ఇది రెచ్చగొట్టడం కాదా పవన్ కళ్యాను ?

జల్లికట్టు వివాదంతో ఆంధ్రప్రదేశ్ ‘స్పెషల్ స్టేటస్’ ఇష్యు మరోసారి తెరపైకి వచ్చంది. తమిళుల జల్లికట్టు పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రత్యేక హోదాపై పోరాటం చేయాలని నినాదాలు తెరపైకి వస్తున్నాయి. ఈ సంవాదాన్ని పరిశీలిస్తే.. జల్లి కట్టు తరహలో ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ సిఎం చంద్రబాబు పోరాడాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు లేఖ రాయడంతో ఈ లింకు తెరపైకి వచ్చిందనుకోవాలి. ఈ పోరాటంలో చంద్రబాబు రాష్ట్రానికి నాయకత్వం వహించాలని, ప్రత్యేక హోదా ఉద్యమానికి చంద్రబాబు నాయకత్వం వహిస్తే కనుక అన్నివర్గాలు ఆయనకు తోడుగా నిలుస్తాయని, చట్టవిరుద్ధమైన జల్లికట్టునే తమిళులు సాధించుకున్నారని, అలాంటిది చట్టబద్ధమైన హామీలను సాధించుకునే దమ్ము మనకు లేదా? అని ప్రశ్నిస్తూ.. నైస్ గా ఓ లెటర్ రాసి చంద్రబాబును ఓ కార్నర్ లోకి నెట్టేశారు కేవీపీ.    ఇది పక్కా పొలిటికల్ లెటర్ అన్న సంగతి కాస్త పరిశీలిస్తే అర్ధమైపోతుంది. జల్లికట్టు పోరాటానికి ఏపీ స్పెషల్ స్టేటస్ కి లింకు పెట్టడమా? జల్లికట్టులో ఏముంది?  కేంద్రం ఒక అర్దినెన్స్ ఇవ్వాలి. మహా అయితే రెండు పేపర్లు, నాలుగు సంతకాలు. అక్కడితో తేలిపోతుంది లెక్క. కానీ స్పెషల్ స్టేటస్ అంటే కేంద్రానికి బోలెడు కరుసు. ఇంకెన్నో పొలిటికల్ ఎత్తుగడలు. ఏవేవో సమీకరణలు. ఇలా ఎంతో వైరుధ్యం వున్న రెండు అంశాలను ముడిపెట్టేశారిప్పుడు. అసల్ లాజిక్ లేదిక్కడ. కాని ఇక్కడ లాజిక్కులతో పనిలేదు. రాజకీయం రక్తికట్టించేయాలి. చిత్తశుద్ధి లేని నాయకులు చేసే ప్రకటనలు ఇలానే వుంటాయి అనుకోవాలి మరి. ఏపీకి అన్యాయం జరిగిన మాట వాస్తవం. హోదా హామీని తుంగలో తొక్కింది కేంద్రం. ఇప్పుడు కచ్చితంగా హోదాను సాధించుకోవాలి. దీని కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగాల్సిందే. అయితే దిన్ని జల్లికట్టు తో ముడిపెట్టెయడమే విచిత్రం.    కేవీపీ లాంటి నాయకులు ఇంకా నయం. ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్టాండ్ ఇంకా విచిత్రంగా వుంది. ‘’హోదా పై యువత పోరు బాట పడితే తాను మదత్తు ఇస్తానని, రాజకీయ నాయకులు రాజీపడొచ్చు ఏమో కానీ యువత ఊరుకోరని, యువతకు నా మద్దత్తు’’ అంటూ ట్విట్టర్ గేమ్ ఆడుతున్నారు పవన్ కళ్యాణ్. ఆయన మాటలు గమనిస్తే యువతను రెచ్చగొడుతున్నాడా? అనిపిస్తుంది. కేవీపీ నయం పోరాటం చేయాలని చంద్రబాబు కు ఓ సూచన చేశాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో యువతపై భారం మోపుతున్నాడనిపిస్తుంది. ''ప్రజలు ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. యువత రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి వద్దు. మీరు అధికారం ఇచ్చిన నాయకులే స్టేటస్ తెచ్చిపెట్టాలి'' అని గత సభల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఇపుడు 'ఎవరు ఊరుకున్నా యువత ఊరుకోదు' అనే నినాదాన్ని ఎత్తుకోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో పవన్ కల్యానే చెప్పాలి.

పట్టాలు తప్పుతున్నాయా... పట్టు తప్పుతున్నాయా?

  ఒక రైలు పట్టాలు తప్పటం... ప్రమాదానికి దూరంగా వున్న మనకంతా టీవీలో బ్రేకింగ్ న్యూస్ మాత్రమే. కాని, అదే ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన వారికి మాత్రం హార్ట్ బ్రేకింగ్ న్యూస్. తెల్లవారితే తమ గమ్యాల్ని చేరుకుంటామని నిద్దురలోకి జారుకున్న సామాన్యుల బతుకులు అలాగే తెల్లారిపోయాయి. నలభై మందికి పైగా చనిపోతే, యాభై మందికి పైగా గాయపడ్డారు. అయితే ఇదంతా ఒక కోణం మాత్రమే. మరో విస్త్రృత కోణంలో చూసినప్పుడు దీని వెనుక కుట్ర దాగుందని నిఘా వర్గాలు అనుమానిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఒకవైపు ఐఎస్ఐ, మరో వైపు నక్సల్స్ ఇద్దరూ వుండొచ్చని చెబుతుండటం మరింత తీవ్రత పెంచుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే సామాన్య భారతీయులు సైతం ఇప్పుడు తమకు తెలియకుండానే యుద్ధంలో సైనికులు అయిపోయారు. శత్రువులు నిరాయుధులైన రైలు ప్రయాణికుల్నే తమ టార్గెట్ చేసుకున్నారు...   జగదల్ పూర్ భువనేశ్వర్ హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ ప్రమాదవశాత్తూ పట్టాలు తప్పిందా? కాదనే అంటున్నారు చాలా మంది. రైల్వే శాఖ నిర్లక్ష్యం వల్ల జరిగే ప్రమాదాలు ఇలా వుండవని అంటున్నారు. చలి విపరీతంగా వుండే ఉత్తరాదిలో పట్టాలు కోతకు గురవుతుంటాయి. అలాంటి పరిస్థితి మన ఆంద్రప్రదేశ్ లో వుండదంటున్నారు. ఇక అంతకు కొన్ని నిమిషాల ముందు గూడ్స్ బండి సురక్షితంగా వెళ్లిన చోటే హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురి కావటం ఖచ్చితంగా కుట్ర కోణాన్ని సూచిస్తుందంటున్నారు. ఈ పని మావోయిస్టులు చేసి వుండవచ్చని కూడా కేంద్ర ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి. అది నిజం అనటానికి ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కాని, నిజమైతే మాత్రం అది పరమ కిరాతకం. సాయుధులైన మావోలు ప్రభుత్వ బలగాలతో యుద్ధం చేయాలిగాని సామాన్యుల్ని పణంగా పెట్టకూడదు.   ఇప్పుడు జరిగిన హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ దుర్ఘటనే కాదు ఇంతకు ముందు జరిగిన మరో రెండు ప్రమాదాలు కూడా కుట్ర వల్లే జరిగాయని తాజాగా వెల్లడైంది. 2016 నవంబర్ 20న జరిగిన పాట్నా ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో 151మంది ప్రాణాలు కోల్పోయారు. డిసెంబర్ 28న జరిగిన అజ్మీర్ ఎక్స్ ప్రెస్ విషాదంలో 63మంది సమిధలయ్యారు. వీరంతా కూడా యాక్సిడెంట్లో చనిపోయారనే మొదటగా భావించాం. కాని, ఈ మధ్యే బీహార్లో అరెస్టైన ఒక ఉగ్రవాది చెప్పిన దాని ప్రకారం దాదాపు రెండు వందల మందిని బలి తీసుకున్న ఆ రెండు ట్రైన్ యాక్సిడెంట్స్ పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్రతో జరిగాయని బయటపడుతోంది. ఇది నిజమని ఇంకా తేలనప్పటికీ మనం ఆశ్చర్యపోవటానికి మాత్రం వీలు లేదు. విభ్రాంతికర రీతిలో మన మీద విరుచుకుపడటానికి మన శత్రువులు ఇంటా, బయటా ఎప్పుడూ సిద్ధంగానే వుంటూ వస్తున్నారు. ఐఎస్ఐ, ఐసిస్ మొదలు నక్సల్స్, ఉల్ఫాల వరకూ బోలెడు మంది ఇదే కోవలోకి వస్తారు.   కొందరు మతానికి, కొందరికి జాతి, కొందరికి ప్రాంతం, కొందరికి వామపక్ష ఆదర్శవాదం... ఎవరి కారణాలు ఏవైనా సామాన్యులకే ప్రాణ సంకటంగా మారుతోంది.65వేల కిలో మీటర్ల విస్తీర్ణంలో రైళ్లు నడిపే ఇండియన్ రైల్వేస్ ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జరిగే ప్రమాదాల్లో పూర్తి బాధ్యత రైల్వేస్ దే. కాని, ఉగ్రవాదులు, ఇతర సంఘ విద్రోహ శక్తులు దారుణానికి పాల్పడితే రైల్వే చేయగలిగింది ఏం లేదు. అది నిఘా వర్గాలు, ప్రభుత్వ భద్రతా బలగాలు అరికట్టాల్సింది. అయినా కూడా రైల్వే శాఖ కోట్లాది మందికి జీవనాడి లాంటి రైల్వేను మరింత సురక్షితంగా మార్చాలి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కూడా భారీగా ఉద్యోగాలు భర్తీ చేయటం, టెక్నాలజీని అభివృద్ధి పరుచుకోవటం వంటివి చేపట్టాలి. అప్పుడే ప్రపంచపు అతి పెద్ద సంస్థ అయిన భారతీయ రైల్వే భద్రంగా మనగలుగుతుంది...

కృష్ణ... కృష్ణా!

