పోల’వరం’లో కీలకదశ
posted on Dec 30, 2016 @ 10:45AM
పోలవరం గురించి ఊరిస్తూ వచ్చిన ఊహలు సాకారమయ్యే దశకు చేరుకున్నాయి. ఇన్నాళ్లుగా భూసేకరణ, కాలువల నిర్మాణం వంటి మౌలిక పనులు సాగిస్తూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు స్పిల్‌వేకు శ్రీకారం చుట్టడంతో ప్రాజెక్టు నిర్మాణంలో కీలకదశకు చేరుకున్నట్లయ్యింది. దాదాపు కిలోమీటరుకు పైగా 48 గేట్లతో నిర్మించే ఈ స్పిల్‌వేతో నీటి మట్టాన్ని నియంత్రించవచ్చు.
దాదాపు 60 సంవత్సరాలుగా కేవలం ప్రణాళికల దశలోనే ఉన్న పోలవరంలో తొలి కాంక్రీటు నిర్మాణం జరగడంతో తెలుగుదేశం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా సాగించాలని భావిస్తోంది. అందుకోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మందిని తరలించడంతో పాటుగా కేంద్ర మంత్రులు సైతం ఇందులో పాలుపంచుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ వేడుకని ఘనంగా నిర్వహించేందుకు ఏకంగా 50 మంది ఐయేఎస్ ఆఫీసర్లను కూడగడుతున్నారంటే... ప్రభుత్వం దీనినెంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.
గోదావరి నుంచి సముద్రంలోకి వ్యర్థంగా చేరిపోయే మిగులు జలాలను వినియోగించుకోవాలన్నా, ప్రతి వేసవిలోనూ ఎండిపోతున్న కృష్ణమ్మ ఒడిని నింపాలన్నా కూడా పోలవరం కీలకమన్నది జలనిపుణుల మాట. ఇంతటి బృహత్ ప్రాజెక్టుకి వేలకోట్లుగా నిధులు అవసరం అవుతాయి. వేల ఎకరాల భూమినీ సేకరించాల్సి ఉంటుంది. పొరుగు రాష్ట్రాల అభ్యంతరాలనీ పట్టించుకుని తీరాల్సిందే!
కేంద్రం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడంతో నిధులకి కొరత లేకపోవచ్చునన్న భరోసా కలిగింది. రాష్ట్రానికి ఎలాగూ ప్రత్యేక హోదాని ఇవ్వడం లేదు కాబట్టి, కనీసం పోలవరానికి సాయం చేయక తప్పకదన్నది కేంద్రం ఆలోచనగా కనిపిస్తోంది. ఇక పోలవరంతో తమ రాష్ట్రాలు ముంపుకి గురవుతాయంటూ ఒడిషా, చత్తీస్‌గడ్, తెలంగాణ రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా... అవి ప్రాజెక్టుని నిర్వీర్యం చేసే స్థాయిలో లేవు. కాకపోతే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల విషయంలోనే రాష్ట్ర ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.
పోలవరం నిర్మాణంతో విలువైన అటవీ సంపద ఎలాగూ నీట మునిగే అవకాశం ఉంది. ఇది కాకుండా 40 వేల కుటుంబాలకు పైగా తమ భూమిని కోల్పోనున్నాయని ఓ అంచనా. రాష్ట్ర ప్రభుత్వం వీరందరికీ తగిన పరిహారం ఇవ్వడం లేదనీ, ఉన్నఫళంగా ఊళ్లకి ఊళ్లే ఖాళీ చేయిస్తున్నారనీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు భూసేకరణ ఇంకా పూర్తి కానేలేదనీ, పూర్తయిన భూమికి చాలాచోట్ల పరిహారం అందలేదనీ విపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ తెదెపా ఎట్టిపరిస్థితుల్లోనూ పోలవరాన్ని ముందుకు తీసుకుపోవాలన్న పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది.
ప్రత్యేక హోదా విషయంలో చెలరేగిన అసంతృప్తినీ, అమరావతి నిర్మాణంలో సాగుతున్న జాప్యాన్నీ వెనుకకు నెట్టేస్తూ ప్రజలకు కాస్త సంతోషం కలిగించే తాయిలంలా పోలవరం తప్పక పనికొస్తుంది. పోలవరాన్ని విమర్శించేవారిని ఎలాగూ అభివృద్ధి నిరోధకులుగా ముద్ర వేయవచ్చు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈ ప్రాజెక్టులో దూకుడుని ప్రదర్శిస్తున్నా... నిరంతర విద్యుత్తునీ, సాగునీటినీ, తాగునీటినీ అందిస్తుందని ఆశించే పోలవరం కల సాకారమవుతోందంటూ ఆంధ్ర ప్రజలు మహా సంతోషంగా ఉన్నారు.