నోట్ల రద్దు కాదు... ఎమర్జెన్సీ విధించినా ఓకేనట!
posted on Dec 28, 2016 @ 1:48PM
మోదీ నోట్ల రద్దుతో దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి! జనం నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి మాటలు మనం రోజూ వింటూనే వున్నాం. రాహుల్ గాంధీ మొదలు మమతా బెనర్జీ వరకూ అందరూ ఎమర్జెన్సీ జపం చేస్తున్నారు! కాని, జనంలో పరిస్థితి మాత్రం డిఫరెంట్ గా వుంది.
ప్రతిపక్ష నేతలు ఎమర్జెన్సీ బూచి చూపి భయపెడదామనుకుంటున్నంత భీభత్సంగా సామాన్య జనం ఎమర్జెన్సీ గురించి భయపడటం లేదు. మరీ ముఖ్యంగా , కాస్త చదువుకున్న ఈ కాలపు ఇండియన్స్ తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే సోషల్ మీడియాలో అయితే ఎమర్జెన్సీ అస్సలు వణుకు పుట్టించటం లేదు! ఇన్ ఫ్యాక్ట్, నెటిజన్లు ఎమర్జెన్సీ కావాలంటున్నారు! అయితే, ఆ ఎమర్జెన్సీ మోదీ విధిస్తే ఓకే అంటున్నారు...
ప్రజాస్వామ్యంలో వుంటూ హాయిగా స్వేఛ్ఛని అనుభవిస్తున్న ప్రజలకి ఇదేం మాయ రోగం అనుకుంటున్నారా? అసలు సంగతి తెలియాలంటే, రైటర్ చేతన్ భగత్ నిర్వహించిన ఆన్ లైన్ పోల్ గురించి మాట్లాడుకోవాలి. ట్విట్టర్ లో చేతన్ కు చెప్పుకోదగ్గ స్థాయిలో ఫాలోవర్స్ వున్నారు. ఆయన త్వరలో రాయనున్న ఒక వ్యాసం కోసం జనం అభిప్రాయం కావాల్సి వచ్చింది. అది తెలుసుకునేందుకు తన ట్విట్టర్ అకౌంట్ సాయంతో సర్వే నిర్వహించాడు. అందులో అడిగిన కొశన్స్, వచ్చిన సమాధానాలు వింటే ఎవరికైనా దిమ్మతిరిగిపోతుంది! చేతన్ భగత్ ''మోదీ లీడర్ గా వుంటూ కొంచెం ప్రజాస్వామ్యం దెబ్బతిన్నా ఫర్వాలేదా?'' అని అడిగాడు. అందుకు, 55శాతం మంది ఓకే చెప్పారు. మొత్తం ఓటింగ్ లో పాల్గొన్న వారి సంఖ్య పదివేలకు పైమాటే!
చేతన్ భగత్ మరో ప్రశ్న వేశాడు ట్విట్టర్ యూజర్స్ కి... '' అవినీతి అంతానికి, అవినీతి పరుల్ని శిక్షించటానికి మోదీ కొద్ది కాలం పాటూ ఎమర్జెన్సీ విధిస్తే మీరు మద్దతిస్తారా?'' ఈ ప్రశ్నకి కూడా 9వేల మందికి పైగా ఓటింగ్ చేశారు. అందులో 57శాతం మంది మోదీ విధించే తాత్కాలిక ఎమర్జెన్సీకి సై అన్నారు! ఈ పలితాలు చూసిన చేతన్ భగత్ తానే అవాక్కయ్యాడు. అసలు జనానికి ప్రజాస్వామ్యం అంటే విలువ లేదా? లేక అదంటే ఏంటో తెలియదా? అంటూ ట్వీట్స్ చేశాడు!
చేతన్ భగత్ చేసిన సర్వేలో, వేలాది మంది ఎమర్జెన్సీకైనా సరే అనటం, మోదీ టెరిపిక్ పాలోయింగ్ కి నిదర్శనం! ఆయనని నిజాయితీపరుడిగా, గొప్ప ఫలితాలు సాధించగలిగే శూరుడిగా జనం చూస్తున్నారు. కాని, అంతకంటే ముఖ్యంగా డెబ్బై ఏళ్లుగా దేశాన్ని దోచుకున్న ఇతర నాయకులు, వారి పార్టీలు, వాటి పాలనలో బయటపడ్డ కుంభకోణాల పట్ల ఈ తరం వారికి తీవ్రమైన కోపం, కసి వున్నాయి. అవ్వే మోదీ పట్ల గుడ్డి విశ్వాసాన్ని కలుగజేస్తున్నాయి. మోదీ అయినా సరే ఎమర్జెన్సీ పెట్టడాన్ని బాధ్యతగల పౌరులు ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే. కాని, అసలు ఆయన పెడతానంటే అందుకు కూడా తాము సిద్ధమని జనం అంటున్నారంటే లోపం ఎక్కడుందో ముందు గ్రహించాలి. గత డెబ్బై ఏళ్లుగా భారతీయులు తమని తాము అవినీతి ఎమర్జెన్సీలో వున్నట్టుగా ఫీలవ్వటమే ఈ ఆందోళకర ఆలోచనా సరళికి కారణం!