  కులం గొప్పదా? మతం గొప్పదా? దీనికి ఎవరమైనా ఏం చెబుతాం? పైకి మనం ఎలాంటి సమాధానాలు చెప్పినా లోలోన మాత్రం అందరూ అంగీకరించేది ఒక్కటే! మన దేశంలో మతం చాలా బలమైంది. కాని, కులం మతం కంటే కూడా బలవత్తరమైంది. ఈ విషయం మరోసారి చాగంటి వారి యాదవుల వివాదంతో నిరూపితమైంది! చాగంటి కోటేశ్వర్ రావు ప్రవచనకర్త. ఆయన ప్రవచనాల గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది లేదు. మరే పండితుడికీ దక్కని గౌరవం, అభిమానం ఆయనకు దక్కుతున్నాయి. బహుశా అందుకేనేమో అన్నట్టు ఆయన మీద పదే పదే వివాదాలు రాజుకుంటున్నాయి. ఆ మధ్య ఆయన శిరిడీ సాయిని అవమానించారని తెగ రాద్ధాంతం జరిగింది. కాని, ఆయన తనకు సాయిబాబాపై ఎలాంటి చెడు ఉద్దేశం లేదని వివరణ ఇచ్చుకున్నారు. ఆ సమయంలో చెలామణి అయిన వీడియోల్లో కూడా ఆయన సాయిని కావాలని దుర్భాషలాడినట్టు ఎక్కడా కనిపించలేదు. అయినా కూడా ఎలక్ట్రానిక్ మీడియా సందట్లో సడేమియా వ్యవహారం నడిపి టీఆర్పీలు దండుకుంది. ఇప్పుడూ అలాగే జరిగింది యాదవుల విషయంలో... చాగంటి వారు శ్రీరాముడు దశరథ మహారాజుకి జన్మించాడనీ...కాని, శ్రీకృష్ణుడు అమాయకులు, డాంభికం ఎరగని యాదవుల కులంలో పుట్టాడని అన్నారు. ఇందులో వాళ్లని పొగడటమే తప్ప చులకన చేయటం ఏమీ లేదు. కాకపోతే, అలవాటులో భాగంగా ఆయన జాతీయం వాడారు. తల కడిగితే మొల కడగరు, మొల కడిగితే తల కడగరని! ఇది యాదవుల్ని అవమానించటమే అంటూ కొందరు బయలుదేరారు. వాళ్ల గొంతు కేవలం సోషల్ మీడియాలోనే అయితే పెద్దగా వినిపించేది కాదు. ఇందులో ఘుమఘుమలాడే టీఆర్పీలు వుండటంతో మీడియా ఎంటరైంది. అక్కడే అసలు రచ్చ మొదలైంది. టీవీ స్టూడియోల్లో చాగంటి వారి ప్రవచనంపై, మాటపై చర్చ పెట్టడంతో తెలుగు రాష్ట్రాల్లోని యాదవులంతా ఆగ్రహించారు. మీడియా అత్యుత్సాహం చూపకపోతే అసలు వారందరికీ అది తెలిసేది కూడా కాదు!  మీడియా చెప్పకపోతే చాగంటి వారి మాటలు యాదవులకి తెలిసేవి కావు. కాబట్టి మీడియా చేసింది తప్పు అనటం సబబు కాదు. ఒక కోణంలో చూస్తే చాగంటి వారి మాట యాదవుల్ని కించపరిచేదే. కాని, దాని వెనుక ఆయన ఉద్దేశం వారి అమాయకత్వాన్ని, దేవుడు సైతం వారి ప్రేమకు లోంగాడని చెప్పటం అయినప్పుడు కాస్త అర్థం చేసుకోవాలి కదా? యాదవుల్ని దురుద్దేశంతో తిట్టిపోయటానికి చాగంటి వారు అలా మాట్లాడారా అన్నది మీడియా పట్టించుకోలేదు. పదే పదే చర్చలు పెట్టి యాదవుల అహం దెబ్బతీసింది. చాగంటి వారి చేత క్షమాపణలు చెప్పించింది. చాగంటి కోటేశ్వర్ రావు లాంటి పండితుడు వినమ్రంగా క్షమాపణ చెప్పటం ఆహ్వానించదగ్గదే. యాదవులు కూడా దీని వల్ల శాంతించారు. కాని, ఇప్పుడు అంతా ఆలోచించుకోవాల్సింది ఒక్కటే... ఏ ఆర్దిక లాభమూ ఆశించకుండా ప్రవచనాలు చెప్పే చాగంటి వారు అనుకోకుండా నోరు జారటం ప్రమాదమా? కావాలని ఉద్దేశ్యపూర్వకంగా వివిధ కులాల్ని కించపరిచే రకరకాల సినిమాలు ప్రమాదమా? మన సినిమాల్లో యాదవుల్ని ఏ విధంగా చీత్రకరిస్తారో ప్రత్యేకంగా చెప్పాలా? బ్రాహ్మణుల మొదలు జవాన్ల దాకా మన సినిమాల్లో ఏ వర్గాన్నీ వదిలి పెడుతున్నారనీ? అందర్నీ రకరకాలుగా అవమానిస్తూనే వున్నారు. పైగా కోట్ల రూపాయల కలెక్షన్లు కొల్లగొడుతున్నారు. కొన్ని టీవీ షోల్లోనూ కామెడీ పేరుతో వివిధ వృత్తుల వార్ని ఎంతగా కించపరుస్తున్నారో మీడియాకి తెలియదా?  నిజంగా వివిధ కులాల్ని అవమానించే వ్యాపార ముఠాలకి ఛానల్సు , పేపర్సు వంత పాడుతూ , వాటితో కలిసి తమ వ్యాపార లాభాలు సంపాదించుకుంటూ ... చాగంటి లాంటి సౌమ్యుడైన ఒంటరి ప్రవచనకారుడిపై ప్రతాపం చూపటం... మీడియానే తన మనః సాక్షితో పరీక్ష చేసుకోవాల్సిన విషయం...   

అభిమన్యులెవరో అంతుపట్టని...ఉత్తర్ ప్రదేశ్ పద్మవ్యూహం! 

ఉత్తర్ ప్రదేశ్...దేశంలోని చాలా రాష్ట్రాల మాదిరిగా ఇది కూడా ఒకటి అనుకుంటే పొరపాటే!ఉత్తర్ ప్రదేశ్ లోని కాశీకి భారతీయులంతా జీవితంలో ఒక్కసారైనా వెళ్లి రావాలనుకుంటారు.అలాగే,దేశంలోని జాతీయ రాజకీయ నేతలంతా ఉత్తర్ ప్రదేశ్ ని తమ పొలిటికల్ కాశీగా భావిస్తారు.అక్కడి జనాల ఆశీస్సులు పొందితే ఢిల్లీ చేజిక్కినట్టే అనుకుంటారు.నిజానికి కాంగ్రెస్ దశాబ్దాల పాటూ హస్తినాపురాన్ని హస్తగతం చేసుకుంది ఉత్తర్ ప్రదేశ్ ఉత్తమ ఫలితాలతోనే!కాని,ఇప్పుడు అదే ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఉత్తపార్టీగా మారిపోయింది.ప్రాంతీయ పార్టీ అయిన సమాజ్ వాది అనుగ్రహం కోసం నానా తంటాలు పడుతోంది... లక్నోలో తమ లక్ తేల్చుకునేందుకు అనేక పార్టీలు ఎన్నికల బరిలో దిగుతున్నాయి.అందులో ముఖ్యమైనవి ఎస్పీ,బీఎస్పీ,కాంగ్రెస్,బీజేపి.ఈ నాలుగు పార్టీలు గతంలో యూపీని ఏలినవే.గాంధీ,నెహ్రుల పుణ్యామాని కాంగ్రెస్ చాలా కాలం అధికారం వెలగబెడితే బీజేపి రాముల వారి చలువతో రాజ్యం చేసింది.కాని,తరువాత చాలా కాలంగా ఒకవైపు నుంచి ఏనుగు,మరో వైపు నుంచి సైకిల్ హస్తాన్ని,కమలాన్ని సెక్రటేరియల్ వైపుకి రానీయటం లేదు.ఈసారన్నా ఆ ట్రెండ్ మారుద్దామని జాతీయ పార్టీలు తీవ్రంగా ఆరాటపడుతున్నాయి... ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపి కన్నా కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా వుంది.ఒకప్పుడు వందల మంది ఎమ్మేలతో కళకళలాడిన ఆ పార్టీ ఇప్పుడు పాతిక మంది కూడా లేని స్థితిలో వుంది.మరో వైపు బీజేపి గత పార్లమెంట్ ఎన్నికల్లో డెబ్బైకి పైగా ఎంపీ సీట్లు గెలిచి కొత్త ఆశలతో చిగురిస్తోంది.అయితే,ఎలాగైనా యూపీలో అధికార టోపీ పెట్టుకోవాలనుకున్న రాహుల్ ప్రశాంత్ కిషోర్ లాంటి చాణుక్యుడ్ని పక్కన పెట్టుకొని నానా హంగామా చేశాడు.అయినా మంచాలు వేసి మీటింగ్ లు పెట్టిన ఆ ప్లానంతా మంచం పట్టిన కాంగ్రెస్ ని లేపి నిలపలేకపోయింది.ఇక ఎన్నికలు పూర్తిగా దగ్గరకి వచ్చేయటంతో అఖిలేషే దిక్కనుకుని పొత్తుకు సిద్ధమైంది.కాని,పరిస్థితి చూస్తుంటూ అఖిలేష్ తన సైకిల్ పై రాహుల్ ని ఎక్కనిచ్చేలా లేడు! రెండుగా చీలిపోయిన సమాజ్ వాది పార్టీలోని అఖిలేష్ బ్యాచ్ తో చేతులు కలిపిన కాంగ్రెస్,రాష్ట్రీయ లోక్ దల్ లాంటి పార్టీలతో కలిపి మహాకూటమి ఏర్పడుతుందని ఆశపడింది.బీహార్లో మాదిరిగా ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపిని నేలకూల్చాలని కలలు కన్నది.కాని,ఏమైందో ఏమో కాని జాట్ లలో మంచి ఫాలోయింగ్ వున్న అజిత్ సింగ్ తన పార్టీ ఆర్ఎల్డీ కూటమి నుంచి ఔట్ అనేశాడు.ఇక చెప్పాపెట్టకుండా అఖిలేష్ తన రెండు వందల మంది అభ్యర్థుల జాబితా ప్రకటించేశాడు.ఎస్పీ అభ్యర్థుల్ని ప్రటించిన నియోజకవర్గాల్లో అమేథీ,రాయబరేలి కూడా వున్నాయి.ఇవ్వి కాంగ్రెస్ కు పెట్టని కోటలు.అక్కడున్న ఎమ్మేల్యే స్థానాల్లో కూడా తన అభ్యర్థుల్ని ప్రకటించిన అఖిలేష్ కాంగ్రెస్ ను పొమ్మన లేక పొగబెడుతున్నట్టే వుంది! యూపీలో పొలిటికల్ సీన్ చూస్తుంటే...మైనస్ మార్కులు తెచ్చిపెట్టే తప్పుడు యాన్సర్ లాంటి కాంగ్రెస్ ను ఎవ్వరూ కోరుకుంటున్నట్టు లేదు.ఆల్రెడీ మాయావతి తనది ఒంటరి పోరని చెప్పేయటం,అఖిలేష్ కూడా అదే పద్దతిలో ముందుకు పోతుండటం కాంగ్రెస్ ను ఒంటరిని చేసేస్తోంది.అటు బీజేపి మోదీ ఛరిష్మాని,అమిత్ షా వ్యూహాల్ని నమ్ముకుని రంగంలోకి దిగుతుంది.మొత్తం మీద కాంగ్రెస్,బీజేపి,బీఎస్పీ,ఎస్పీల చతుర్ముఖ పోరు తప్పేలా లేదు! మన హైద్రాబాద్ నుంచి బయలుదేరిన ఎంఐఎం కూడా యూపీలో కొన్ని ఓట్లు చీల్చే పనిలో పడింది.ఇలా చిన్నా చితకా పార్టీలు,పెద్ద పార్టీలు ఎన్ని ఎక్కువైతే బీజేపికి, బీఎస్పీకి అంత మంచిదంటున్నారు విశ్లేషకులు.ఆ రెండు పార్టీల్లో ఏదో ఒకటి మెజార్టీ సంపాదించటమో,లేక పోత్తుతో ప్రభుత్వం ఏర్పాటు చేయటమో జరుగుతుందంటున్నారు!ఈ విషయం అఖిలేష్ కి,రాహుల్,ప్రియాం,సోనియా గాంధీలకి తెలియదనుకోలేం...   

హిల్లరీని అల్లరి చేసిన ట్రంప్స్ వైఫ్ అండ్ డాటర్స్!

