ఉగ్రవాదులతో టర్కీ చెలగాటం
posted on Jan 2, 2017 @ 11:10AM
ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకలలో మునిగి ఉన్న సమయంలో టర్కీ మాత్రం శోక సంద్రంలో మునిగిపోయింది. డిసెంబరు 31 రాత్రి ఆ దేశ రాజధాని ఇస్తాంబుల్లోని ఓ నైట్ క్లబులోకి ఓ ఉగ్రవాది శాంతాక్లాజ్ వేషధారణలో అడుగుపెట్టాడు. బహుమతులు పంచాల్సిన చేతులతోనే విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. పదులకొద్దీ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని రూఢి అయిన తరువాత, చల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. హారర్ సినిమాకంటే భయాన్ని కలిగించే ఈ వార్త, అక్కడి భీతావహ పరిస్థితికి ఒక సూచన మాత్రమే!
2016లో టర్కీలో ఉగ్రదాడులు సర్వసాధారణం అయిపోయాయి. ఈ ఒక్క ఏడాదే అక్కడ 300 మందికి పైగా పౌరులు ఉగ్రవాదుల దాడులలో మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా కూడా స్వయంకృతాపరాధమే అంటున్నారు నిపుణులు. ఉగ్రవాదం మీద సవారీ చేయాలనుకున్న టర్కీ పాలకులు చివరికి ఆ ఉగ్రవాదానికే బలవుతున్నారని విశ్లేషిస్తున్నారు. అందులో నిజం లేకపోలేదు.
ఐరోపా, ఆసియా ఖండాల మధ్యన ఉండే టర్కీ దేశం మొదటి నుంచీ ఏమంత అభివృద్ధి చెందిన దేశం కాదు. అందుకనే "Sick man of Europe" అని టర్కీని పిలుస్తారు. గత దశాబ్ద కాలంలో అక్కడి పాలకుల తీరు, దేశాన్ని మరింత అధ్వాన్న స్థితిలోకి నెట్టేశాయి. చుట్టుపక్కల దేశాలని నియంత్రిద్దామనుకునే అతితెలివితేటలు, చివరికి భస్మాసుర హస్తంలా పరిణమించాయి.
టర్కీ పక్కనే ఉన్న సిరియా, ఇరాక్ దేశాలలో ఆ మధ్య ‘ఇస్లామిక్ స్టేట్’ ఉగ్రవాదులు వేళ్లూనుకున్న విషయం తెలిసిందే! మొదట్లో టర్కీ ఈ ఉగ్రవాదులని చూసీ చూడనట్లు ఊరుకుంది. IS ఉగ్రవాదులు తమ దేశంగుండా ఇతర దేశాలలోకి ప్రవేశిస్తున్నా కిమ్మనకుండా ఉంది. పైగా వారిని ప్రోత్సహించిందన్న విమర్శలూ వినిపించాయి. కానీ ఎప్పుడైతే తన దేశంలో కూడా IS కార్యకలాపాలు పెచ్చరిల్లిపోతున్నాయో... అప్పుడిక వారి మీద చర్యలు తీసుకోక తప్పలేదు. అందుకోసం నాటో దళాలతో కలిసి ISతో పోరాటం మొదలుపెట్టింది. కానీ అప్పటికే చేతులు కాలిపోయాయి. సిరియా, ఇరాక్లలో వెనక్కి తగ్గాల్సి రావడంతో IS టర్కీలో బలపడేందుకు ప్రయత్నించసాగింది.
పోనీ IS మీద జరుగుతున్న పోరులో అన్నా టర్కీ మనస్ఫూర్తిగా పాల్గొంటోందా అంటే అదీ లేకపోయింది. టర్కీ, రష్యాలు రెండూ కలిసి ఒకవైపు సిరియాలోని IS ఉగ్రవాదుల మీద దాడిచేస్తున్నట్లు హడావుడి చేస్తూనే... అక్కడ అధ్యక్షస్థానంలో తమకు అనుకూలంగా ఉన్న అసద్ పదవికి ఎలాంటి ఆపదా రాకుండా పన్నాగాలు మొదలుపెట్టాయి. దాంతో అమెరికా కూడా టర్కీకి వ్యతిరేకంగా మారిపోయింది.
సిరియా, ఇరాక్ల మీద పట్టు సాధించేందుకు టర్కీ చేస్తున్న పలు ప్రయత్నాల వల్ల దాని పొరుగు దేశం ఇరాన్కు కూడా నచ్చకపోవడంతో ఇరాన్ సైతం టర్కీ అంటే రగిలిపోతోంది. ఇంతాచేసి పోనీ రష్యాతోనన్నా సంబంధాలు మెరుగ్గా ఉన్నాయా అంటే అదీ లేదు. గత నెల టర్కీలోని రష్యా రాయబారిని కాల్చి చంపడంతో, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఒక్క కుదుపుకి లోనయ్యాయి.
ఇవన్నీ ఒక ఎత్తైతే కుర్దుల మీద టర్కీ ప్రభుత్వం సాగిస్తున్న అణచివేత ధోరణి మరో ఎత్తు. టర్కీలోని కొన్ని ప్రాంతాలలో తాము స్వయంగా పాలించుకునే అవకాశం ఇవ్వమంటూ ఈ కుర్దులు ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నారు. వారి సమస్యలని సానుకూలంగా పరిష్కరిస్తామని హామీ ఇస్తూనే, మరోవైపు వారిని అణచివేసే ప్రయత్నం చేస్తోంది టర్కీ ప్రభుత్వం. ఫలితంగా కుర్దుల నిరసన సాయుధ పోరాట స్థాయికి చేరుకుంది.ఏతావాతా ఒక దేశం ఎలా వ్యవహరించకూడదో అన్నిరకాలుగా ఆచరించి చూపింది టర్కీ. ఫలితంగా ఇప్పుడు అగ్నిగుండంగా మారిపోయింది. మరి ఇక మీదటన్నా తెలివి తెచ్చుకుని దీర్ఘకాలికంగా లాభదాయకమైన మార్గాన్ని ఎంచుకుంటుందా లేకపోతే మరిన్ని వ్యూహాలు పన్ని తనతో పాటుగా ప్రపంచశాంతికే ముప్పు తెస్తుందా అన్నది కొత్త ఏడాదిలో తేలిపోనుంది.