పట్టాలు తప్పిన ప్రయాణం
posted on Nov 21, 2016 @ 11:02AM
నిన్న ఉదయం ఇండోరు నుంచి పట్నాకు వెళ్తున్న రైలు, ఘోర ప్రమాదానికి గురి కావడంతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆదివారం తెల్లవారుజామున ఆదమరచి నిద్రపోతున్న వంద మందికి పైగా ప్రయాణికులు నిద్రలోనే ప్రాణాలను కోల్పోయారు. ప్రమాదం జరిగిన తీవ్రత దృష్ట్యా... గత పదేళ్లలో ఇదే భారీ రైలు ప్రమాదంగా భావిస్తున్నారు. ఇంతమంది ప్రాణాలను బలిగొన్న ఈ భారీ ప్రమాదానికి కేవలం మానవ నిర్లక్ష్యమే కారణం అన్న విశ్లేషణ మరింత బాధకి గురిచేస్తోంది.
రోజూ లక్షలాదిమందిని గమ్యస్థానానికి చేర్చడంలో భారతీయ రైల్వేకు ప్రపంచంలో మరే ప్రయాణ సంస్థా సాటిరాదు. కానీ భద్రతాపరంగా తన ముందు ఉన్న సవాళ్లను రైల్వేశాఖ ఇప్పటికీ ఛేదించలేకపోతోందన్న ఆరోపణకు తాజా సంఘటను ఉదాహరణగా నిలుస్తోంది. ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు నేతలంతా హుటాహుటిన అక్కడికి చేరుకోవడం, సహాయక చర్యలను చేపట్టడం, భారీ నష్టపరిహారాన్ని అందించడం వరకూ అంతా బాగానే ఉంటుంది. కానీ అసలు ప్రమాదం జరగకుండా ఎలాంటి చర్యలు సాగుతున్నాయి అన్నదానికి తగిన జవాబులు లభించడం లేదు.
గత రైల్వే బడ్జెటుని మినహాయిస్తే ప్రతిసారీ రైల్వే మంత్రులు ఇన్ని కొత్త రైళ్లను ప్రవేశపెట్టాము, ఇన్ని ప్రాజెక్టులను చేపట్టాము అంటూ ఊదరగొట్టేవారు. చేతిలో రైల్వే శాఖ ఉంది కదా అని పుట్టింటికీ, అత్తవారింటికీ మధ్య రైలుని ఏర్పాటుచేసుకున్న మహానుభావులూ లేకపోలేదు. కానీ భద్రత విషయంలోనూ, సౌకర్యాల విషయంలోనూ రైల్వే వ్యవస్థను ప్రక్షాలను చేసే సాహసాన్ని మాత్రం ఎవ్వరూ చేయలేకపోయారు. ఒకరకంగా నిన్న జరిగిన రైల్వే ప్రమాదం అలాంటి నిర్లక్ష్యపు ఫలితమే అని చెప్పుకోవచ్చు.
ప్రమాదం జరిగిన మార్గంలో పట్టాల నిర్వహణ సరిగా లేదని చెబుతున్నారు. ఈ 21వ శతాబ్దంలో రైలు పట్టాలు పగులుబారడం వల్ల వందమంది ప్రాణాలు కోల్పోయారని చెప్పుకోవడంకంటే సిగ్గుచేటు ఉండదు. ఒకవేళ ప్రమాదవశాత్తూ పట్టాలలో పగుళ్లు ఏర్పడ్డాయనుకున్నా లేదా ఏదో ఒక బోగీ చక్రాలు విరిగిపోయాయని అనుకున్నా... కాలం చెల్లిన సాంకేతికత కారణంగానే బోగీలన్నీ ఒకదానిలోకి ఒకటి దిగబడిపోయి నుజ్జునుజ్జయిపోయాయన్నది మాత్రం కాదనలేని వాస్తవం.
అయిపోయిందేదో అయిపోయింది అనుకోవడానికి పోయిన ప్రాణాలు తిరిగి వచ్చేవి కావు. కానీ మరింతమంది అభాగ్యులు ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వంతెనలు, క్రాసింగులు, పట్టాలు, బోగీలు, సిగ్నలింగ్... ఇలా వ్యవస్థలోని ప్రతి అంశాన్నీ ప్రక్షాళన చేయవలసి ఉంటుంది. అది వదిలేసి ఈ ప్రమాదం మోదీని అప్రదిష్టపాలు చేయడానికి పన్నిన కుట్రగా కొందరు భాజపీ ఎంపీలు విరుచుకుపడటం హాస్యాస్పదంగా ఉంది.