ఆమె వేసుకున్న లాంటి డ్రస్సే వాళ్లిద్దరూ కూడా వేసుకొచ్చారు.అంతే కాదు,ఆమె తనకి పోటీగా భావించే మరొకావిడ కూడా అదిరిపోయే డ్రస్ వేసుకొచ్చింది.దాంతో ఆమె ముఖం వాడిపోయింది.కార్యక్రమం జరుగుతోన్నంత సేపూ ఇబ్బందిగానే గడిపింది.మొత్తానికి తాను స్పెషల్ అట్రాక్షన్ అవ్వకుండా పోయిన ఆమె డీప్ గా డిసపాయింట్ అయింది!ఏంటిదంతా అంటారా?ఇంతకీ ఆమెవరు అంటారా?ఆమె మామూలు వ్యక్తి కాదు!అందుకే,ఇంత డిస్కషన్! సాధారణంగా స్త్రీలు తమ డ్రస్సింగ్ విషయంలో కొంచెం సీరియస్ గానే వుంటారు.ఏదైనా ఫంక్షన్ కు వచ్చినప్పుడు మగవాళ్లు కూడా అందంగా వుండాలనే ట్రై చేస్తారు కాని ఆడవాళ్లు అందుకోసం ఎంతైనా శ్రమిస్తారు.పైగా...తీరా తాము ది బెస్ట్ రెడీ అయి వచ్చాక కార్యక్రమంలో మరో అందగత్తె కూడా సేమ్ డ్రస్ వేసుకొస్తే?ఇక అంతే సంగతులు!సునామీ మీద పడ్డట్టు విలవిలలాడిపోతారు.ఇందుకు నార్మల్ లేడీసే కాదు అమెరికా ఫస్ట్ లేడీ ప్రెసిడెంట్ అవ్వలేకపోయిన హిల్లరీ కూడా అతీతం కాదు.ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన ఆమె ఇబ్బందిని చూస్తే ఎవ్వరైనా ఒప్పుకుంటారు! ఒకప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ భార్య,మొన్నటి ఎన్నికల్లో ట్రంప్ తో పోటీ పడి ఓడిన హిల్లరీ ఇంక ఎదురు దెబ్బలు ఎదుర్కొంటూనే వుంది.పాపం ఆమె ఎలాగో మనసుకు నచ్చజెప్పుకుని ట్రంప్ ప్రమాణస్వీకారానికి తరలి వస్తే అక్కడ డ్రస్సింగ్ తిప్పలు తప్పలేదట.వైట్ సూట్ లో వచ్చిన ఆమె ఎప్పటిలాగే గంభీరంగా, గార్జియస్ గా వున్నప్పటికీ...డొనాల్డ్ ట్రంప్ కూతుళ్లు కూడా అదే రకం,అదే రంగు బట్టలు వేసుకొచ్చారట.దాంతో హిల్లరీ ముఖం వాడిపోయింది.అంతలో మరో షాక్ లాగా ట్రంప్ భార్య అదరిపోయే బ్లూ డ్రస్ లో ప్రత్యక్షమైంది!ఒకప్పటి ఫస్ట్ లేడీ అయిన హిల్లరీ ఆమె డ్రస్సింగ్ ముందు తేలిపోయిందట!పైగా ఎన్నికల వరకూ తనకు డ్రస్ డిజైనింగ్ చేసిన ఫ్యాషన్ డిజైనరే ఇప్పుడు ట్రంప్ భార్యకి సేవలందిస్తోందట!ఇవన్నీ కలిసి హిల్లరీని తెగ ఇబ్బందిపెట్టాయంటున్నారు... ఒకేలాంటి డ్రస్సింగ్ తో ఎదురుపడితే సినిమా హీరోయిన్స్ నానా విధాలుగా టెన్షన్ పడిపోతుంటారు.మీడియా కెమెరాలు తమని సేమ్ టూ సేమ్ డ్రస్ లో ఎక్కడ బంధిస్తాయోనని తెగ ఇదై పోతుంటారు.అలాంటి పరిస్థితే అంతర్జాతీయ స్థాయి రాజకీయ నాయకురాలైన హిల్లరీకి వచ్చిందంటే నమ్మటం కష్టమే!కాని,ఎంత అమెరికన్ ప్రెసిడెంట్ కాబోయి అవ్వలేకపోయిన లీడర్ అయినా ఆమె కూడా స్త్రీయే కదా...మీడియా పని మీడియా చేసుకుపోతుంది.అదే అసలు తలనొప్పి!  

ఓవైసీగారి.. ఓవర్ యాక్షన్!

  మోకాలికి , బోడి గుండుకి లంకె పెట్టడం ఎవరి నుంచి నేర్చుకోవాలి? మన రాజకీయ నాయకుల దగ్గర నుంచి! మరీ ముఖ్యంగా, హైద్రాబాద్ మోధుడు అసదుద్దీన్ ఓవైసీ నుంచీ! ఫారిన్ వెళ్లి లా చదువుకుని వచ్చిన ఈ బారిష్టరుగారు ఎప్పుడూ లౌకికవాదమే మాట్లాడుతుంటారు. అందుకు తగ్గట్టే బీజేపి నేతల్ని మతతత్వవాదులని తెగ తిట్టిపోసే కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇతర ప్రాంతీయ పార్టీల వారు కూడా ఈ ఆలిండియా ముస్లిమ్ నేతని మాత్రం సెక్యులర్ గానే లెక్కేసుకుంటారు! పల్లెత్తు మాటనరు! అందుకే, ఈయన అప్పుడప్పుడూ కాంట్రవర్సియల్ స్టేట్మెంట్లు చేస్తూ అందర్నీ అలరిస్తుంటారు. తాజాగా అలాంటిదే ఓ ట్వీట్ చేశారు అసద్ భాయ్...   తన తమ్ముడు, మహా శాంత మూర్తి, అక్బరుద్దీన్ ఆ మధ్య దారుణమైన కామెంట్స్ చేశాడు. దానిపై ఇంత వరకూ ఖండన లేదు గౌరవ ఎంపీ అసదుద్దీన్ వద్ద నుంచి. పదిహేను నిమిషాలు పోలీసులు పక్కకి జరిగితే హిందువులకి తమ తడాఖా చూపిస్తామని ముస్లిమ్ యూత్ ని అక్బర్ మహాశయుడు రెచ్చగొట్టాడు. అందుకు జైలుకి కూడా వెళ్లాడు. అయినా అది కోర్టులో కొనసాగుతున్న వ్యవహారం కాబట్టి తాను ఏం మాట్లాడనని తప్పించుకుంటాడు అన్న అసదుద్దీన్ ఓవైసీ. తమ్ముడి తప్పు ఖండించటానికి కూడా నాలుక రాని ఈయన కోర్టుని అడ్డు పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నాడు కాని... అదే కోర్టు రేపు యూనిఫామ్ సివిల్ కోడ్ పై ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఒప్పుకుంటే సీన్ లేదన్నట్టు మాట్లాడుతున్నాడు!సుప్రీమ్ కోర్టులో యూనిఫామ్ సివిల్ కోడ్ పై విచారణ జరుగుతోంది.   కొన్ని ప్రశ్నలకి జవాబులు ఇవ్వాలని వివిధ పక్షాల్ని, ప్రభుత్వాన్ని కోరింది కోర్టు. అందుకు ఆలిండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డ్ అంగీకరించలేదు. కోర్టు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వమని తేల్చేసింది. తమకు ప్రత్యేక పర్సనల్ లా బోర్డ్ వుండాల్సిందేనని పట్టుబడుతోంది. చట్టం ముందు అందరూ సమానమే అని ముస్లిమ్ పెద్దలు అంగీకరించటం లేదు. ఇక ఓవైసీగారిది కూడా అదేమాట. కాకపోతే, తన పార్టీ ఎంఐఎం తరుఫున మాత్రం కోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాడట. కాని, అదే కోర్టు యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయాలని ఆదేశిస్తే మాత్రం ఏమవుతుందో తెలుసా? తన ట్విట్టర్ అకౌంట్లో సెలవిచ్చారు ఓవైసీ! జల్లికట్టు విషయంలో జనం ఎలా స్పందించారో అలాగే అవుతుందట! అయితే, తన ట్వీట్లో మనోడు కోర్టును కాకుండా తెలివిగా హిందూత్వవాదుల్ని టార్గెట్ చేశాడు. జల్లికట్టు నిరసనలు హిందూత్వవాదులకి హెచ్చరికనట! యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తే కూడా అంతే అన్నట్టు వారెంట్ ఇచ్చాడు!   తమ్ముడు అక్బరుద్దీన్ వ్యాఖ్యల విషయంలో కోర్టులో కేసు నడుస్తోందని చెప్పే అసదుద్దీన్ అదే కోర్టు యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయమంటే మాత్రం ఒప్పుకోననటం మన నేతల తెలివితేటలకి నిదర్శనం. తమకు అనుకూలమైన అంశాల్లో కోర్టు, వ్యతిరేక అంశాల్లో జనం సెంటిమెంటు... ఇదీ వరస!

కాందీశీకులు కారు వాళ్లు... కాశ్మీరీ పండిట్లు...

  ఈ మధ్య సిరియా శరణార్థుల గురించి మీరు చాలానే విని వుంటారు! మీరు ఇంకా శ్రద్ధగా అంతర్జాతీయ వార్తలు వినేవారైతే సిరియా శరణార్థులకి సంబంధించిన ఒక పసి బడ్డ భూమిలో కూరుకుపోయిన దయనీయ దృశ్యం కూడా చూసే వుంటారు! అంతే కాదు, మన భారతీయ మీడియా గాజా మృతుల గురించి, ఆఫ్రికా అంతర్యుద్ధాలకి బలైపోయిన వారి గురించి, వివిధ ఉగ్రవాద సంస్థల దాష్టీకానికి చనిపోయిన వారి గురించీ వీలైనంత చూపిస్తుంది. చెబుతుంది. కాని, జనవరి 19న 1990వ సంవత్సరంలో మన దేశంలోనే మన దేశం వారే శరణార్థులుగా మారారు! అప్పట్నుంచీ వారు మన దేశంలోనే చలికి వణుకుతూ, ఎండకి మాడుతూ, వర్షానికి తడుస్తూ టెంట్లలో వుంటున్నారు! వాళ్లే కాశ్మీరీ పండిట్లు...   కాశ్మీరీ పండిట్లు అనగానే చాలా మందికి అయ్యో పాపం అనిపిస్తుంది. కాని, నిజంగా వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయరు. మీడియాలోనూ చెప్పేవారు తక్కువ. మైనార్టీల కోసం, దళితుల కోసం తాపత్రయపడ్డంతగా ఈ కాశ్మీరీ పండిట్ల కోసం మన మేధావులు, జర్నలిస్టులు, ఉద్యమకారులు అల్లాడినట్టు కనిపించదు. ఇక కొందరు ఇంగ్లీష్ ఉదారవాద జర్నలిస్టులైతే కాశ్మీరి పండిట్లు 1990ల కన్నా ముందు స్థానిక ముస్లిమ్ లతో సరిగ్గా కలవలేదని అంటుంటారు. బాగా డబ్బు, ఆస్తులు సంపాదించుకుని వివక్ష కొనసాగించే వారంటారు. అందుకే, వారిపై ఉగ్రవాదులు దాడులు చేస్తుంటే ఎవ్వరూ రక్షణకు రాలేదని చెప్పుకొస్తారు. ఇది దారుణమైన కోణం. కాశ్మీరి పండిట్లు వివక్ష చూపినా , చూపికపోయినా వార్ని మాతృభూమి నుంచి బలవంతంగా వెళ్లగొట్టడం అమానుషం. దాన్ని గత పాతికేళ్లలో గట్టిగా వ్యతిరేకించిన వారెవ్వరూ లేరు. 2002  గోద్రా అల్లర్ల విషయంలో చూపినంత బాధా, ఆక్రోశం 1990నాటి కాశ్మీరీ పండిట్ల కోసం కానరాదు. అదే వారి దయనీయ స్థితి సామాన్య భారతీయులకి తెలియకుండా వుండిపోవటానికి కారణం...   కాశ్మీర్ లోయలో పండిట్లు మైనార్టీలు. అక్కడ మెజార్టీ వర్గం ముస్లిమ్ లు. వాళ్లలో కొందరి నిశ్శబ్ధ మద్దతుతో పాకిస్తాన్ ప్రేరేపిత హింసాత్మక ఉగ్రవాద మూకలు 1980లలో చొరబడ్డాయి. అవ్వి బరితెగించి, అప్పటి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల చేతకానితనం వల్ల 90వ సంవత్సరంలో అరాచకానికి తెర తీశాయి. ఉగ్రవాదులు మసీదు మైకుల్లోంచి కాశ్మీరీ పండిట్లను ఇళ్లు వదిలి వెళ్లిపొమ్మని హుకం జారీ చేశారు. వెళ్లిపోయి జమ్మూ, ఢిల్లీ వీధుల్లోకి వచ్చిన వారు స్వంత దేశంలో ఇప్పటికీ శరణార్థులుగా వున్నారు. మిగతా వారు కాశ్మీరు లోయలోనే హత్యలకి, మానభంగాలకి బలయ్యారు. ప్రభుత్వాలు అధికారికంగా 200మంది మాత్రమే చనిపోయారని చెబుతున్నా వేల మంది అసువులు బాసారు. అయినా ఒక్కడంటే ఒక్కడికీ ఇప్పటి వరకూ శిక్ష పడలేదు! కాశ్మీరీ పండిట్లు మాత్రం కాశ్మీర్ లోయలో హిందువులుగా, మైనార్టీలుగా పుట్టినందుకు ఇప్పటికీ శిక్ష అనుభవిస్తున్నారు!   కాంగ్రెస్, ఇతర లౌకిక వాద పార్టీలు కాశ్మీరీ పండిట్ల కోసం మాట్లాడకపోవటం సహజమే! వారి ముస్లిమ్ ఓటు బ్యాంకు కోసం వారు  మౌనమే మార్గంగా ఎంచుకున్నారు. ఇక మాట్లాడే బీజేపి, శివసేన లాంటి పార్టీలు కూడా ఇప్పటి వరకూ కాశ్మీరీ పండిట్లకు మేలు చేసిన దాఖలాలు ఏమీ లేవు. వాజ్ పేయి హయాంలో, ఇప్పుడు మోదీ పాలనలో ఎప్పుడూ పండిట్లకు ఒదిగిందేం లేదు. ఇందుకు కారణం పూర్తిగా కేంద్రం నిర్లక్ష్యమనే చెప్పలేం. కాశ్మీర్ లోని ముస్లిమ్ నేతల సారథ్యంలో నడుస్తోన్న ప్రాంతీయ పార్టీలు కూడా పండిట్ల దుర్భర జీవితాలకి కారణం. పైకి వార్ని తిరిగి కాశ్మీర్ కి రమ్మని చెబుతున్నా వాళ్ల ప్రాణ, మాన, ఆస్తులకి ఎలాంటి భరోసా ఇవ్వకుండా మోసపూరితంగా వ్యవహరిస్తుంటాయి. ఈ విషయంలో ఎన్సీ, పీడీపీ అన్న భేదాలేం లేవు. పండిట్లకు అందరూ మూకుమ్ముడిగా వ్యతిరేకమే. దశాబ్దాలు గడిచిపోతున్నాసమస్య పరిష్కారం కాకపోవటానికి ఇదే ప్రధాన కారణం.   కాశ్మీరీ పండిట్లు అగ్రవర్ణం అని కొన్ని పార్టీలు మాట్లాడకపోవచ్చు. వారు హిందువులు కాబట్టి కొన్ని లౌకికవాద పార్టీలు మాట్లాడకపోవచ్చు. కాని, వారి దుస్థితి కేవలం వారికే ప్రమాదకరం కాదు. వాళ్లను వెళ్లగొట్టి తిరిగి రానీయకుండా వుంచగలుగుతున్న ఉగ్రవాదులు, వారి కాశ్మీరి మద్దతుదారులు ఏనాటికైనా యావత్ కాశ్మీర్ నే కబళించగలరు. అందుకోసమైనా భారత ప్రభుత్వం కాశ్మీరీ పండిట్లను వారి మాతృ భూమిలో తిరిగి స్థిరపరచాలి. అప్పుడే కాశ్మీర్ పై మన పట్టు సడలకుండా వుంటుంది. లేకపోతే ఇవాళ్ల కాశ్మీర్ కాశ్మీరీ పండిట్లకు కాకుండా పోయినట్టే మొత్తం దేశానికీ కాకుండా పోతుంది. పాకిస్తాన్ చేతుల్లో చిక్కుకుపోతుంది...

