ఉద్దానం - పవన్ విమర్శకి చంద్రబాబు జవాబు!
posted on Jan 7, 2017 @ 1:01PM
జనసేన అధినేత పవన్కళ్యాణ్ మీద ఒక భారీ విమర్శ ఉంది. హడావుడిగా ఎగసిపడే కెరటంలా ఆయన అప్పుడప్పుడూ వచ్చి ఓ నాలుగు మాటల తూటాలని పేల్చి వెళ్లిపోతూ ఉంటారని అంటుంటారు. పైగా తెదెపా కష్టకాలంలో ఉన్న ప్రతి సందర్భంలోనూ ప్రజలని చల్లార్చేందుకో, వారి దృష్టి మరల్చేందుకో పవన్ మైకు పట్టుకుంటారన్న విశ్లేషణలూ వినిపిస్తుంటాయి.
ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య విషయంలోనూ ఆయన చేపట్టిన ఉద్యమం మీద ఇలాంటి విమర్శలే వచ్చాయి. పెద్దనోట్ల రద్దు మీద పెను విమర్శలు చేస్తారనుకుంటే... ఎక్కడో ఉద్దానం సమస్య మీద పవన్ ప్రతిస్పందించడం ఏమిటనేవారు లేకపోలేదు. నిజానికి ఉద్దానం సమస్య ఏమంత తేలికగా కొట్టిపారేసే విషయం కాదు. అంతుపట్టని కిడ్నీ వ్యాధులు సోకి గత పది సంవత్సరాలలో ఈ ప్రాంతంలో 4,500 మంది చనిపోయారంటే... పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో గ్రహించవచ్చు.
ఒక ఇరవై ఏళ్ల క్రితం ఆంధ్రాలోని ఉత్తర కోస్తా జిల్లాలో మొదలైన ఈ వింత వ్యాధితో అక్కడ ప్రతి ఇంటా ఒక్కరన్నా మృత్యువుతో పోరాడుతున్నట్లు అంచనా. అకస్మాత్తుగా రక్తపోటు రావడం, షుగర్ వ్యాధి బారిన పడటం, రక్తకణాలు తగ్గిపోవడం, మూత్రంలో యూరిక్ యాసిడ్ పోవడం... వంటి లక్షణాలు మొదలై చివరికి అది కిడ్నీ వైపల్యానికి దారితీయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఉద్దానం నెఫ్రోపతి పేరుతో ప్రపంచ ప్రసిద్ధమైన ఈ సమస్యకి కారణం ఏమిటన్నది మహామహా శాస్త్రవేత్తలే తేల్చేలేకపోయారు.
2016లో హార్వర్డు విశ్వవిద్యాలయం, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వంటి ఉద్దండ సంస్థలు కలిసి చేపట్టిన పరిశోధనలో ఉద్దానం ప్రాంతంలోని మంచినీరులో సిలికా అనే పదార్థం ఎక్కువగా ఉండటం వల్లే ఈ సమస్య ఉత్పన్నం అవుతోందేమో అన్న అనుమానాన్ని వెలిబుచ్చాయి. దీనికి తోడు పవన్ హఠాత్తుగా ఉద్దానం సమస్య గురించి మాట్లాడటం మొదలుపెట్టడంతో రాష్ట్ర ప్రజల దృష్టి ఉద్దానం వైపుగా మళ్లింది. ఉద్దానం బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ పవన్ అల్టిమేటం జారీచేశారు. పవన్ అల్టిమేటానికి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించడంతో ఉద్దానానికి ఊరట లభించినట్లయ్యింది.
వ్యాధి తీవ్రత ఉన్న గ్రామాలకు మినరల్ వాటర్ అందిస్తామనీ, అక్కడ మరో రెండు డయాలసిస్ యూనిట్లను మంజూరు చేస్తున్నామనీ, కిడ్నీ రోగులకు పింఛన్లనూ, సంచార వైద్య సదుపాయాన్నీ కల్పిస్తామని చంద్రబాబు చేసిన ప్రకటనతో పవన్ శాంతించినట్లే కనిపించారు. ఆయన ప్రకటనను స్వాగతిస్తున్నానంటూ పవన్ ట్విట్టర్లో చేసిన పోస్టు తెదెపాకి మంచి ఉత్సాహాన్నిచ్చింది.
ఉద్దానం రాజకీయ అంశం కాదు కాబట్టి దీనిని లేవనెత్తడం వల్ల జనసేనకీ, తెదెపాకీ, ఉద్దానం బాధితులకీ కూడా లాభం కలిగించేందిగా ఉంది. మున్ముందు పవన్ ఇలాంటి ప్రజా సమస్యలు మరిన్నింటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. అలాంటి నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రని పవన్ పోషించడం వల్ల అన్ని వర్గాలకీ మేలు జరుగుతుందన్ని ప్రజల భావన. మరి రాజకీయంగా తెదెపాని ఇరకాటంలో పెట్టే విషయాలలోనూ పవన్ ఇదే తీరున నిక్కచ్చిగా వ్యవహరించగలరా లేదా అన్నదే అనుమానం!