిద్ధంగా ఉన్నారా లేదా అన్నదే ప్రశ్న.
జాతీయస్థాయిలో ఫలానా పరీక్షలో తెలుగువారిదే పైచేయి అని వార్తలు వస్తుంటాయి. అమెరికాలో ఐటీ రంగాన్ని తెలుగువారు తెగ దున్నేస్తున్నారని నివేదికలు ఊదరగొడుతుంటాయి. ప్రతిష్టాత్మకమైన సీఏ పరీక్షలలో ర్యాంకులు, ఐఐటీ సీట్లూ అన్నింటా తెలుగువారే ముందు కనిపిస్తుంటారు. స్పెల్బీ, ఐక్యూలకి సంబంధించిన రికార్డులలోనూ తెలుగు పిల్లల ఫొటోలు కనువిందు చేస్తాయి. అంటే భవిష్యత్తుకి ఢోకా లేని రంగాలలోనూ, బట్టీపట్టే సందర్భాలలోనూ మనం ముందుంటున్నాం అన్నమాట.
సంగీతం, సాహిత్యం, విజ్ఞానశాస్త్రం వంటి సృజనాత్మక రంగాలలో తెలుగువాడు జాతీయస్థాయిలో గుర్తింపు పొందాడన్న వార్తలు అరుదుగా వినిపిస్తుంటాయి. తెలుగులో పొరపాటున ఆర్ట్ ఫిలిం తీసినా దాని దర్శకులు ఇతర భాషలవారై ఉంటారు. తెలుగు కీర్తనల మీద పట్టు సాధించినా, అది తమిళురై ఉంటారు. తెలుగు రాష్ట్రాలలో విద్య ఎప్పుడైతే కార్పొరేట్ పరం అయిపోయిందో... పిల్లల జీవితం మార్కులే పరమావధిగా మారిపోయింది. ఈ పరుగులో తాము ఎక్కడ వెనకబడిపోతామో అన్న భయంతో ప్రతి ఒక్కరూ పరుగులు తీయాల్సిన పరిస్థితి వచ్చింది.
ర్యాంకులు, జీతాలు, క్యాంపస్ ప్లేస్మెంట్లు వంటి భౌతికమైన కొలబద్దలతో మన జీవితాలని కొలుచుకోవడం మొదలుపెట్టేశాం. తదనుగుణంగానే పిల్లల పెంపకమూ వారి విద్యాబుద్ధులూ సాగుతున్నాయి. ఇలాంటి సందర్భాలలో విజ్ఞాన శాస్త్రానికి నా జీవితాన్ని అంకితం చేస్తానంటే ఎవరన్నా ఊరుకుంటారా! మంచి రచయితగా స్థిరపడతాననో, గొప్ప సంగీతకారుడిని అవుతాననో, సమాజసేవలోకి అడుగుపెడతాననో ఎవరన్నా లక్ష్యంగా పెట్టుకుంటే... వాడిలోని ‘పైత్యాన్ని’ వదలకొట్టకుండా ఊరుకుంటారా!
కాబట్టి... నోబెల్ బహుమతి సాధించేవారికి వందకోట్లు ఇస్తాను అనగానే పరిస్థితి మారిపోదు. తెలుగు సమాజం భౌతిక విజయాల వైపు పరుగులు తీస్తోదనే సత్యాన్ని ముందుగా గ్రహించాలి. పిల్లల్లో హేతుబద్ధతని పెంచేలా, విజ్ఞానం పెరిగేలా విద్యని రూపొందించాలి. అలా కాకపోతే ఎన్ని తెలుగు తరాలు ఆర్థికరంగంలో దూసుకుపోయినా వారి ఆలోచనలు మాత్రం ప్రాథమికంగానే ఉంటాయి. అమెరికా వెళ్లినా కులసంఘాలు పెట్టాలనో, అక్షరం చదివినా రూపాయి లాభం ఉండాలనో... వారి మెదళ్లు ప్రణాళికలు వేస్తూనే ఉంటాయి.
వాణిజ్యపరమైన విజయాలే అసలైన విజయాలన్న దృక్పథం నుంచి బయటపడితేనే చరిత్రలో నిలిచిపోయే స్థానాన్ని సంపాదించగలం. ఆఖరికి చంద్రబాబునాయుడు కూడా తన ప్రసంగంలో అమెజాన్, ఉబర్, మైక్రోసాఫ్ట్ వంటి వ్యాపార సంస్థలనే ఉదాహరణగా చూపించారంటే... మన ఆలోచనలు దేని చుట్టూ తిరుగుతున్నాయో గమనించవచ్చు. మనం ఇప్పుడు ఆదర్శంగా తీసుకోవాల్సింది మైక్రోసాఫ్టుని కాదు ఎల్లాప్రగడ సుబ్బారావు, నాయుడమ్మ, సూరి భగవంతం, రాజిరెడ్డి వంటివారిని. ఆ తరువాతే నోబెల్ బహుమతి తెలుగువాడికి వస్తుందో లేదో అని మధనపడదాం. అందుకు తిరుపతిలో జరిగిన వైజ్ఞానిక పండుగ ఓ స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశిద్దాం!