తండ్రి రాజ్ కపూర్ నుంచి డాన్ దావూద్ దాకా అందర్నీ 'బుక్' చేసేశాడు!

  రాజకీయాల్లో సినిమా వాళ్లు వుంటారు. ఇది అందరికీ తెలిసిందే. కాని, సినిమాల్లోనూ రాజకీయం వుంటుంది. ఇది చాలా మందికి పెద్దగా తెలియదు. తెలిసిన మనం అంతగా పట్టించుకోం. తెరపైన కనిపించే సినిమానే ఎంజాయ్ చేస్తాం కాని తెర వెనుక జరిగే సినిమా వారి రాజకీయాలు, రాసలీలలు మనకు అంతగా ఇంట్రస్ట్ అనిపించవు. అప్పుడప్పుడూ ఎఫైర్లపై జనం ఆసక్తి చూపినా అందులో నిజానిజాలు మనకు తెలిసే ఛాన్స్ వుండదు. పత్రికల్లో, ఛానల్స్ వచ్చేదంతా నిజమనటానికి ప్రూఫ్స్ వుండవు. కాని, ఇప్పుడు బాలీవుడ్లో సంచలనం సృష్టిస్తోన్న ఒక బుక్ సినిమా రంగం, సినిమా సెలబ్రిటీల గురించి బోలెడు ఆసక్తికర విషయాలు చెబుతోంది. పైగా దీన్ని ఎవరో అనమకుడు రాయలేదు. స్వయంగా బాలీవుడ్ షో మ్యాన్ రాజ్ కపూర్ కొడుకు రిషీ కపూర్ కుండ బద్ధలు కొట్టాడు!   సాధారణంగా ఆత్మకథలు అందరూ రాస్తూ వుంటారు. రిషీ కపూర్ రాసింది అలాంటిది కాదు. ఆ విషయం తెలియాలంటే మనం ఆయన రాసిన ఆటోబయోగ్రఫికి పెట్టిన పేరు తెలుసుకోవాలి! 'ఖుల్లమ్ ఖుల్లా : రిషీ కపూర్ అన్ సెన్సార్డ్' ... ఇదీ పుస్తకం పేరు! అందుకు తగ్గట్టుగానే సాధారణంగానే సినిమా సెలబ్రిటీలు సాహించని సత్యాలు చెప్పేశాడు ఈ బాబీ మూవీ సూపర్ స్టార్!   ఎప్పుడూ సినిమా రంగంలో అంతా మాట్లాడుకునే మాట... అవార్డ్ లు కొనటం! తన బాబీ సినిమా విడుదలైన సంవత్సరం తాను అవార్డ్ కొన్నానని రిషీ నిర్ద్వంద్వంగా చెప్పేశాడు. ఒక సినిమా పత్రిక ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డ్ అంటూ క్లూ కూడా ఇచ్చిన ఆయన తాను అది కొనేశానని చెప్పాడు. అందువల్ల అదే సంవత్సరం జంజీర్ సినిమాకి తనకు రావాల్సిన అవార్డ్ రిషీకి పోయిందని అమితాబ్ బాధ పడ్డాడట కూడా! ఈ రివిలీషన్ తో రిషీ కపూర్ సినిమా రంగంలో అవార్డ్ లు కొనుక్కోవటం నిజమేనని నిరూపించేశాడు!   రిషీ తనకు పడని వారి గురించి నిజాలు చెప్పి సంచలనం సృష్టించలేదు. తన బుక్ లో తన తండ్రినే బుక్ చేసేశాడు! రాజ్ కపూర్ అతడి హీరోయిన్స్ తో సరసాలు బాగానే సాగించే వాడని అందిరకీ తెలుసు. కాని, ఇప్పటి వరకూ అందుకు కన్ ఫర్మేషన్ లేదు. రాజ్ కపూర్ ఎప్పుడూ ఓపెన్ గా చెప్పలేదు. అతడి హీరోయిన్స్ కూడా అప్పటి కాలంలో ఎప్పుడూ యెస్ అనలేదు. నో అనలేదు. కాని, తన ఆత్మకథలో తండ్రి గురించి హాట్ గానే రాశాడు రిషీ కపూర్. రాజ్ కపూర్ నర్గీస్ దత్ తోని, వైజయంతీమాలాతోని రిలేషన్లో వున్నాడని సుస్పష్టం చేసేశాడు!   తండ్రి గురించి చెప్పిన రిషీ కపూర్ తన గురించి కూడా క్లియర్ గానే చెప్పాడు. తనకు ప్రఖ్యాత బాలీవుడ్ రచయిత జావేద్ అఖ్తర్ తో పడదని చెప్పుకొచ్చాడు. అలాగే, రాజేష్ ఖన్నా తన తండ్రి రాజ్ కపూర్ సినిమాలో నటించాలని ఎంత ట్రై చేసినా తాను అది వీలు కాకుండా రాజకీయం చేశానని వివరించాడు. ఇక ఫైనల్ గా దుబాయ్ లో తాను దావూద్ తో టీ తాగనని కుండ బద్ధలు కొట్టి ఆటోబయోగ్రఫికే కొత్త క్రేజ్ తీసుకొచ్చాడు. సాధారణంగా బాలీవుడ్ స్టార్స్, పొలిటీషన్స్ దావూద్ తో తాము ఫోన్ లో మాట్లాడమనే ఒప్పుకోరు. అటువంటిది రిషీ కపూర్ దుబాయ్ లో టీ తాగనని, మరోసారి దావూద్ ను ఓ ఫారిన్ కంట్రీలో షాపింగ్ చేస్తూ కలుసుకున్నానని చెప్పాడు!   ఆత్మకథ పేరుతో ఏ పసలేని కథనాలు ఒక చోట పోగేసే వారి కన్నా రిషీ కపూర్ బెటర్ అనే చెప్పాలి. ఆయన బుక్ ఖుల్లమ్ ఖుల్లా ఖచ్చితంగా చదవాల్సిన గ్రంథమే. బాలీవుడ్ మీద ఇంట్రస్ట్ వున్న వారైతే అస్సలు మిస్ అవ్వకూడదు!

జల్లికట్టు మొండిపట్టు...

ఒకప్పుడు ఆపరేషన్స్  చేస్తే మత్తు మందు ఇచ్చేవారు. కాని, ఇప్పుడు శరీరం మొత్తానికి కాకుండా ఎక్కడైతే సర్జరీ అవసరమో అక్కడే మత్తు ఇస్తున్నారు. అయితే, దేశంలోని కొన్ని అభ్యుదయవాద సంస్థలు అదే పద్ధతి ఫాలో అవుతున్నాయి. కొన్ని అంశాల్లో ఉత్సాహంగా ఉద్యమాలు, నిరసనలు కొనసాగించే సదరు సంస్థలు మరి కొన్ని అంశాల్లో మాత్రం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తుంటాయి. తమకు ఇబ్బంది కలిగే చోట మత్తు మందు తీసుకున్నట్టు నిద్ర నటిస్తూ అభ్యుదయవాదం పక్కన పెట్టేస్తాయి. మిగతా చోట్ల మాత్రం అల్లరల్లరి చేసేస్తుంటాయి! జంతు ప్రేమికుల సంస్థ పెటానే ఇందుకు మంచి ఉదాహరణ!   ప్రపంచ వ్యాప్తంగా జంతువులపై జరిగే హింసని వ్యతిరేకించే పెటా అసలు వదిలి కొసరు పట్టుకునే వేలాడుతుంటుంది ఎప్పుడు. చక్కగా కార్పోరేట్ బిల్డప్ ఉట్టిపడేలా హీరోయిన్లతో హాట్ ఫోటోషూట్లు చేస్తూ హల్ చల్ చేస్తుంటుంది. మిగతా సమయాల్లో ఈ పెటా ఎక్కడా పెట్రేగిపోయినట్టు కనిపించదు. పెద్ద ఎత్తున జంతువుల్ని హింస నుంచి కాపాడిన వార్తలు కూడా పెద్దగా ఏం కనిపించవు. ఇక హిందువులు పవిత్రంగా భావించే గోవులు, మన రాజ్యాంగం తప్పక కాపాడబడాలని చెప్పినప్పటికీ కబేళాల్లో బలైపోతుంటాయి. వాటిని కూడా ఒక్కసారి ఈ పెటా వారు గుర్తించిన పాపాన పోరు.   పెటా, దాని లాంటి బోలెడు అంతర్జాతీయ సంస్థలు, చిన్నా, చితక ఎన్జీవోలు ఈ మధ్య రకరకాల ఉద్యమాల పేరుతో నానా హంగామా చేస్తున్నాయి. ఉదాహరణకి, ప్రతీ రోజూ బిర్యానీల కోసం జరిగే కోళ్ల వధ గురించి పట్టించుకోని సంస్థలు, ఉద్యమకారులు సంవత్సరానికి ఒకసారి జరిగే కోళ్ల పందాలపై మాత్రం దృష్టి పెడుతుంటారు. ఒక్క సంక్రాంతికే కాదు దాదాపుగా ఇండియాలో జరిగే ప్రతీ పండుగకి వీళ్లు ఏదో ఒక అభ్యంతరంతో బయలుదేరుతుంటారు. అయితే, కోర్టులకి వెళ్లటమో, లేదంటే ప్రచారాలతో జనాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేయటమో చేస్తుంటారు. ఒకవైపు భారీ పరిశ్రమలు భూమి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంటే దీపావళి వాయు కాలుష్యం గురించి గోల చేయటం ఇలాంటిదే.   ఇక్కడే పెటా లాంటి సంస్థలు తెలివిగా తప్పించుకునే మరో అంశం వుంది. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిమ్ జనాభాకి కోపం తెప్పించే ఉద్యమాలు, ప్రచారాలు వీరు అస్సలు చేయరు. మొహర్రం నాడు రక్తం చిందించ వద్దనో, బక్రీద్ నాడు జంతు హింస వద్దనో వీళ్లు పిలుపునివ్వరు. నిజానికి అది వారి మత విశ్వాసం. దాని గురించి మార్పు జరగాలంటే వారే నిర్ణయించుకోవాలి. కాని, ఇక్కడ సమస్య అభ్యుదయవాదం పేరుతో మన దేశంలో కొన్ని మతాలు, కొన్ని వర్గాల్నే టార్గెట్ చేయటం. అదీ జల్లికట్టు లాంటి పెద్దగా ప్రాణహాని లేని సంప్రదాయ క్రీడల్ని కూడా నిషేధింపజేయటం!   జల్లికట్టు విషయంలో పెటా వేసిన కేసు వల్లే నిషేధం వచ్చిపడిందని తమిళ ప్రజలు భావిస్తున్నారు. వారి కోపంలో అర్థం వుంది కూడా. అంతర్జాతీయంగా విస్తరించిన పెటా సంస్థ స్పెయిన్ లో జరిగే బుల్ ఫైట్ నిషేధించమని డిమాండ్ చేస్తుందా? అక్కడ జరిగేది జంతు హింస కాదా? కేవలం భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాత్రమే ఇలాంటి హడావిడి చేయటం న్యాయమా? ఇలాంటి అనేక ప్రశ్నలకు అభ్యుదయ సంఘాల వద్ద సమాధనం లేదు. పైగా కొన్ని సందర్భాల్లో కోర్టులు కూడా వీరికి అనుకూలంగా తీర్పులు ఇవ్వటంతో పరిస్థితి మరింత జటిలంగా మారుతోంది. జనం అసహనంతో రోడ్లపైకి రావాల్సి వస్తోంది. సంప్రదాయం, సంస్కృతి, మతం వంటి విషయాల్లో పెటా లాంటి సంస్థల జోక్యాన్ని ప్రభుత్వాలు అరికట్టాలి. మీడియా కూడా హఠాత్తుగా పైకి లేచే ఉద్యమాలకి వెనుకా ముందు ఆలోచించుకుని సామాజిక బాధ్యతతో మద్దతు పలకాలి.   కేవలం టీఆర్పీల కోసం ఒకే మతం, ఒకే వర్గంపై అదే పనిగా బురదజల్లి మిగతా అందర్నీ మన్నించి వదిలేయటం సబబు కాదు. నిజంగా సమాజానికి చేటు చేసే ధోరణులు ఎక్కడైనా వుంటే జనం అర్థం చేసుకునేలా వాటి గురించి చెప్పాలిగాని ... తిట్టిపోసి, దబాయించి సంప్రదాయాన్ని మానివేయించటం అంత తేలిక కాదు. ప్రస్తుతం జల్లికట్టు విషయంలో తమిళ జనం మొండిపట్టుకి అదే కారణం. ప్రజల ఓపికకి కూడా హద్దులు వుంటాయి...

