అభివృద్ధి మాటున అభివృద్ధి చెందుతోన్న ఎమ్మేల్యేగారు!
posted on Dec 26, 2016 @ 2:24PM
అభివృద్ధి... ఈ మధ్య ఈ పదం తెగ రుద్దబడుతోంది! ఏ రాజకీయ నాయకుడ్ని కదిపినా అభిరుద్ది కోసమే తాను రాజకీయాల్ని రుద్ది రుద్ది పిండేస్తున్నానంటాడు!ఇంతకీ అభివృద్ధి అంటే ఏంటి? తాజాగా వైసీపీ నుంచీ టీడీపిలోకి జంపైన ఒకప్పటి టీడీపీ నాయకురాలు, ప్రస్తుత ఎక్స్ వైసీపీ లీడర్ వాలకం గమనించాలి. చక్కగా అర్థం అవుతుంది!
ఆమె ఒకప్పుడు టీడీపీలో వుండేది. ఏదో ఆషామాషీగా కాదు. పోలిట్ బ్యూరో మెంబర్ గా వెలిగిపోయేది. అలా పదేళ్లు పార్టీలో కొనసాగిన ఆమె రెండు సార్లు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసింది. కాని, ఎందుకోగాని... ఆమె అసెంబ్లీ చేరుకోలేకపోయింది. ఆమె టీడీపీలో వుండగా ఆ పార్టీ కూడా అధికారం చేపట్టలేకపోయింది. రెండు సార్లు ఎన్నికల్లో పోటీ, అయినా వరుస ఓటముల కారణంగా మేడమ్ గారు బాగా నష్టపోయారు. ఎలాగైనా గెలుపు గుర్రం ఎక్కి అసెంబ్లీలో కాలుపెట్టి నాలుగు డబ్బులు వెనకేసుకోవాలని భావించిన ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకుంది. అదృష్టవశాత్తూ గెలిచింది కూడా. కాని, ఈసారి మరో విధంగా బ్యాడ్ లక్కు వెక్కిరించి... ఆమె ఎమ్మెల్యేగా గెలిచని పార్టీ కాస్తా ప్రతిపక్షానికే పరిమితం అయిపోయింది!
ఆపరేషన్ సక్సెస్ ... పేషంట్ డెడ్ అన్నట్టు ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచి కూడా ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. మరో వైపు ఆమె మీద టీడీపీ తరుఫున పోటీ చేసి ఓడిన నాయకుడు మాత్రం ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నాడు. ఇసుక దందాలో ఇనుమడించి సంపాదిస్తున్నాడు. ఇదంతా బాధగా చూస్తోన్న లేడీ లీడర్ రెండున్నర ఏళ్లుగా ఆర్దిక ఒత్తిడికి లోనవుతున్నారు. తాను గెలిచి కూడా లాభం లేదనీ, అదే టీడీపీ నాయకుడు ఓడి కూడా భలే సంపాదిస్తున్నాడని కుమిలిపోయింది. పోనీ తనకు మూడేసి ఎన్నికల్లో అండగా నిలబడి కోట్ల రూపాయల ఖర్చులు భరించిన భర్తకైనా ఏమైనా లాభం వుందా అంటే అదీ లేదు. అసలు ఆయనగారిది మరో బాధ...
వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మన లీడర్ వారి హజ్బెండ్ ఆదాయ పన్ను శాఖలో మంచి ఆదాయం వచ్చే సీనియర్ ఆపీసర్. కాని, ఏవో కొన్ని కేసుల మూలన ఆయన్ని మూలన పడేసింది ఆదాయ పన్ను శాఖ. మంచి పొజీషన్లో పోస్టింగ్ వస్తే ఆయన సూపర్ గా రాబట్టేస్తారు. అందుకే, మన నాయకురాలు జగన్ వద్దకి వెళ్లి మొరపెట్టుకున్నారట. ఆయన జైట్లీతో మాట్లాడి మేడమ్ గారి భర్తని గారెల బుట్టలో వేయిస్తానన్నాడట. కాని, ఆ హామీ ఇప్పటి వరకూ నెరవేరిన దాఖలాలు లేవు. జగన్ మాట జైట్లీ వినేంత సీనూ లేదు. ఇదంతా అర్థమైపోవటంతో... ఆలసించిన ఆశభంగం అనుకున్నారు అమ్మగారు. టీడీపీ వారితో టచ్ లోకి వచ్చి తన డిమాండ్ వారి ముందు వుంచారట.
చంద్రబాబు, ఒకప్పటి ఈ పోలిట్ బ్యూరో సభ్యురాలు, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే గోడు అర్థం చేసుకుని అభయం ఇచ్చారట. జైట్లీతో తాను మాట్లాడి ఎమ్మెల్యేగారి శ్రీవారికి జేబు నిండా పనుండే పోస్టింగ్ వేయిస్తానన్నారట. అదే పది వేలు అనుకున్న ఆమె కనీసం వచ్చే ఎన్నికల ఖర్చుకైనా ఆయనగారు సంపాదించి రెడీగా పెడతారని భావించి పార్టీ దూకేసింది. ఆ తరువాతే మీడియా ముందుకొచ్చి చంద్రబాబు వల్లే అభివృద్ధి సాధ్యం అంటూ స్టేట్మెంట్ ఇచ్చి పచ్చ కండువా కప్పేసుకుంది! చాలా మందికి అప్పుడు ఒకటే అనుమానం కలిగింది... గతంలో దశాబ్ద కాలం పోలిట్ బ్యూరో సభ్యురాలిగా పని చేసిన ఆమెకి చంద్రబాబు అభివృద్ది చేయగలరని 2014లో నమ్మకం కలగలేదా? వైసీపీలోకి వెళ్లిపోయి అక్కడ ఎమ్మెల్యేగా గెలిచాక ... ఇప్పుడు మళ్లీ తన పాత పార్టీ, ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ అయిన తెలుగుదేశం మీద ప్రేమెందుకు పుట్టుకొచ్చింది? చంద్రబాబు అభివృద్ధి చేయగలరని హఠాత్తుగా జ్ఞానోదయం ఎలా కలిగింది?
పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు అభివృద్ధి, అభివృద్ధి అంటోన్న మాట నిజమే కాని... ఎవరి అభివృద్ధి? దీనిపైనే క్లారిటీ లేదు! జనం అభివృద్ధా? తమ అభివృద్ధా?