రైతుల ఆత్మహత్యలలో రెండో స్థానం ఎందుకు?
posted on Jan 4, 2017 @ 11:28AM
వాళ్లు ప్రేమలో విఫలమై చావుని చేరుకోలేదు. కుటుంబ సమస్యలు ఉన్నాయని విరక్తితో జీవితాన్ని అంతం చేసుకోలేదు. మన ఆకలి తీర్చాలని ఆశించిన పాపానికి ఆత్మహత్యకు పాల్పడ్డారు. National Crime Record Bureau అనే సంస్థ వెలువరించిన గణాంకాల ప్రకారం 2015లో దేశవ్యాప్తంగా 8,007 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో 15 శాతానికి పైగా రైతులు తెలంగాణకు చెందినవారు కావడం బాధాకరం. 1,358 రైతు ఆత్మహత్యలతో తెలంగాణ, దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. రైతు ఆత్మహత్యలకి సంబంధించిన ఈ గణాంకాలలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో రైతుల దుస్థితికి కారణాలు స్పష్టంగానే తెలుస్తున్నాయి. ఏళ్ల తరబడి పీడిస్తున్న తీవ్రమైన కరవుతో అక్కడ మంచినీటికి సైతం మనుషులు కటకటలాడిపోయారు. దానికి తోడు అక్కడి రైతులు చెరకు పంట మీద ఎక్కువగా ఆధారపడటంతో పరిస్థితి మరింత ఉధృతరూపం దాల్చింది. ఎందుకంటే చెరకుని పండించాలంటే విపరీతంగా నీరు కావాల్సి ఉంటుంది. ఒక్క కిలో పంచదార ఉత్పత్తి అయ్యేందుకు దాదాపు 2,450 లీటర్ల మంచినీరు కావాల్సి వస్తుందని ఓ అంచనా. అలాంటి పరిస్థితులలో అక్కడి రైతు కరువు కోరలలో చిక్కుకుని విలవిల్లాడిపోయాడు.
తెలంగాణలోని పరిస్థితి ఇందుకు విభిన్నంగా ఉంది. ఇక్కడి రైతులు చెరకుతో పాటుగా వరి, పత్తి, పొగాకు, మామిడి, పసుపు, మిర్చి వంటి భిన్నమైన పంటల మీద కూడా ఆధారపడుతూ ఉంటారు. అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారమే పంట కాలువలు, చెరవులకంటే బోరు బావుల మీదే రైతులు అధికంగా ఆధారపడాల్సి వస్తోంది. అంటే బోరు కనుక పడకపోతే రైతు గుండెలో రాయి పడ్డట్లే అన్నమాట. కేవలం బోర్ల కోసమే లక్షల రూపాయలు వడ్డీకి తెచ్చి... నీటి చుక్క కనిపించకపోయేసరికి గుండెపగిలినవారు చాలామందే ఉన్నారు. ఒకవేళ బోరు పడినా కూడా వర్షభావపు పరిస్థితుల మధ్య భూగర్భ జలాలు ఎండిపోతే దిక్కుతోచక తనువు చాలించినవారూ ఉన్నారు.
కాబట్టి వ్యవసాయానికి నిరంతరం నీటి సరఫరా వల్లే పరిస్థితిలో ఎంతో కొంత మార్పు వస్తుందన్నది కాదనలేని విషయం. ఇందుకోసం మిషన్ కాకతీయ వంటి ప్రణాళికలు, పాలమూరు వంటి ప్రాజెక్టులు మొదలుపెట్టింది ప్రభుత్వం. కానీ ఈ కలలు సాకారమయ్యేలోగా రైతులకు బాసటగా నిలబడటం కూడా ప్రభుత్వ బాధ్యతే! తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పారిశ్రామిక, ఐటీ రంగాల మీద చూపించిన శ్రద్ధ వ్యవసాయ రంగం మీద చూపడం లేదన్న ఆరోపణ వినిపిస్తోంది. రైతుల రుణ మాఫీకి సంబంధించి కూడా సర్కారు స్పష్టమైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
తెలంగాణ రైతులకు ఉన్న సమస్యలు చాలవన్నట్లు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఒకటి వెలువడింది. దీంతో చచ్చి చెడీ పండించిన పంటను కొనే నాథుడే లేకుండా పోయాడు. పొలంలో కూలీలకు డబ్బులిచ్చేందుకు కూడా అప్పు తీసుకురావల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్తగా విడుదల అయిన నోట్లను గ్రామీణ ప్రాంతాలకు, సహకార బ్యాంకులకు చేరవేయడంలో యంత్రాంగం నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తోంది. నగదురహిత పల్లవిని అందుకున్న కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో అదెంత కష్టసాధ్యమైన ఆచరణో గ్రహించి కూడా తన పల్లవిని మార్చుకునేందుకు సిద్ధపడటం లేదు.
ఇన్ని సమస్యల మధ్యా ఈ ఏడాది వర్షపాతం బాగుండటం కొంతలో కొంత ఆశని కలిగిస్తోంది. వీటికి తోడు మిషన్ కాకతీయతో చెరువులు కళకళలాడుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. నకిలీ విత్తనాలని అందించే సంస్థల మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం కూడా ముదావహమే! ఇక రైతుల రుణాలకి సంబంధించిన హామీలు కూడా ఖచ్చితంగా అమలు జరిగితే 2017లో తెలంగాణ రైతులు కాస్త ‘ఊపిరి’ పీల్చుకోవచ్చు. ఇప్పటివరకంటే గత ప్రభుత్వాల వైఫల్యం అంటూ ప్రభుత్వ పెద్దలు తప్పించుకునే అవకాశం ఉంది. కానీ ఇక మీదట కూడా తెలంగాణ రైతుల ఆత్మహత్యలని నిలువరించలేకపోతే... ఆ బాధ్యత ఖచ్చితంగా ప్రస్తుత ప్రభుత్వానిదే అవుతుంది.