అసెంబ్లీలో సీట్లున్నాయి... ఆంధ్రాలో ఆఫీసు మాత్రం లేదు! 

కొందరు నేతలు ఏదైనా పని చేస్తే దాంట్లో గొప్ప అంతరార్థం వుంటుంది.అది మనకు అప్పటికప్పుడు అర్థం కాకపోవచ్చు కాని టైం వచ్చినప్పుడు అర్థమవుతుంది.వాజ్ పేయి,పీవీ నరసింహారావు లాంటి రాజకీయ నేతల్ని ఈ కోవలో జమకట్టవచ్చు.కాని, కొందరు నేతలు కొన్ని పనులు చేస్తుంటే మనకు ఏమీ అర్థం కాదు.ఎందుకంటే,నిజంగా కూడా అందులో పెద్దగా లాజిక్ వుండదు కాబట్టి!ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ వైఖరి అలాగే తయారైంది.ఆయన చేసే చాలా పనులు ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు.అలాగని వాటిల్లో పెద్దగా రాజకీయ చాణక్యం కూడా వుండదు... రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు ప్రాంతంలో వైసీపీకి మిగిలింది ఆంద్రా మాత్రమే.అక్కడ ఏకైక ప్రతిపక్షంగా నిలిచి భవిష్యత్ పై ఆశలు నిలుపుకుంది.కాని,వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ప్రవర్తన ఆ పార్టీలోని చాలా మంది నాయకులకి మింగుపడటం లేదు.అసలు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుదామని అనుకుంటున్నారా లేదా అనేది వాళ్లకిప్పుడు వస్తోన్న డౌట్!ఎందుకంటే,రాష్ట్ర విభజన జరిగిన ఇన్నాళ్లు అయిపోతున్నా వైసీపీ పూర్తి స్థాయిలో అమరావతికి చేరుకోలేదు.కనీసం పార్టీకి అక్కడ కార్యాలయం కూడా లేదు.ఇప్పటికీ జగన్ , ఆయన ఎమ్మెల్యేలు ఏదైనా మీడియా మీట్ పెట్టాలంటే హైద్రాబాదే దిక్కు.మరో వైపు టీడీపీ ఎప్పుడో గుంటూరులో కార్యాలయం ఏర్పాటు చేసింది.జాతీయ పార్టీలైన కాంగ్రెస్,బీజీపీ,కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఆంధ్రాలో మకాం చేసేశాయి.కాని,జనం ప్రధాన ప్రతిపక్షంగా పట్టం కట్టిన ఫ్యాను పార్టీకి మాత్రం ఇంకా గాలి అటు మళ్లటం లేదు! విభజన అనంతరం టీడీపీ ప్రభుత్వం ఇస్తామన్న భూమి కూడా వద్దని జగన్ తమకు కావాల్సిన చోట తామే ఆపీస్ కట్టుకుంటామని చెప్చుకొచ్చారు.అయినా ఇంత వరకూ అమరావతిలో వైసీపీ ఆఫీస్ ఏర్పాటు చేసిన దాఖలా లేదు.అంతా హైద్రాబాద్ నుంచే నడుస్తోంది.రాబోయే కాలంలో ముఖ్యమంత్రి అవ్వాలని కలలు కంటోన్న యువ నేత ఇలా రాజధానికి దూరంగా వుండిపోవటం ఏంటని అంతా వాపోతున్నారు.మరో రాష్ట్రపు రాజధానిలో ప్రశాంతంగా కూర్చుని రాజకీయాలు జరుపుతుంటే జనంలోకి ఎలాంటి సంకేతాలు వెళతాయోనని వైసీపీ సీనియర్లు తెగ టెన్షన్ పడుతున్నారు! పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ నుంచి ఆంధ్రకు తరలించకపోవటంలో జగన్ పెద్దగా రాజకీయ వ్యూహం అనుసరిస్తున్నారని కూడా భావించటానికి లేదు.రెండు చోట్లా ఆఫీసులు నడిపటం వేరు కాని... ఇంకా హైద్రాబాద్ నే పట్టుకుని వేలాడుతూ సీట్లిచ్చిన ఆంధ్రా జనాన్ని పట్టించుకోకపోవటం, ఎంతైనా డేంజరే!ఇప్పటికైనా జగన్ అమరావతి ట్రైన్ ఎక్కితే చాలా బెటర్...     

మృతి లేని స్మృతి!

  ఈ భౌతికమైన సృష్టిలో ఏకైక హీరో... మృత్యువు!మరణం అందర్నీ జయించేస్తుంది!దాని ముందు ఓడిపోని హీరోలు ఎవ్వరూ వుండరు.జీవితాంతం తమ తమ రంగాల్లో ఎన్నెన్నో విజయాలు సాధించినా చివరకు చావుతో మాత్రం ఓటమి అంగీకరించాల్సిందే.ఆ దిగ్భ్రాంతికర సత్యాన్ని విధి మరోసారి నిరూపించిన విషాదకర దినమే... ఈ రోజు!సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం ఇదే రోజున తెల్లవారుతుండగానే తెలుగు నేల నిలువునా కంపించింది.ఎవ్వరూ ఊహించని విధంగా తమ అభిమాన నటుడు,నేత ఎన్టీఆర్ మరణించారని జనం చెవుల్లో పడింది.ఆయన అభిమానులైతే శోక సముద్రంలో మునిగిపోయారు... తన జీవితంలో ఓటమిని ఏనాడూ అంగీకరించని నివురుగప్పిన నిప్పు అన్న ఎన్టీఆర్.ఆయన తన విజయాలు ఆరిపోయిన ప్రతీసారి భగ్గున మండుతూ పైకి లేచారు.ఆయన పట్టుదల,దీక్ష కలిగిన విశిష్ట వ్యక్తిత్వమే ఆయన విజయాల్ని పదే పదే రాజేసిన గాలి.కాని,ఎందుకో ఏమో రాజకీయాల్లో మాత్రం ఆ పంథా కొనసాగలేదు.పదే పదే పదవీ గండం పైపైకి వచ్చింది.ఆయన సహజ శైలిలో సవాళ్లని వెక్కిరించి,ధిక్కరించి నిలిచారు.కాని,అంతిమంగా మాత్రం వెండితెరపై వెలిగిపోయిన స్థాయిలో రాజకీయ రొచ్చులో స్థిరంగా నిలబడలేకపోయారు.బహుశా మేకప్ వేసుకుని సమ్మోహనకరంగా నటించటం తెలిసిన ఆయనకు మేకప్ లేకుండా నిజ జీవితంలో నటించటం తెలియకపోవటమే కారణమనుకుంటా... నందమూరి తారక రామారావు అంటే తెలుగు వారి తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రి.తెలుగు జాతి చరిత్రలో కొత్త శకానికి నాంది పలికిన మహానేత.ఏ ఢిల్లీ వీధుల్లో తెలుగు ఆత్మగౌరవం తాకట్టు పెట్టబడిందో... అదే ఢిల్లీలో ప్రధాన ప్రతిపక్షంగా తన ప్రాంతీయ పార్టీని నిలిపిన ఘునుడు.కాని,ఇవన్నీ నటరత్నగా ఆయన సంపాదించుకున్న అభిమానం ముందు దిగదుడుపే.రాజకీయ నేతగా కన్నా ఎన్టీఆర్ నటుడిగానే తెలుగు వారికి మహా ప్రీతి.పార్టీల పరంగా ఆయనను వ్యతిరేకించే రాజకీయ జనాలు వుంటారేమోగాని నటుడిగా ఆయనని కాదనే వెర్రితనం ఏ తెలుగు వాడూ చేయడు.రాముడైనా,కృష్ణుడైనా, తెనాలి రామకృష్ణుడైనా, శ్రీకృష్ణదేవరాయలైనా... అన్నీ మనకు అన్నగారే!అదే ఆయనను అసలు సిసలు అవతార పురుషుడ్ని చేసే విశేషం! మరణం అంటే భౌతికంగా అదృశ్యం అవ్వటమే అయితే ఎన్టీఆర్ 1996,జనవరి 18 నుంచి మన మధ్య లేనట్లే.కాని,ఆయన గురించి మాట్లాడకుండా ఇంతవరకూ ఎవరైనా తెలుగు సినిమా గురించి చర్చించగలిగారా?ఆయనని స్మరించకుండా ఎవరైనా తెలుగు జాతి రాజకీయాలు వర్ణించగలరా?అస్సలు సాధ్యం కాదు!ఇప్పుడే కాదు,ఇక ముందు కూడా వీలు కాదు.తెలుగు పదంలో ఎన్టీఆర్ అన్న శబ్దం అంతర్లీనంగా ధ్వనిస్తూనే వుంటుంది.అందుకే, మన నందమూరి తారకరాముడికి వర్ధంతి వుంటుందేమోగాని... మరణం మాత్రం వుండదు!  

మోడీ ఏమైనా మహాత్మా గాంధీ అనుకుంటున్నాడా?

