ఎన్నికల నుంచి కులం తప్పుకుంటుందా!
posted on Jan 3, 2017 @ 11:05AM
కులమతాల ప్రాతిపదికన ఓట్లని అభ్యర్ధించడం నేరమంటూ సుప్రీం కోర్టు వెలువరించిన తీరు భారత ఎన్నికల వ్యవస్థలోనే ఓ మైలురాయని విశ్లేషణలు మొదలయ్యాయి. అసలు ఇక మీదట ఎన్నికలలో కులం అన్న పేరే వినిపించదంటూ ఆశావహులు ఊహాలోకాలలో తేలిపోసాగారు. కానీ నిజంగా ఈ తీర్పుతో మన దేశంలో ఎన్నికలు మరింత స్వచ్ఛతను సంతరించుకుంటాయా!
పదుల కొద్దీ మతాలు, వందలాది భాషలు, వేలాది కులాలు... ఇంత వైవిధ్యమున్నా కూడా సమైక్యంగా ఉండటమే భారతీయ తత్వమన్నది పైకి వినిపించే మాట. కానీ ఆ మతాలు, కులాల ఆధారంగా ప్రజల్ని చీల్చి అధికారాన్ని సంపాదించుకుంటున్నారన్నది కాదనలేని వాస్తవం. ఏ రాష్ట్రంలోని ఎన్నికల తీరుని చూసినా కూడా రాజకీయాల మీద ఈ కులమతాలు ఎంతవరకు ప్రభావం చూపుతాయో ఇట్టే తెలిసిపోతుంటుంది. అంతదాకా ఎందుకు? దేశం నడిబొడ్డున ఉన్న ఉత్తర్ప్రదేశ్లో కొన్ని దశాబ్దాలుగా కులాల సమీకరణలే అధికారాన్ని నిర్ణయిస్తున్నాయి.
మన దేశంలోని ఎన్నికలలో పాలుపంచుకుంటున్న ప్రతి పార్టీకీ తనదైన కులతంత్రం ఉంది. కొన్ని పార్టీలు బహిరంగంగానే తాము ముస్లింల తరఫునో, హిందుత్వ తరఫునో మొగ్గి ఉన్నామని చెప్పుకుంటాయి; ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీలు అణగారిన పక్షమని చెప్పుకొంటూనే అధికారం కోసం పాటుపడుతుంటాయి; కాంగ్రెస్ లాంటి పార్టీలు సెక్యులరిస్టు పేరుతోనే అవసరమైనప్పుడు మతరాజకీయాలకు పాల్పడుతుంటాయి.... ఆఖరికి కమ్యూనిస్టు పార్టీలలో సైతం కొన్ని అగ్రవర్ణాలదే పైచేయి అన్న ఆరోపణలూ ఉన్నాయి.
పార్టీల పరిస్థితి ఇలా ఉంటే జనం మనస్తత్వం అందుకు భిన్నంగా ఏమీ లేదు. నాగరికతలో ఎంత ముందుకు పోయినట్లు కనిపించినా... కొత్త మనిషి పరిచయం అవగానే, అతని కులమేమిటా అని బేరీజు వేసుకునే మనస్థితి మనది. విదేశాలకు వెళ్లినా కులకుంపట్లు పెట్టుకుంటాము, ఒలంపిక్స్లో పతకం సాధించిన మనిషి కులం ఏమిటా అని ఆరా తీస్తాం. ఆఖరికి వీళ్లకి రక్తం కావాలన్నా కూడా కులం కావాలేమో అంటూ ప్రపంచం నవ్వుకునే స్థితికి చేరుకున్నాం. ఇలాంటి పరిస్థితిలో ఒక అభ్యర్థి ప్రత్యేకించి తన కులం పేరు చెప్పి ఓటు అడగాల్సిన అవసరం ఏముంది? ఏ పార్టీ ఏ కులానికి ప్రాముఖ్యతని ఇస్తుంది, ఏ పార్టీ తరఫు అభ్యర్ధి ఏ కులపు వాడు నిలబడ్డాడు అని ప్రజలే ఓ అభిప్రాయానికి వచ్చేస్తున్నారు కదా!
ఎన్నికలలో కులాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పుతో భాజపాకు దెబ్బ అని విశ్లేషిస్తున్నవారు లేకపోలేదు. ఎందకంటే భాజపా తన మ్యానిఫెస్టోలో తరచూ రామమందిర నిర్మాణాన్ని ప్రస్తావిస్తూ వస్తోంది. ఇక ముందు ఆ అవకాశం దక్కకపోవచ్చు. ఆ పార్టీ మ్యానిఫెస్టో నుంచి రామమందిరాన్ని తొలగించమంటూ మున్ముందు తీర్పు వెలువడినా ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ భాజపా రామమందిరానికి అనుకూలం అన్న అభిప్రాయాన్ని మాత్రం ఓటర్ల మది నుంచి తొలగించలేరు కదా! ఏతావాతా సమస్య ఒక పార్టీ బహిరంగ ప్రకటనలలో మాత్రమే లేదని తేలిపోతోంది. పౌరుల మనసులోనే కుల కల్మషం ఉంది. అది తొలగిపోవాలంటే భారీ మార్పులే రావాలి. దేశంలోని మేధావులు, లేదా మేధావులమని భుజకీర్తులు తగిలించుకున్నవారు ముందుగా ఆలోచించాల్సింది... అసలు కులం అనే మాటని నిర్మూలించడం ఎలాగా అనే!