బాబు కేబినెట్ కూర్పు కొలిక్కి! జనసేన చేరేనా?

ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ముహూరం ఫిక్సైంది. బుధవారం (మే12)న చంద్రబాబు  తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయనున్నారు. తన కేబినెట్  కూర్పుపై చంద్రబాబు ఇప్పటికే కసరత్తు మొదలెట్టేశారు.  ఢిల్లీలో ఎన్డీయేతో చర్చలు, కేంద్ర క్యాబినెట్‌పై కసరత్తులో ఓ వైపు క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ చంద్రబాబు  ఈనాడు అధినేత రామోజీరావు కు నివాళులర్పించి, ఆయన అంత్యక్రియలకు హాజరై పాడె కూడా మోశారు. ఇంతటి తీరిక లేని సమయంలోనూ చంద్రబాబు  తన క్యాబినెట్ కూర్పుపై కసరత్తు చేసినట్లు చెబుతున్నారు.   

ఇప్పటికే తన కేబినెట్ లో ఎవరెవరికి ఏ శాఖ కేటాయించాలన్నదానిపై ఒక నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు.. జనసేన కేబినెట్ లో చేరుతుందా? లేదా? అన్న విషయంపై క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కేంద్రంలో మోడీ కేబినెట్ లో చేరేందుకు జనసేన పెద్దగా ఆసక్తి చూపలేదు. కేంద్ర కేబినెట్ లో చేరకుండా దూరంగా ఉంది. అదే విధంగా ఏపీలో కూడా మంత్రివర్గంలో చేరే అవకాశాలు లేవన్న చర్చ కూడా జరుగుతోంది. ఒక ఆంగ్ల చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీలో ప్రభుత్వంలో చేరే విషయంలో ఆసక్తి ఉందని జనసేనాని చెప్పినప్పటికీ, గత కొద్ది రోజులుగా జనసేనలో విస్తృతంగా జరుగుతున్నచర్చ మాత్రం జనసేన రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించేందుకే మొగ్గు చూపుతోందని పించేలా ఉంది.  దీంతో ప్రభుత్వంలో చేరే విషయంపై జనసేనాని నుంచి క్లారిటీ వస్తే తప్ప ఆ పార్టీకి చంద్రబాబు కేబినెట్ లో ఎన్ని బెర్తులు దక్కుతాయి అన్న విషయంపై స్పష్టత రాదు.  ఇక బీజేపీకి చంద్రబాబు కేబినెట్ లో రెండు బెర్తులు దక్కడం ఖాయమని తెలుస్తోంది. 

చంద్రబాబు కేబినెట్ లో ఉత్తరాంధ్ర నుంచి ముగ్గురికి అవకాశం దక్కు అవకాశం ఉంది. జిల్లాకు ఒకటి చొప్పున శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం లకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి చంద్రబాబు క్యాబినెట్ లో స్థానం లభించనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక తూర్పు గోదావరి జిల్లా నుంచి ఇద్దరు, పశ్చిమగోదావరి జిల్లా నుంచి ముగ్గురికి  చంద్రబాబు కేబినెట్ లో  స్థానం దక్కుతుందని చెబుతున్నారు. అదే విధంగా కృష్ణా , గుంటూరు జిల్లాల నుంచి ఇద్దరిద్దరు చొప్పున చంద్రబాబు కేబినెట్ లో ఉంటారని అంటున్నారు. అదే విధంగా ప్రకాశం జిల్లా నుంచి ఒకరికి, నెల్లూరు జిల్లా నుంచి ఒకరు లేక ఇద్దరు చిత్తూరు నుంచి ఒకరికి చంద్రబాబు తన కేబినెట్ లో చోటు కల్పిస్తారని చెబుతున్నారు. ఇక కడప జిల్లా నుంచి మాధవీరెడ్డికి బెర్త్ ఖాయమని చెబుతున్నారు. ఇక కర్నూలు జిల్లా నుంచి కూడా ఇద్దరికి చంద్రబాబు కేబినెట్ లో స్థానం దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే జనసేన కూడా ప్రభుత్వంలో చేరే పరిస్థితి వస్తే మాత్రం తెలుగుదేశం మూడు బెర్తులను త్యాగం చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. 

ఇప్పటి వరకూ జనసేన వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు జగన్ మళ్లీ రాజకీయంగా తలెత్తకుండా చేయాలంటే, అలాగే జనసేన సొంతంగా రాష్ట్రంలో బలోపేతం కావాలంటే కేబినెట్ లో చేరకుండా ఉండటమే మేలని జనసేనాని భావిస్తున్నారు. ఇప్పుడో ఇహనో ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.