కొన్ని నెలల క్రితం, తీవ్రమైన వ్యాఖ్యలు చేసి జైలు పాలైన పటేల్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్, 6  నెలలు రాష్ట్రం విడిచి పెడతాననే వాగ్ధానానికి కట్టుబడి, సరిగ్గా ఈ రోజే గుజరాత్ లో కాలు పెట్టాడు. వస్తూ వస్తూనే, మోడీ మరియు బీజేపీ గోవర్నమెంట్ మీద తీవ్ర విమర్శలు చేసాడు.   "రెండు లక్షల విలువైన సూట్ వేసే మోడీ ఏమైనా మహాత్మా గాంధీ అనుకుంటున్నాడా, ఖాదీ క్యాలెండరుల పైన తన ఫోటో వేయుంచుకుంటున్నాడు, తానేదో ఖాదీ కి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు. గత ఎన్నికల్లో పటేల్ వర్గం సహాయంతో బీజేపీ గుజరాత్ లో గెలిచింది, కానీ రిజర్వేషన్ల విషయం వచ్చేసరికి నిట్ట నిలువునా ముంచింది," అన్నాడు హార్దిక్.   ఈ సంవత్సరం చివర్లో మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో జరగనున్న ఎన్నికల్లో ఆ పార్టీ ని ఓటమి పాలు చేస్తాం అని సవాలు చేసాడు హార్దిక్. బీజేపీ కి వ్యతిరేకంగా వచ్చే ప్రతి పార్టీ ని కలుపుకుపోతాం అని చెప్పాడు. ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ హార్దిక్ పటేల్ కి మద్దతిస్తున్నారు. కేజ్రీవాల్ అయితే ఏకంగా హార్దిక్ ని దేశభక్తుడి గా ప్రశంసించాడు.

తెరపైకి జయలలిత కోడలు....శశికళకు నష్టమేనా..?

తమిళనాట రాజకీయాలు రోజు రోజుకి మరింత వేడిగా తయారవుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం రాజకీయాలు రోజుకో మలువు తిరుగుతున్నాయి. రోజుకొకరి పేరు బయటకు వస్తుంది. నిన్నటికి నిన్న సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే తాను అడ్డుకుంటానని శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు గాను రాష్ట్రంలో పలు చోట్ల రజనీకాంత్ అభిమానులు శరత్ కుమార్ కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమాన సంఘాలు డిమాండ్ చేశాయి. ఇప్పుడు మరో అంశం తెరపైకి వచ్చింది. అది జ‌య‌ల‌లిత మేన‌కోడ‌లు దీప రూపంలో. ఇప్పటికే దీప పలుసార్లు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు  త‌న రాజ‌కీయ అరంగేట్రంపై ప్ర‌క‌ట‌న చేయ‌నున్న నేపథ్యంలో మరోసారి వార్తల్లో నిలిచారు. అంతేకాదు ఆమె ప్రకటన కోసం రాష్ట్రం మొత్తం ఆసక్తికరంగా ఎదురుచూస్తుంది. ఇప్పటికే టీన‌గ‌ర్‌లోని ఆమె నివాసం ముందు అభిమానులు కిక్కిరిసిపోతున్నారు. రోజూ వేలాదిమంది అభిమానులు ఆమెను క‌లుసుకుని రాజ‌కీయాల్లోకి రావాల‌ని కోరుతున్నారు. కొంద‌రైతే సేలం జిల్లాలో దీప పేరుతో  పార్టీని స్థాపించ‌డ‌మే కాకుండా స‌భ్యత్వ న‌మోదు కూడా చేస్తున్నారు.   ఇదిలా ఉండగా దీప రాక మాత్రం అన్నాడీఎంకే పార్టీలోనే కొంత మంది నేతలకు ఆనందానిస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా శశికళకు కాస్త వ్యతిరేకంగా ఉన్న నేతలకు.  జ‌య మ‌ర‌ణం త‌ర్వాత పార్టీ ప‌గ్గాలు చేపట్టిన శ‌శిక‌ళ‌కు వ్య‌తిరేకంగా ఓ వ‌ర్గం పార్టీలో ఉండ‌లేక‌, అలాగ‌ని బ‌య‌ట‌కు వెళ్లలేక సతమతమవుతోంది. ఇప్పుడు వీరికి దీప ఆశాకిర‌ణంగా క‌నిపిస్తున్నారు. అమ్మ‌లేని లోటును తీర్చాలంటూ ఆమెపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరి దీప ఎలాంటి ప్రకటన చేస్తారో తెలియాలంటే అప్పటి వరకూ ఆగాల్సిందే.

ఆ అమ్మాయిల్ని,పాక్ సైన్యమే సెక్స్ స్లేవ్స్ గా మార్చేస్తోందట!

  బలూచిస్తాన్ అంశం మోదీ లేవనెత్తినప్పుడు పాకిస్తాన్ ఉడికిపోయింది. మరో రకంగా చెప్పుకోవాలంటే భయపడిపోయింది. ఇప్పటికీ పైపైకి ఎంత గంభీరంగా మాటలు మాట్లాడుతున్నా లోలోన బెదిరిపోతూనే వుంది.కారణం అరెస్సెస్ మేధావులు, మోదీ వెనుక వున్న అజిత్ ధోవల్ లాంటి అధికారుల సిద్దాంతం పాక్ ను మూడు, నాలుగు ముక్కలు చేయటమే. పాక్ ఇప్పుడున్న స్థితిలో ఎంత ఎక్కువ కాలం వుంటే భారత్ కు అంతం ఇబ్బంది అనేది కొందరి అభిప్రాయం.సంఘ్ ఐడియాలజీ నరనరాన వున్న మోదీ కూడా అందుకు వ్యతిరేకం ఏం కాదు. కాని, అందుకు తగిన సమయం మాత్రం చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి.  భారత్ బలూచిస్తాన్ కు విముక్తి కల్పిస్తుందని అక్కడి ఉద్యమకారులు ఎప్పట్నుంచో ఆశిస్తున్నారు. కాని, గత డెబ్బై ఏళ్లలో ఎప్పుడూ మన పాలకులు ధైర్యంగా బలూచ్ విషయం లేవనెత్తలేదు. కాశ్మీర్లో నిజంగా లేనే లేని విముక్తి పోరాటాన్ని పాక్ ఐక్యరాజ్య సమితి దాకా తీసుకెళ్లినా మన వాళ్లు బలూచిస్తాన్ విషయంలో నోరు మెదపలేదు. కాని, మోదీ కొన్ని నెలల క్రితం బలూచ్ ఉద్యమం గురించి మాట్లాడటం అనేక కొత్త పరిణామాలకి దారీ తీసింది. మరీ ముఖ్యంగా, బలూచ్ నేతలకు, పోరాట యోధులకి కొత్త ఆశలు కలిగేలా చేసింది. ఆ క్రమంలోనే పాక్ అక్కడ చేస్తోన్న దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.  పాకిస్తాన్ లో సైన్యం చేసే ఆకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. ఇది అందరికీ తెలిసిందే అయినా ఇప్పుడు తాజాగా పస్తూన్ ఉద్యమకారుడు ఉమర్ ఖటక్ చెప్పిన విషయాలు ఒళ్లు జలదరింపజేస్తాయి. అఫ్గాన్ సరిహద్దులోని తమ ప్రాంతాలపై పాక్ సైనికులు రాక్షసుల్లా దాడి చేసి ప్రాణాలు తీస్తారని చెప్పాడు. అంతే కాదు, బుల్డోజర్లతో తమ ఇళ్లు నేల మట్టం చేసి జీవితాలు నేలపాలు చేస్తున్నారని వాపోయాడు. తమ నివాసాలు చెరిపేసి ఉగ్రవాదుల శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారని ఉమర్ అన్నాడు. మరీ దారుణం ఏంటంటే, చాలా అందంగా వుండే పస్తూన్ అమ్మాయిల్ని పాక్ సైన్యమే లాహోర్ లాంటి నగరాల్లో సెక్స్ బానిసలుగా మార్చేస్తోందట.  పాక్ నుంచి విడిపోయి స్వతంత్రంగా బతకాలని 1947నుంచే పోరాడుతున్న బలూచ్ ప్రజలు ఇస్లాబాద్ పాలకుల నుంచి అన్ని రకాల హింసల్ని ఎదుర్కొంటున్నారు. తమ మీద అణు దాడులు చేయటానికి పాక్ వెనుకాడకపోవచ్చని వారంటున్నారు. ఇప్పటికే పాక్ సైన్యం టార్చర్ తట్టుకోలేక 5లక్షల మంది పస్తూన్ ప్రజలు అఫ్గనిస్తాన్ వలస వెళ్లిపోయారని యూఎన్ఓ కూడా ఒప్పుకుంది. అయినా ప్రపంచ దేశాలు దీనిపై కిక్కురుమనటం లేదు. చైనా లాంటి దేశాలైతే నిశ్శబ్దంగా మద్దతు కూడా పలుకుతున్నాయి. మన భద్రత దృష్ట్యానే కాక మానవతా దృక్పథంతో కూడా బలూచ్ ప్రజలు, పస్తూన్ ప్రజలకు భారత్ విముక్తి కల్పించాల్సి వుంది. బంగ్లాదేశ్ విడదీసినట్టే మరో సారి పాక్ ను ముక్కలు చేయాలి. ఇది నైతికంగా తప్పే అయినా ప్రపంచ శాంతికి, మన సంక్షేమానికి ఎంతో కీలకం...   

పెటా దెబ్బకి... పెంటైపోయిన త్రిష పరిస్థితి!

  సోషల్ మీడియా దెబ్బకి ప్రపంచం నానా రకాలుగా మారిపోతోంది. ఒకప్పుడు మన మాట ప్రపంచం వినాలంటే పేపర్లు, టీవీలు అవసరం అయ్యేవి. కాని ఇప్పుడు సోషల్ మీడియా ఎరాలో అంతా ఫేస్బుక్, ట్విట్టర్ మయం! మనసుకు ఏది తోచినా క్షణాల్లో నెట్ లోకి నెట్టేయొచ్చు. ఆ తరువాత అది మనమే స్వయంగా ఆపాలనుకున్నా ఆగదు. ఒకరి నుంచి ఒకరు షేర్ లు చేస్తూ ఎక్కడెక్కడికో పాకించేస్తుంటారు. కాని, ఇదంతా పాజిటివ్ యాంగిల్. సోషల్ మీడియా విచ్చలవిడితనానికి నెగటివ్ కోణం కూడా వుంది. పాపం, ఇప్పుడు దానికే చాలా మంది సెలబ్రిటీల మాదిరిగానే త్రిష బలైపోయింది...   త్రిష అంటే పడి చచ్చిపోయే అభిమానులు బోలెడు మంది. కాకపోతే, ఆమెకు తాజాగా మరో విషయం తెలిసింది. జల్లికట్టు ఆటకు ఆమెకున్న అభిమానుల కంటే ఎక్కువ మంది అభిమానులు వున్నారు తమిళనాడులో. వారు తమ అభిమాన ఆట కోసం ఎంతగా పడి ఛస్తారంటే .. అవసరమైతే త్రిషని చంపేయటానికి రెడీ అయిపోతారు! అయితే, ఆగండాగండీ... మరీ భయపడాల్సింది ఏమీ లేదు కాని... ఉరుము ఉరిమి మంగళం మీద పడిందన్నట్టు జల్లికట్టు జగడం ఇప్పుడు త్రిషకు చుట్టుకుంది. అందుకే, ఆమె ట్విట్టర్ లో తెగ సీరియస్ అయిపోయారు!   త్రిషకి, జల్లికట్టుకి మామూలుగా అయితే ఎలాంటి సంబంధం లేదు. కాని, కొందరు హార్డ్ కోర్ తమిళ జల్లికట్టు అభిమానులు ఒక లింక్ కనిపెట్టారు. అదే పెటా! జంతు సంరక్షణ కోసం కృషి చేసే పెటా సంస్థ త్రిషని తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎప్పట్నుంచో కొనసాగిస్తోంది. త్రిష కూడా వీధి కుక్కల్ని హింసించకండి లాంటి పిలుపులిస్తూ కూల్ గానే బండి నెట్టుకొస్తోంది. కాని, జల్లికట్టు నిషేధించాలని పెటా వారు సుప్రీమ్ కి వెళ్లటంతో త్రిషకి పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. తమ సంప్రదాయ క్రీడను అడ్డుకున్న సంస్థతో త్రిషకి సంబంధాలు వుండటం తమిళులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే, ఆమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తున్నారు. అంతటితో ఊరుకోకుండా బూతులు కూడా తిట్టేస్తున్నారు. పనిలో పనిగా కొందరైతే త్రిష చచ్ఛిపోయిందని ప్రచారం చేస్తూ ఫోటోలు పెడుతున్నారు. ఇవన్నీ వారు జల్లికట్టు మీద తమకున్న అభిమానంతోనే చేస్తున్నారు. కాకపోతే, పెటా పిటీషన్ కి, సుప్రీమ్ తీర్పుకి ఏ సంబంధం లేని త్రిష మాత్రం సెగ భరించాల్సి వస్తోంది...   తనపై జరుగుతోన్న దుర్మార్గ ప్రచారానికి స్పందించిన త్రిష ట్విట్టర్లో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ఆడవాళ్లని, వాళ్ల కుటుంబాల్ని టార్గెట్ చేయటమే తమిళ సంస్కృతా అంటూ ఘాటుగా ప్రశ్నించింది. తాను జల్లికట్టుకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆమె చెప్పింది. అయినా కావాలని ఫ్రీగా దొరికిన సోషల్ మీడియా సైట్స్ లో నోటికి వచ్చిందల్లా వాగుతున్నారని తిట్టిపోసింది!   పాపం త్రిష... పెటా వారు చేసిన తప్పుకి దురభిమానుల పెంట మాటలన్నీ భరించాల్సి వస్తోంది! గ్లామర్ వుండీ సెలబ్రిటీగా కొనసాగినప్పుడు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు మరి...

