ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న హైకోర్టు తీర్పు
posted on Jan 6, 2017 @ 11:26AM
జీవో 123 కింద భూమి సేకరణని జరపడానికి వీల్లేదంటూ నిన్న హైకోర్టు వెలువరించిన తీర్పు పతాక శీర్షికలలో నిలిచింది. దీంతో ఆల్ ఈజ్ వెల్ అనే సంబరంలో ఉన్న తెరాస ప్రభుత్వం నేల మీద కాళ్లని నిలిపి తన తీరుని సమీక్షించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. నిజానికి 2015 జులైలో తెలంగాణ ప్రభుత్వం ఈ జీవోను తెచ్చినప్పటి నుంచీ, విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. 2013 భూసేకరణ చట్టాన్ని పక్కనపెట్టి ఇలా దొడ్డిదారిని భూసేకరణ జరపాల్సిన అగత్యం ఏమిటంటూ పెద్దలు ప్రశ్నిస్తూనే వచ్చారు.
తను తెచ్చిన రాష్ట్రం కాబట్టి తను తెచ్చిన చట్టానికి ఎదురుండదు అని భావించిన తెరాస ప్రభుత్వానికి... మల్లన్నసాగర్ నిర్వాసితులు గట్టిగానే తమ గొంతుని వినిపించడం మొదలుపెట్టారు. దాంతో ప్రభుత్వానికి ఎక్కడో ఒక చోట ఎదురుదెబ్బ తప్పదన్న అనుమానం కలుగుతూనే వస్తోంది. అది హైకోర్టు తీర్పు రూపంలో నిన్న బయటపడింది. ఏదో ఒకటి రెండు గ్రామాలలోని ప్రజలు భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుంటే- అబ్బే వారిని ఎవరో రెచ్చగొడుతున్నారు అని ఓట్రించవచ్చు. కోదండరాం వంటి పెద్దలు భూసేకరణకు విరుద్ధంగా మాట్లాడుతుంటే- వారి మీద తెలంగాణ ద్రోహులుగా ముద్ర వేయవచ్చు. కానీ ఏకంగా ఉన్నత న్యాయస్థానమే ఈ జీవోని వ్యతిరేకించడంతో ఇప్పటికైనా ప్రభుత్వం తన కార్యచరణలోని లోటుపాట్లని గమనించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
2013లో పార్లమెంటు ఆమోదించిన భూసేకరణ చట్టం చాలా బలిష్టమైనదన్న అభిప్రాయం ఉంది. నిర్వాసితుల నష్టాన్ని, అక్కడి సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని... భూసేకరణ ద్వారా లాభమే కానీ నష్టం కలగని రీతిలో ఈ చట్టాన్ని రూపొందించారు. కానీ చట్టప్రకారం వెళ్తే పని సులువుగా జరగదనో, పరిహారంగా పెద్ద ఎత్తున వనరులను వదులుకోవాల్సి వస్తుందనో... కారణం ఏదైతేనేం, తెలంగాణ ప్రభుత్వం జీవో 123 ద్వారా సులువుగా భూసేకరణని సాగించే ప్రయత్నం చేసింది.
నిర్వాసితులకు తగిన పునరావాసం కల్పించకుండా, సమాజిక ప్రభావం మీద అధ్యయనం చేయకుండా, అక్కడ ఉపాధి ఉద్యోగాలు నష్టపోయిన వారికి మరో దారి చూపించకుండా... జీవో 123 ద్వారా భూసేకరణ చేసే ప్రయత్నం జరిగిందంటున్నారు విమర్శకులు. పైగా మార్కెట్ రేటుతో పొంతన లేని పరిహారాన్ని అందిస్తున్నారనీ, ఇచ్చిందేదో పుచ్చుకోమని ఒత్తిడి చేస్తున్నారనీ, ఒకో చోట ఒకో తీరున పరిహారాన్ని చెల్లిస్తున్నారనీ... ఇలా రకరకాల వాదనలు వినిపించాయి. దీంతో న్యాయస్థానం కొంతవరకు ఏకీభవించింది కూడా! ఫలితంగా ఇక మీదట ఈ జీవో కింద భూసేకరణ జరిపేందుకు వీల్లేదని తీర్పుని అందించింది. ఇది 2013 భూసేకరణ చట్టంలోని కొన్ని అంశాలకు విరుద్ధంగా ఉందనీ, చట్టం ముందు అందరూ సమానులే అనే ఆర్టికల్ 14కి వ్యతిరేకంగా ఉందనీ పేర్కొంది. దీని వలన సదరు భూములపై ఆధారపడినవారి హక్కులు కూడా హరించుకుపోతాయని అభిప్రాయపడింది.
సహజంగానే హైకోర్టు తీర్పుతో ప్రతిపక్షాలు సంబరపడ్డాయి. తెరాస పెద్దలు మాత్రం 2013 భూసేకరణ చట్టాన్ని యథావిధిగా అమలుచేయడం కష్టమని చెబుతోంది. అందుకోసమే జీవో 123ని తీసుకువచ్చామని చెబుతోంది. పైగా కొత్తగా తాము రూపొందించిన 2016 భూసేకరణ చట్టం కనుక అమలులోకి వస్తే భూసేకరణలోని ఇబ్బందుల తొలగిపోతాయని చెబుతోంది. అయితే ఈ నూతన చట్టం కూడా 2013 చట్టానికి విరుద్ధంగానే ఉండి ఉంటుందనీ, అది కూడా న్యాయస్థానం ముందు నిలువదనీ విమర్శలు వినవస్తున్నాయి.
తెలంగాణ రైతులు ఇప్పటివరకూ బోరు బావుల మీదే ఆధారపడుతున్న దుస్థితిలో సాగునీటి ప్రాజెక్టులు అత్యంత ఆవశ్యకం అన్న విషయాన్ని ప్రత్యకించి చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతుల ఆత్మహత్యలలో తెలంగాణది రెండో స్థానం అన్న విషయాన్ని గుర్తించినప్పుడు, ఇక్కడి రైతుల కోసం ఎంత శ్రమకి ఓర్చైనా సరే సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాల్సిందే అన్న పట్టుదలా కలగక మానదు. కానీ అందుకోసం జరిగే భూసేకరణలో నిర్వాసితులకు ఎలాంటి అన్యాయం జరగకూడదన్నదే ప్రజల అభిలాష. మరి అందుకోసం పకడ్బందీగా రూపొందించిన 2013 భూసేకరణ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎందుకని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తోందన్నది ఊహకందని ప్రశ్న!