నషా వదిలిస్తున్న నిషేధం
posted on Nov 16, 2016 @ 10:28AM
పోయిన మంగళవారం మోడీ వేసిన నిషేధ మంత్రం సంజీవనిలా మారి ఇప్పుడు చాలా సమస్యలకు పరిష్కారం చూపుతోంది. ఆర్ధిక భద్రత కోసం మోడీ తీసుకున్న నిషేద నిర్ణయం దేశభద్రతకి, సాదారణ జనాలు పడే అనేక ఇబ్బందులకి కూడా పరిష్కారాలు చూపిస్తుంది.
ఒక విషయం గమనించారా పోయిన మంగళవారం నుండి ఈ మంగళవారం వరకు అంటే మోడీ 500, 1000 నోట్లు బాన్ చేసిన రోజు నుండి ఈ రోజు వరకు కాశ్మీర్ లోయలో ఒక్క హింసాత్మక సంఘటన కూడా జరగలేదు. ఒక్క సారి కూడా నిరసనకారులు రాళ్ళూ రువ్వలేదు, ఒక్క స్కూల్ కూడా తగలపెట్ట లేదు...
అవును నిజమే కాని కాశ్మీర్ లో గొడవలు జరగకపోవడానికి మోడీ బాన్ చేసిన 500,1000 నోట్లకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఉంది అక్కడ ఉన్న వేర్పాటు వాదులు ఇప్పటి వరకు కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న పేదరికాన్ని ఆసరాగా చేసుకుని అక్కడ ఉన్న యువతకి, పేదవారికి డబ్బులు ఇచ్చి ప్రసంగాలతో రేచ్చేగొట్టి నిరసనలు, దాడులు చేయించేవారు. భద్రత దళాలపై రాళ్ళు రువ్వితే 500, హింసాఖాండలో పాల్గొంటే 1000 రూపాయలు ఇలా ఒక్కోదానికి ఒక్కో రేటు కట్టి అల్లకల్లోలం సృష్టించేవారు... కానీ ఇప్పుడు వాళ్ళ ఆటలు సాగడం లేదు, కారణం మోడీ 500, 1000 నోట్ల రద్దు చెయ్యడం. నోట్ల రద్దు వలన పాత నోట్లు తీసుకుని నిరసనలు చెయ్యడానికి నిరసనకారులు నిరాకరించడంతో, నిరసనకారులకు పంచడానికి కొత్తనోట్లు లేక పాత నోట్లు ఏమి చెయ్యాలో అర్ధం కాక వేర్పాటువాదులు కుడితిలో పడ్డ ఎలుకల్లా కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర మూలుగుతున్న కోట్లకొద్దీ పాత 500, 1000 నోట్లు (దొంగ నోట్లతో సహా) మూతి తుడుచుకోడానికి కూడా పనికి రాకుండా పోయాయి.
మోడీ దెబ్బకి ఎక్కడో ఆకాశంలో ఉన్న రియల్ ఎస్టేట్ రెట్లు రేపో మాపో నేల చూపులు చూడటానికి రెడీ అయిపోయ్యాయి. ఇంకా నిన్నటి వరకు ఎగిరిరేగిరిపడిన పసిడి పరిస్థితి ఐతే అమ్మడానికి అడవి, కొనడానికి కొరివిలా ఉంది. ఐటి నిఘా భయంతో కొనడానికి జనాలు, అమ్మడానికి వ్యాపారులు వెనక్కి తగ్గడంతో అమ్మకాలు లేక పసిడి రెట్లు రెక్కలు తెగి అందుబాటులోకి వస్తున్నాయి. మోడీ నిర్ణయంతో ఇంకా నల్లబజారు కూడా బేజారు అవుతుంది. కట్టల కొద్దీ డబ్బులు దగ్గర ఉన్నాయి అని క్వింటాలకి క్వింటాలు నిత్యావసరాలు కొని గోదాముల్లో దాచి కృత్రిమ కొరత సృష్టించి రేట్లు పెంచుకుని డబ్బులు గుంజుకునే వారి ఆటలు కూడా ఈ దెబ్బకి, ఇంకా సాగకపోవచ్చు...నల్ల బజారు బాబుల దగ్గర కట్లపాములు (అదేనండి నోట్ల కట్టలు) లేవు కనుక ఇంకా నల్లబజారు నడక జోరు కాస్త అయిన తగ్గకపోదు, నిత్యావసరాలు కూడా అంతో ఇంతో అందుబాటులోకి రాకుండా మానవు.
మోడీ చేసిన ఈ పని వలన సాదారణ జనం ఇప్పుడు క్యూ లైన్లలో కొంత కష్టపడుతున్నా, భవిష్యత్తులో ఆమ్ అద్మి... తక్కువ కష్టాలతో ప్రశాంతంగా బతకవచ్చు అనే ఆశ అయితే పెట్టుకోవచ్చు (ఎంత అయినా మనిషి ఆశా జీవి కదా...)