ఇండియా Vs పాక్ ... అమెరికా Vs చైనా!
posted on Nov 17, 2016 @ 4:32PM
ఆ మధ్య సర్జికల్ స్ట్రైక్స్ తరువాత దేశం మొత్తం పాకిస్తాన్ తో యుద్ధం అంటూ ఊగిపోయింది. రేపో మాపో పూర్తి స్థాయి దాడులు తప్పవంటూ మీడియా కూడా హడావిడి చేసింది. సోషల్ మీడియా అయితే దేశభక్తి సెగలతో పొగలుగక్కింది. కాని, ఉన్నట్టుండీ ఆర్దిక సర్జికల్ స్ట్రైక్స్ తో సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ కంటే ఎక్కువగా 500, 1000 నోట్ల ప్రస్తావన నడుస్తోంది! కాని, అదే సమయంలో పాక్ ఏం చేస్తోంది? ఊరికే వుండదు కదా?
పాక్ అన్ని విధాల యుద్ధానికి సిద్ధం అయిపోతోంది! తాజాగా సరిహద్దు వద్ద తన సైనిక పాటవం చూపటానికి డ్రిల్ కూడా నిర్వహించింది. అయితే, ఇందులో ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, పాకిస్తాన్ యుద్ధ విమానాలతో పాటూ చైనా హెలీకాప్టర్లు కూడా చక్కర్లు కొట్టడం! WZ 10 అనే చైనీస్ హెలీకాపర్ట్స్ పాకిస్తాన్ విమానాలతో పాటూ మన ఆర్మీ వారికి కనిపించాయట. ఇవ్వి అత్యాధునిక హెలికాప్టర్లు. వీటితో ఆయుధాలు తరలించటం, దాడులు చేయటం బాగా తేలికవుతుంది. ఇలాంటివి ప్రస్తుతం ఇండియా వద్ద లేవు...
చైనా తయారు చేసిన WZ 10 హెలికాప్టర్లకు సాటి రాగల హెలికాప్టర్లు అమెరికా వద్ద వున్నాయి. గల్ఫ్ యుద్ధంలో, అఫ్గనిస్తాన్ లో వాడిన ఆ హెలికాప్టర్ల పేరు US AH 64 APACHE. ఇవ్వి మాత్రమే చైనా పాకిస్తాన్ కు అందించిన హెలికాప్టర్లతో పోటీ పడతాయి. భారత్ వీట్ని అమెరికా నుంచి ఇప్పటికే కొనుగోలు చేసింది. కాని, మనకు ఇంకా అందలేదు. అంతలోనే పాక్ వద్ద చైనీస్ హెలికాప్టర్స్ వుండటం అంటే ... చైనా పక్క దేశాన్ని బాహాటంగా సమర్థిస్తుంది అని అర్థం. మొదట్నుంచీ పాక్ వైపే నిలుస్తున్న డ్రాగన్ యుద్ధం వస్తే తన స్టాండ్ ఏంటో చెప్పకనే చెబుతోంది!
చైనా ఒకవైపు పాకిస్తాన్ దిశగా సాగుతుంటే అమెరికా ఇండియా వైపు మోహరిస్తున్నట్టు కనిపిస్తోంది. భారత్ కు అమెరికా సైనిక సాయం అక్కర్లేకున్నా అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను కార్నర్ చేయటానికి యూఎస్ మద్దతు మనకు అవసరం. అందుకే, ఎప్పట్నుంచో అమెరికా చేత పాక్ ను ఉగ్రవాద దేశంగా గుర్తింపజేయాలని ఇండియా ట్రై చేస్తోంది. ఇప్పుడు ఒబామా పోయి ట్రంప్ వచ్చేస్తుండటంతో ఆయన అంతరింగుకుల్లోని భారత్ సంతతి వారు తమ ప్రయత్నాల్లో తామున్నారు. ట్రంప్ కి దగ్గరగా వుండే ఇండియన్స్, ఇండియన్ ఆరిజిన్ వున్న వారి మాటల ప్రకారం ఆయన త్వరలోనే పాక్ ను టెర్రరిస్ట్ కంట్రీ గా గుర్తించే చాన్స్ వుంది. ట్రంప్ వైట్ హౌజ్ కి రాగానే సాధ్యమైనంత త్వరగా ఇది జరగవచ్చట!
పాక్ ను అమెరికా ఉగ్రవాద దేశంగా ప్రకటిస్తే దానికి ఇప్పుడు అందుతున్న యూఎస్ డాలర్ల వరద తగ్గిపోతుంది. పూర్తిగా ఆగిపోవచ్చు కూడా. అది జరిగితే ఇండియాకు పాక్ ను లొంగదీయటం పెద్ద కష్టమేం కాదు. అయితే, డ్రాగన్ నిజమైన యుద్ధ సమయంలో ఎంతగా పాకిస్తాన్ కు మద్దతిస్తుందో ఇప్పుడే చెప్పలేం. కాని, చైనా ఎంతగా పాక్ వైపు కదిలితే అమెరికా అంతగా ఇండియా వైపు వస్తు ప్రపంచ పటాన్ని వేడెక్కించే ప్రమాదముంది!