Read more!

మీ ఫిట్నెస్ బాగుండాలా?? అయితే ఈ తప్పు చేయొద్దు!

క్రీడాకారులు అంత ఆక్టివ్ గా, ఫిట్ గా ఉండటానికి ముఖ్యమైన కారణం ఏమిటో తెలుసా?? చాలామంది వారి ఆహారం అని, వారు చేసే వ్యాయామమని అంటారు. కానీ ఇది శుద్ధ తప్పు. అవన్నీ ఎంత పక్కాగా పాటించినా నిద్ర అనేది సరిగ్గా లేనప్పుడు ఎవరూ ఫిట్ గా ఉండలేరు. దీన్ని బట్టి చూస్తే నిద్ర ప్రతి ఒక్కరి జీవితంలో ఎంత గొప్ప పాత్ర పోషిస్తుందో అర్థమవుతుంది. నిద్ర ఒక గొప్ప ఔషధం అని ఊరికే అనలేదు. ప్రపంచంలో ఉన్న చాలా గొప్ప క్రీడాకారులు తమ ఒత్తిడిని చక్కగా అధిగమిస్తున్నారన్నా, రోజును బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారన్నా దానికి వారి నిద్రా విధానాలే మూల కారణం.


మానవ జీవక్రియకు, కణజాలాల పెరుగుదలకు శరీరంలో కండరాల మరమ్మత్తులో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా జ్ఞాపకశక్తి బాగుండాలన్నా, చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్న చక్కని నిద్ర ద్వారానే సాధ్యమవుతుంది. సరిగ్గా గమనిస్తే నిద్ర చక్కగా ఉన్నవారు, నిద్రలేమి సమస్య, నిద్రకు సరైన సమయం కేటాయించని వారిని కంపెర్ చేస్తే తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే మనిషి ఫిట్నెస్ లో నిద్ర కీ పాయింట్ అని అంటున్నారు.


ఏరోబిక్ ఫిట్నెస్


ఏరోబిక్ వ్యాయామాలు శరీరానికి చాలా చక్కని ఫలితాలను ఇస్తాయి. ఈ వ్యాయామాలలో భాగంగా శరీరాన్ని వేగంగా కదిలించడం వల్ల ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది. శరీరం చాలా రిలాక్స్ అవుతుంది.


కండరాల పెరుగుదల కోసం..


శరీర కంధర సామర్థ్యం చక్కగా ఉండాలంటే కండరాలను కష్టపెట్టడమే మార్గం కాదు. ఆ కండరాలు రిలాక్స్ అవ్వడానికి తగిన సమయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. నిద్ర దానికి చక్కని మార్గం. కండర వ్యవస్థ నిద్రలో బలోపేతం అవుతుంది. అలాగే కండరాలకు తగినంత ప్రోటీన్లు కూడా అందితే కండరాలు దృఢంగా మారతాయి. 


హార్మోన్ల గుట్టు


టెస్టోస్టెరాన్, గ్రోత్ హార్మోన్ అనేవి అనాబాలిక్ హార్మోన్లుగా పిలవబడతాయి. ఈ రెండూ నిద్రలోనే విడుదల అవుతాయి. ఇవి శరీరంలో ఎన్నో రకాల కార్యకలాపాలలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కాబట్టి నిద్ర చక్కగా ఉంటే ఈ హార్మోన్ల విడుదల సక్రమంగా జరిగి ఫిట్నెస్ బావుంటుంది.


పైన చెప్పుకున్నవి మాత్రమే కాకుండా మంచి నిద్ర వల్ల మెదడుకు విశ్రాంతి బాగా లభిస్తుంది. శారీరక శ్రమ లేకుండా కేవలం మెదడు మీద భారం పడుతూ ఒత్తిడుల మధ్య ఉద్యోగాలు చేస్తున్న ఈ కాలంలో నిద్ర చక్కని ఔషధం. కాబట్టి నిద్ర చక్కగా ఉంటే ఫిట్నెస్ కి మొదటి అడుగు పర్ఫెక్ట్ గా పడినట్టే..


                                   ◆నిశ్శబ్ద.