వర్షాకాలంలో ఆకుకూరలు తినడం మంచిదేనా?

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో వర్షాలు చాలా ఎక్కువగా పడుతున్నాయి.  కొన్ని ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షం అయినా కురుస్తూనే ఉంటోంది.  వర్షాల కారణంగా చెరువులు,  నీరు నిల్వ ఉండే ప్రాంతాలలో కదలిక వస్తుంది. కొత్తనీరుతో పాటూ వివధ ప్రాంతాలలోని వ్యర్థాలు,  కలుషితాలు కూడా నీటితో కలుస్తాయి. వీటినే తాగునీరుగా,  వంటలకోసం ఉపయోగించడం వల్ల ఆహారం, నీరు అన్నీ కలుషితమవుతాయి.  ఒకవైపు ఇలా ఉంటే అధిక తేమ కారణంగా కొన్ని రకాల కూరగాయలు,  ఆకుకూరలు చాలా తొందరగా చెడిపోతాయి.  అలాంటి వాటిలో ఆకుకూరలు కూడా ఒకటి.  ఆకుకూరలను వర్షాకాలంలో తినవద్దని చెప్పడానికి ఇదే ప్రధాన కారణం. తాజాగా లేని ఆకుకూరలను తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, డయేరియా, ఫుడ్ పాయిజనింద్ వంటి అనేక ప్రేగు సమస్యలు కూడా వస్తాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలంలో కూడా ఆకుకూరలను ఆస్వాదించవచ్చని వైద్యులు, ఆహార నిపుణులు చెబుతున్నారు.  ఇందుకోసం ఏం చేయాలంటే..

తాజా ఆకుకూరలు..


 నచ్చిన ఆకు కూరలను  కొనుగోలు చేసిన తర్వాత  ఆకుకూరల మధ్యన తడిగా, కుళ్లినట్టు ఉండే ఆకులను వేరు చేయాలి.   ఆరోగ్యంగా, తాజాగా  కనిపించే ఆకులను వేరు చేయాలి.


శుభ్రం..


 ఆకుకూరల నుండి తాజాగా ఉన్న ఆకులను వేరు చేసిన తరువాత వాటిని శుభ్రం చేయాలి.  ఆకుకూరలు శుభ్రం చేయడానికి చాలామంది మార్కెట్లో లభ్యమయ్యే లిక్విడ్ లను ఉపయోగిస్తుంటారు.   అయితే ఈ  కృత్రిమ క్లీనర్‌లను ఉపయోగించకూడదు.  బదులుగా, ఆకు కూరలను కుళాయి కింద వేగంగా పడుతున్న నీటి ధారలో కడగాలి.


ఆరబెట్టాలి..


ఆకుకూరలను కడిగిన తర్వాత అదనపు నీటిని వడకట్టి ఫ్యాన్ కింద ఆకులను ఆరబెట్టాలి. ఆకు కూరలలో తేమ పోయేలా చేయడానికి సలాడ్ స్పిన్నర్‌ను కూడా ఉపయోగించవచ్చు. లేదా కిచెన్ టవల్‌తో ఆరబెట్టవచ్చు. ఈ ఆకుకూరలను వెంటనే అయినా ఉపయోగించవచ్చు. లేదంటే నిల్వ కూడా చేయవచ్చు.

జాగ్రత్త..


 ఒక గిన్నె నీటిలో  కొంచెం ఉప్పు వేసి నీటిని మరిగించి మంటను ఆపివేయండి. ఇందులో ఆకుకూరలు,  పచ్చిమిర్చి వేసి 30 సెకన్ల పాటు ఉంచాలి. పేర్కొన్న సమయాన్ని మించకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాటిని ఎక్కువసేపు వేడి నీటిలో ఉంచడం వల్ల వాటి రంగు,  ఆకుకూరల స్వభావం మారిపోతుంది.  


 ఐస్ బాత్..

వేడి నీటి నుండి ఆకు కూరలను తీసివేసిన వెంటనే  వాటిని మంచు నీటితో నిండిన గిన్నెలోకి మార్చాలి. ఒక నిమిషం అలాగే ఉంచి  తీసివేయాలి. ఇది ఆకుకూరలు తాజాగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయో అలా ఉండేలా చేస్తుంది.


                                        *రూపశ్రీ.