ఆసుపత్రుల పాలవుతున్న టాలీవుడ్ బ్లాక్ (మనీ) బాబులు!
posted on Nov 17, 2016 @ 3:58PM
దేశంలో అత్యధికంగా నల్ల డబ్బు ఎవరి వద్ద వుంటుంధి? అఫ్ కోర్స్, బిజినెస్ మెన్! అంబానీలు, అదానీలు వగైరా వగైరా మొదటి స్థానంలో వుంటారు. ఇక వారి తరువాత రాజకీయ నాయకులు దొరికిన కాడికి దోచుకుని దాచుకుంటూ వుంటారు. వ్యాపారస్తులు, నేతల తరువాత ఎక్కువ నల్లధనం వుండేది ఎవరి వద్దా? ఖచ్చితమైన యాన్సర్ చెప్పలేకపోయినా జనానికి వెంటనే గుర్తొచ్చేది సినిమా వాళ్లు! పొలిటీషన్స్ తరువాత అంత ఎక్కువగా డబ్బు సంపాదించేది గ్లామర్ ప్రపంచం వాళ్లే! అది కష్టార్జితమే అయినా పన్ను కట్టకుంటే బ్లాక్ మనీనే అవుతుంది కదా... ఇప్పుడు అలాంటి బ్లాక్ మనీనే మన టాలీవుడ్ బ్లాక్ బాసులకి పెద్ద తల నొప్పిగా మారింది! ఏకంగా వాళ్లను ఆసుపత్రుల పాలు చేస్తోంది!
నల్లధనం ఏం చేయాలో తెలియక మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కోటీశ్వరులు హాస్పిటల్స్ పాలు అవుతున్నారు. అంటే... ఏ హార్ట్ ఎటాకో , బీపీనో వచ్చి ట్రీట్ మెంట్ లు తీసుకోవటం లేదు. ఆరోగ్యంగానే వున్నారు. కాని, తమ ఆర్దిక ఆరోగ్యం దెబ్బతినకుండా వుండటానికి కార్పోరేట్ ఆసుపత్రుల్ని ఎంచుకుంటున్నారు. తమ బ్లాక్ మనీ సూట్ కేసులకి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించి వైట్ అండ్ హెల్తీగా మార్పించుకుంటున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే...
టాలీవుడ్ లో నల్ల దొరలకి కొదవే లేదు. బ్లాక్ మనీతో సినిమాలు తీసేవాళ్లు, తీసిన సినిమాలపై లాభాలు వస్తే దాన్ని బ్లాక్ మనీగా బాక్సుల్లో దాచేవారు... ఇక్కడ బోలెడు! ఇప్పుడు అలా దోచిన, దాచిన నల్ల డబ్బంతా డిసెంబర్ 30 తరువాత పాచిపోయి కంపు గొట్టే పరిస్థితి వచ్చేసింది. అందుకే, రోజుకు కోట్ల కొద్దీ లావాదేవీలు జరిపే కార్పోరేట్ హాస్పిటల్స్ ని మన వాళ్లు ఎంచుకుంటున్నారు. సాధారణంగా ప్రతీ పేషంట్ దగ్గర్నుంచీ లక్షకు అటుఇటుగా బిల్లులు వసూలు చేసే ప్రైవేట్ హాస్పిటల్స్ రాత్రికల్లా పది, పదిహేను కోట్లు ఈజీగా బ్యాంకుల్లో వేస్తుంటాయి. ఇలా ఇన్ని కోట్ల కలెక్షన్స్ ప్రతీ రోజూ మరే రంగంలోనూ వుండవు. అందుకే, భారీగా వసూళ్లు చేసే హాస్పిటల్స్ దగ్గరికి తమ నల్ల సొమ్ము తీసుకుపోతున్నారట టాలీవుడ్ కరోడ్ పతులు!
కార్పోరేట్ హాస్పిటల్స్ మ్యానేజ్ మెంట్ తో తమకు వున్న పరిచయాలు, బాంధవ్యాలు వంటివన్నీ ఉపయోగించి ఇప్పుడు టాలీవుడ్ బ్లాక్ మనీని వైట్ చేస్తోంది. హాస్పిటల్స్ నల్లరాయుళ్లతో జత కట్టి పేషెంట్స్ బిల్లుల్లో ఈ బ్లాక్ మనీని కూడా కలిపేస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే పేషెంట్లతో కుమ్ముక్కై దొంగ బిల్లులే సృష్టిస్తున్నారట! అలా లక్షల రూపాయాల బిల్లులు ప్రింటవుట్లు తీసి నల్ల డబ్బును బ్యాంకులకు తరలిస్తున్నారు. మ్యానేజ్ మెంట్లకు కమీషన్ వస్తుంటే నల్ల మారాజులకు పోగా మిగిలింది చేతికొస్తోంది!
మోదీ నోట్ల రద్దు నిర్ణయం లాభమో,నష్టమో ఇప్పడే చెప్పలేం కాని నిజాయితీతో చేసింది. ఆయన ఈ దేశానికి పట్టిన నల్లధనమనే రోగానికి వైద్యం చేద్దామని డిసైడ్ అయ్యాడు. కాని, ఆ వైద్యానికి హాని చేస్తున్నాయి కొన్ని కార్పోరేట్ హాస్పిటల్స్. అదీ సమాజానికి బోలెడు నీతులు చెప్పే సినిమా వాళ్లతో కలిసి! ఇలా అయితే... ఈ దేశానికి సోకిన రోగం తగ్గేదెప్పుదో?