హాల్ టికెట్ పై హాట్ ఫోటో! బీహార్ విద్యార్థినికి భీభత్సమైన షాక్!

  దేశంలో అత్యంత వెనుకబడ్డ రాష్ట్రం ఏది? ఈ ప్రశ్నకు చాలా మంది అసంకల్పితంగానే చెప్పేసే సమాధానం, బీహార్! మన దేశంలో ఇంకా బోలెడు రాష్ట్రాలు వెనుకబాటుతో బాధపడుతున్నా బీహార్ మాత్రం అన్ని రకాల చెడు కారణలతో ఫుల్ గా ఇన్ ఫేమస్ అవుతూ వుంటుంది! రాజకీయాలు మొదలు రికార్డింగ్ డ్యాన్స్ ల వరకూ అన్నిటికీ బీహారే అడ్డా. అక్కడ జరగని అడ్డమైన పనంటూ వుండకపోవటం నిజంగా పెద్ద విషాదం. ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో ఘనకార్యం చేరింది!   ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ముందు అక్కడి విద్యా వ్యవస్థ బాగుపడాలి. దాని వల్లే ఇవాళ్ల కాకపోయినా రేపైనా సమాజం బాగుపడుతుంది. కాని, బీహార్లో విద్యా వ్యవస్థ అవస్థ చూస్తే దుఃఖంతో పాటూ నిర్లప్తిత కూడా వచ్చేస్తుంది. అంతగా అవినీతి, నిర్లక్ష్యం పేరుకుపోయాయి ఒకప్పటి నలందా ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయానికి కేంద్రమైన బీహార్లో!   తాజాగా ఓ అమ్మాయి స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ఉద్యోగానికి అప్లై చేసుకుంది. అందుకు ఆమెకు పరీక్ష రాయటానికి అధకారులు హాల్ టికెట్ జారీ చేశారు. కాని, అసలు బీహారీ ట్విస్ట్ ఇక్కడే ఇచ్చారు సదరు మహా నిజాయితీపరులైన ప్రభుత్వ ఉద్యోగులు. హాల్ టికెట్ పై విద్యార్థిని ఫోటో కాకుండా హీరోయిన్ ఫోటో అచ్చేశారు. అక్కడితో వారి రసికతో చల్లారలేదు. ఆ ఫేమస్ హీరోయిన్ గారి టాప్ లెస్ ఫోటో వేశారట ప్రబుద్ధులు! తన ఫోటోకి బదులు హీరోయిన్ నగ్న చిత్రం చూసి అవాక్కైంది అమాయక విద్యార్థిని! మెల్లగా ఈ విషయం ఓ హిందీ పత్రిక కథనం ద్వారా సోషల్ మీడియాకు చేరి రచ్చ రచ్చగా మారింది. కాని, ఇంత వరకూ నీతీష్, లాలూ ప్రసాద్ ల భీభత్స బీహార్ లో ఏ ఒక్క అధికారి దీనిపై స్పందించలేదు!   కొన్ని నెలల క్రితమే బీహార్లో పెద్ద మార్కుల కుంభకోణం జరిగింది. అక్కడ జరిగిన ప్రభుత్వ బోర్డ్ ఎగ్జామ్స్ లో టాపర్స్ గా నిలిచిన వారు కనీసం ఏ సబ్జెక్ట్ లో ఏముంటుందో కూడా చెప్పలేకపోయారు. పొలిటికల్ సైన్స్ లో వంటల గురించి నేర్పించారంటూ టీవీ ఇంటర్వ్యూలో చెప్పి అడ్డంగా బుక్కైపోయారు. తరువాత జరిగిన దర్యాప్తులో ఎంతో మంది సీనియర్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ అఫీషియల్స్ అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది!   డబ్బులు తీసుకోని పేపర్ లీక్ చేయటం మొదలు హాల్ టికెట్ పై బూతు బొమ్మలు అచ్చేయటం వరకూ బీహార్ విద్యాశాఖ లీలలు ఒక్క రకం కాదు. ఒకప్పడు దేశదేశాల నుంచి విద్యార్థులు వచ్చిన నలంద ప్రాంతంలోనే ఇప్పుడు తప్పుడు బొమ్మతో హాల్ టికెట్ అందుకున్న అభాగ్యురాలు వుంటోంది. ఇదే బీహార్ దారుణమైన పతానానికి, మన వ్యవస్థలోని లోపానికి ప్రత్యక్ష నిదర్శనం!

ఎరుపు నుంచి కాషాయానికి రంగు మారుతోన్న మమత పాలిటిక్స్!

  మూడు దశాబ్దాల లెఫ్ట్ అధికారానికి బెంగాల్లో పెద్ద బెంగగా మారింది దీదీ. మమత బెనర్జీ వరుసగా రెండు సార్లు ఎర్రదండుని ఓడించి కొత్త ఎనర్జీతో వుందిప్పుడు. అక్కడ ఇప్పుడప్పుడే సీపీఎం, దాని సహచర పార్టీలు లేచి నిలబడే పరిస్థితి లేదు. అంతగా పాతాళానికి తొక్కేసింది మమతమ్మ. కాని, బెంగాల్లో తిరుగులేకుండా పోయిన బెనర్జీకి కంటీ మీద నిద్దుర మాత్రం వుండటం లేదు. అందుక్కారణం... బీజేపీ, అరెస్సెస్ లే! ఆమె ఎర్ర పార్టీలకు తాగించిన కషాయమే ఆమెకు కాషాయ దళం తాగిస్తుందేమో అని మమత తెగ బెంబేలెత్తుంది!   నోట్ల రద్దు తరువాత దేశంలో నిర్భయంగా నోరెత్తిన ఇద్దరు సీఎంలలో మమత ఒకరు. అరవింద్ కేజ్రీవాల్ మోదీని తిట్టిపోయటం కొత్త కాదు కాబట్టి మమత చేసిన హంగామానే అసలు విశేషం. అసలు ఎంత మాత్రం జంకు లేకుండా ఆమె డీమానిటైజేషన్ని వ్యతిరేకించింది. జనం మోదీ నిర్ణయాన్ని పెద్ద ఎత్తున సమర్థిస్తున్నారని తెలిసి కూడా ఆమె మోదీతో పోరుకు సిద్ధమైంది. చివరకు, భారతీయ సైన్యం ఆమె రాష్ట్రంలో కాలుపెడితే కూడా తన ప్రభుత్వాన్ని అస్థిర పరచటానికి కంటూ ఆరోపణలు చేసి అందర్నీ షాక్ కి గురి చేసింది. మమత తన రాజకీయం కోసం ఆర్మీని కూడా వాడుకోవటం చాలా మంది జీర్ణించుకోలేకపోయారు.   నోట్ల రద్దుని వ్యతిరేకించటం వెనుక మమత ఉద్దేశాలు, దురుద్దేశాలు ఎవ్వరికీ తెలియవు. శారదా స్కామే కారణమని కొందరంటున్నా ఆ విషయం కోర్టులో తేలాల్సిందే. కాని, కాస్త లోతుగా చూస్తే ఆమె అభ్రదత బీజేపి ప్రభావం పెరగటం గురించే అని మనకు అర్థమైపోతుంది. చాలా పెద్ద ఎత్తున ముస్లిమ్ జనాభ వున్న బెంగాల్ లో బీజేపి, అరెస్సెస్ ఎదుగుదలకి అవకాశాలు పుష్కలంగా వున్నాయి. అంతే కాదు, లెఫ్ట్ పార్టీల పతనంతో అక్కడ చాలా రాజకీయ శూన్యం కూడా వుంది. మమత అంటే ఇష్టం లేని ఓటర్లు లెప్ట్ ని కాకుండా బీజేపిని ఎంచుకుని అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే టర్మ్ కల్లా మమత అధికారం కోల్పోయేటంత ప్రమాదం లేదనే ఇప్పుడు మనకు అనిపిస్తోంది. కాని, మోదీ, అమిత్ షా రాబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కల్లా పూర్తి స్థాయిలో దృష్టి పెడితే మమతకు గండం తప్పక పోవచ్చు. అదీ కాక బీజేపి, అరెస్సెస్ ఎంతగా బలపడితే దీదీకి అంతగా అధికారం నిలబెట్టుకోవటం కష్టమవుతూ వుంటుంది. హిందువులు ఒక్కసారి పెద్ద ఎత్తున కమలం వైపు కదిలితే తరువాత ఆమె చేయగలిగింది ఏమీ లేదు.   బీజేపి, అరెస్సెస్ రెండు వైపుల నుంచి ముంచుకొస్తుండటంతో మమత తీవ్రంగానే ఒత్తిడికి లోనవుతున్నట్టు కనిపిస్తోంది. మోదీపై ఆమెకు సన్నిహితుడైన ముల్లా ఒకరు ఫత్వా జారీ చేసినా ఆమె ఏమీ అనకపోవటం ఆమె భయానికి స్సష్టమైన సంకేతం. అందుకే, అంతకంతకూ ముస్లిమ్ ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. కాని, ఆ క్రమంలో ఆమె బీజేపి, అరెస్సెస్ తో కాకుండా ఏకంగా బెంగాలీ హిందూ సమాజంతో గొడవకు దిగుతున్నట్టు అనిపిస్తోంది. వరుసగా హిందువులపై దాడులు జరగటం, కనీసం దుర్గా పూజలు కూడా స్వేచ్ఛగా చేసుకోలేకపోవటం... ఇవన్నీ దీర్ఘ కాలంలో మమత మీద హిందువులకున్న ఇప్పటి మమత తగ్గేలా చేసేవే! అదే బీజేపీకి అరెస్సెస్ కి కావాల్సింది కూడా!   సంక్రాంతి సందర్భంగా అరెస్సెస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ మీటింగ్ ఏర్పాటు చేశారు కోల్ కతాలో. దాన్ని అందరూ ఊహించినట్టుగానే పోలీసుల ద్వారా అడ్డుకున్నారు మమత. ఒక మైదానం చిన్నదవుతుందని సాకు చెప్పారు పోలీసులు. రెండోది పెద్దదవుతుందని, అంత ప్రాంతానికి పోలీసుల్ని ఏర్పాటు చేయలేమని చేతులెత్తేశారు. చివరకు, హై కోర్ట్ ను ఆశ్రయించారు అరెస్సెస్ వారు. ఒకవేళ మమత మొండితనాన్ని దెబ్బతీస్తూ హైకోర్ట్ అనుమతి ఇస్తే అది దీదీకి అవమానమే. ఎందుకంటే, గతంలోనూ అమిత్ షా సభకి మమత ఒప్పుకోకున్నా కోర్ట్ అంగీకరించింది. మోహన్ భాగవత్ రాజకీయ పార్టీకి చెందిన వారూ కూడా కాదు కాబట్టి కోర్టు ఒప్పుకునే సూచనలే ఎక్కువ!   మమత అరెస్సెస్, బీజేపీలతో కయ్యానికి కాలుదువ్వి ముస్లిమ్ ఓటు బ్యాంకు పటిష్ఠం చేసుకోగలదేమోగాని హిందువులు ఎల్లప్పుడూ ఆమె వెంట వుంటారని గ్యారెంటీ లేదు. ఒకప్పుడు వాళ్లే ముప్పై ఏళ్లు లెఫ్ట్ పార్టీల్ని నెత్తిన పెట్టుకున్నారు. తరువాతని మమతపై మమకారాన్ని కురిపించారు. మరి ముందు ముందు కమలాన్ని వికసింపజేయరని విశ్వాసం ఏంటి? సెక్యులరిజమ్ ట్రాప్ లో చిక్కి మమత మెజార్జీ ఓట్లకు దూరం కాకపోవటమే ఆమె భవిష్యత్ కు భరోసా. లేదంటే కాషాయ గండం తప్పకపోవచ్చు....

జాతిని రక్షించే జవానుకి... జవాబు చెప్పుకోవాల్సిందే!

  దేశం లోపల వుంటూ మన ప్రాణాలు కాపాడేది రైతు. ఆ రైతులకి ఇప్పుడు దక్కుతోన్నగౌరవం, రక్షణ ఎంతో మనకు బాగా తెలుసు. ఇక దేశపు సరిహద్దుల్లో వుంటూ మన ప్రాణాలు కాపాడేది జవాన్. కిసాన్ అన్నం పెడితే జవాన్ మనం హాయిగా ఆ అన్నం తిని నిద్దురపోయేలా చూస్తాడు. అంతటి ప్రాముఖ్యం వుంది కాబట్టే మన దేశం ప్రతీ యేడూ లక్షల కోట్లు ఖర్చు చేస్తుంది దేశ రక్షణ రంగంపై. కాని, తాజా పరిణామాలు ఆ లక్షల కోట్లు వృథా అవుతున్నాయేమో అనేలా వున్నాయి...   ఈ మధ్య వరుసగా బీఎస్ఎఫ్ జవాన్ల వీడియోలు ఇంటర్నెట్ లో కలకలం రేపుతున్నాయి. ఒక వీడియోలో ఒక జవాను జీతాల విషయంలో తాము ఎదుర్కొంటోన్న వివక్ష గురించి మాట్లాడితే మరో దాంట్లో ఇంకో జవాను తమకు శరీరం గడ్డ కట్టే చలిలో ఏర్పాటు చేస్తోన్న అద్వాన్నమైన భోజనం గురించి గొంతు విప్పాడు. ఇక అత్యంత తాజాగా మరో జవాను తన పై అధికారులు పెడుతోన్న టార్చర్ గురించి మాట్లాడాడు. తాను ప్రధానికి తమ సమస్యల గురించి లేఖ రాస్తే కక్ష సాధింపు మొదలైందని వాపోయాడు. అధికారులు కోర్టు మార్షల్ చేసే ఉద్దేశంతో వున్నారని అన్నాడు. ఇంతకీ ఆ జవాను ప్రధాని దృష్టికి తీసుకొచ్చిన సమస్యలేంటి? అధికారులకి బూట్లు పాలిష్ చేయటం లాంటి అమానుష పనులు తమ  చేత చేయించవద్దన్నాడు!   దూరపు కొండలు నునుపు అన్నట్టు మనకు అంతా క్రమశిక్షణతో కదిలిపోతున్నట్టు కనిపిస్తుంది కాని.. పోలీస్ మొదలు ఆర్మీ వరకూ భద్రతా దళాలు అన్నిట్లో దారుణమైన బాసిజమ్ వుంటుంది. దిగువ స్థాయి వార్ని పై వారు , వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా హింసిస్తుంటారు. తమ కుటుంబాలకి దూరంగా వుండే జవాన్లు, పోలీసులు అనేక సార్లు ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు, కాల్పులు జరపటం వంటి విషాదాలకి కారణం అవుతుంటారు. చాలా సార్లు భద్రతా దళాల్లో వుండే కరుడుగట్టిన క్రమశిక్షణ వల్ల అంతకన్నా వేరు మార్గం వుండదు. కాని, తాజాగా వీడియోల రూపంలో జవాన్లు తమ అసంతృప్తి బయట పెడుతున్నారు. ఇది ఆందోళనకరమే అయినా అసలు పరిస్థితిని కళ్లకు కడుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా సమగ్ర దర్యాప్తు, విచారణకు ఆదేశించి ప్రక్షాళన చేపట్టాలి. ఊరికే లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి ఆయుధాలు, అణు బాంబులు సిద్ధం చేసుకుంటే యుద్ధాలు గెలిచేయం. శత్రువు కన్నులో కన్ను పెట్టి పోరాడే సిపాయి మనస్ఫూర్తిగా సిద్ధంగా వుండాలి. అప్పుడే దేశం భద్రంగా వున్నట్టు. గన్నులు, బుల్లెట్లు,మిసైల్స్, బాంబుల వంటి వాటి కోసం కోట్లు ఖర్చు చేసే మన వ్యవస్థ ఒక జవానుకు చల్లటి చలిలో ఆరోగ్యకరమైన ఆహారం అందివ్వలేకపోతోందంటే .. చాలా పెద్ద లోపమే ఎక్కడో జరుగుతోందని అర్థం. దాన్ని వెదికి పట్టుకుని హతమార్చితేనే ఈ అంతర్గత యుద్ధంలో మనం గెలిచేది! బయటి శత్రువులతో యుద్ధానికి సర్వ సన్నద్ధంగా వుండగలిగేది!

కోర్టు బోనెక్కుతున్న... మన పండుగలు!

  మన దేశంలో ప్రతీ యేడు కొన్ని పండగలు రాగానే మీడియాలో పాత హడావిడి మొదలైపోతుంది.పండగ శోభ గురించి, పండగ కోలాహలం గురించి, సంప్రదాయాలు, ఆచారాలు వగైరా వగైరా గురించి పేపర్లలో, ఛానల్స్ లో బోలెడు కథనాలు వస్తాయి. అయితే, విషాదంగా ఈ మధ్య కొన్ని పండుగలు రాగానే మీడియాలో కోర్టులు, కోర్టు తీర్పుల హడావిడి ఎక్కువైపోతోంది. ప్రతీ సంవత్సరం అదే తంతు. ఇది మరీ ముఖ్యంగా, హిందువుల పండుగలప్పుడే చర్చకు దారి తీసి రచ్చైపోతోంది...  ప్రతీ వినాయక చవితికి పెద్ద దుమారం నిమజ్జనమే. కోర్టులు, ప్రభుత్వాలు హుస్సేన్ సాగర్ లో విగ్రహాలు వేయవద్దని అనటం, వినాయక చవితి ఉత్సవ నిర్వాహకులు మాత్రం ససేమీరా అనటం రోటీన్ అయిపోయింది. ఇందులో ఎవరు కరెక్ట్, ఎవరి సెంటిమెంట్ కరెక్ట్ ఆ వినాయకుడికే తెలియాలి! సరిగ్గా ఇలాంటి వ్యవహారమే సంక్రాంతి కోళ్ల పందాలు, జల్లికట్టు విషయంలో కూడా జరుగుతూ వస్తోంది. ఒకే సమస్య సంవత్సరం తరువాత సంవత్సరం వస్తూనే వున్నా ఎవ్వరూ గట్టిగా పూనుకుని పరిష్కారం చూపలేకపోతున్నారు.  సంక్రాంతి వస్తే ఆంధ్ర ప్రాంతంలో కోళ్ల పందాలు జోరందుకుంటాయి. వీటిలో కోట్లకు కోట్లు చేతులు మారతాయి. పైగా మూగ జీవాలతో పాశవికమైన క్రీడ నడుస్తుంది. వాటి ప్రాణాలు బలిపెట్టి వినోదం పొందుతుంటారు. ఇవన్నీ కారణాల చేతే కోర్టు ఈ యేడు కోళ్ల పందాలు కుదరవని తేల్చేసింది. జంతు ప్రేమికులు సంతోషించారు. కాని, కోర్టుల నెపంతో హిందూ సంప్రదాయాలు, భారతీయ పురాతన ఆచారాలపై దాడి జరుగుతోందని కొందరు వాపోతున్నారు. నిత్యం చికెన్ షాపుల్లో లక్షల కోళ్లు నిర్ధాక్షిణ్యంగా అంతమైపోతుంటే కోళ్ల పందాలని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇందులోనూ పాయింట్ లేకపోలేదు! కోళ్ల పందాల విషయంలో కోర్టులు కూడా బెట్టింగుల మీద దృష్టి పెట్టాలిగాని ఆచారంగా వస్తోన్న కోళ్ల పందాలపై కాదనుకుంటా. కోళ్ల పందాల మాదిరిగానే జల్లికట్టు కూడా ఎప్పటికప్పుడు కోర్టు మెట్లపై మూలుగుతోంది. తమిళనాడులో జరిగే ఈ ఎడ్ల పందెం జంతు ప్రేమికులకి సహజంగానే నచ్చలేదు. కోర్టుకు వెళ్లారు. సుప్రీమ్ జల్లికట్టు నిషేధించాల్సిందే అనేసింది. కాని, ప్రజల మనోభావాలతో ముడిపడ్డ ఈ వ్యవహారం తమిళ సర్కార్ కు, కేంద్ర సర్కార్ కు తలనొప్పిగా మారింది. వదలమంటే జనానికి కోపం, కరవమంటే కోర్టుకు కోపం అన్నట్టు తయారైంది పరిస్థితి. ఈ సంవత్సరం కూడా అత్యున్నత న్యాయస్థానం జల్లికట్టుకు పర్మిషన్ ఇవ్వటానికి అస్సలు అంగీకరిచంలేదు. పశువుల్ని హింసించటానికి వీల్లేదని చెప్పింది. కాని, కమల్ హాసన్ లాంటి సెలబ్రిటీలు మొదలు చాలా మంది తమిళులు జల్లికట్టు తప్పు కాదని వాదిస్తున్నారు. ఉత్తమమైన పశు సంతతి వృద్ధి కోసం ఈ ఎడ్ల పందాలు నిర్వహిస్తారని వారంటున్నారు. కాని, అదే విషయం సమర్థంగా కోర్టులో చెప్పేవారు లేదు. అందుకే, సుప్రీమ్ జల్లికట్టు నిషేధం దిశగానే మొగ్గు చూపుతోంది. జల్లికట్టు నిషేధం వల్ల నష్టం, జరగటం వల్ల లాభం ఏదీ లేదు. కాకపోతే, అత్యధిక జనాభా తాలూకూ మనోభావాలకి సంబంధించిన విషయమైన ఒక అంశంపై తీర్పు ఇచ్చినప్పుడు కోర్టులు కూడా పునరాలోచిస్తే బావుంటుంది. ఎందుకంటే, స్పెయిన్ లాంటి దేశంలో బుల్ ఫైట్ చట్టబద్ధంగా నిర్వహిస్తుంటారు. అదెలా సాధ్యమవుతోందో అధ్యయనం చేస్తే మనకూ ఒక పరిష్కారం దొరకవచ్చు. కాని, జల్లికట్టు, కోళ్ల పందాలు, వినాయక నిమజ్జనం కేవలం తీర్పుల వల్ల, నిషేధాల వల్ల మాత్రం ఆగేవి కావు. సామాన్య జనంలో చైతన్యం వస్తే తప్ప అవ్వి తమంత తాముగా ఆగవు. అంతే కాని, కోర్టు ఆర్డర్ తో ప్రభుత్వాలు తూచా తప్పక అమలు చేసే అవకాశం ఎంత మాత్రం లేదు. కారణం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలన్నీ జనం వేసే ఓట్ల మీదే  ఆధాపడి వుంటాయి. వాటికి లోటు వచ్చేలా చర్యలు అవ్వి ఏనాడూ తీసుకోవు. ఈ మొత్తం వ్యవహారానికి షరతులతో కూడిన అనుమతి ఒక్కటే సమర్థనీయ మార్గం...