అమరావతికి పోటీగా రేవంత్ ‘మాస్టర్ ప్లాన్’!
posted on Jul 25, 2024 @ 11:25AM
గత పన్నెండు సంవత్సరాల నుంచి హైదరాబాద్, హైదరాబాద్ పరిసర ప్రజలు రెగ్యులర్‌గా వింటున్న మాట ‘మాస్టర్ ప్లాన్’. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో మొత్తం ఐదు మాస్టర్ ప్లాన్స్ వున్నాయి. వాటిని మొత్తాన్నీ మిక్స్ చేసి హెచ్ఎండీఏ పరిధి వరకు సరికొత్త ‘మాస్టర్ ప్లాన్’ని తీసుకురావాలన్నది నాయకుల ప్లాన్. మాస్టర్ ప్లాన్ తీసుకురాబోతున్నాం.. రెండు మూడు నెలల్లో వచ్చేస్తుంది అని పన్నెండు సంవత్సరాల నుంచి నాయకులు, అధికారులు ప్రకటిస్తూనే వున్నారుగానీ, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పరిస్థితి వుంది. ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2012లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్ విడుదలైంది. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ అధికారంలో వున్న దాదాపు పదేళ్ళ కాలంలో సంవత్సరానికోసారి ‘ఇదిగో మరో మాస్టర్ ప్లాన్ వచ్చేస్తోంది’ అంటూ ఊరిస్తూ వచ్చారే తప్ప పని జరగలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వానికి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పథంలో దూసుకువెళ్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలర్ట్ అయినట్టు సమాచారం. పన్నెండేళ్ళుగా అంగుళం కూడా ముందుకు కదలని మాస్టర్ ప్లాన్ అంశాన్ని ఈ ఏడాది చివరికి ఒక కొలిక్కి తేవడానికి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంవత్సరాంతానికి కొత్త సమగ్ర మాస్టర్ ప్లాన్‌ని ప్రకటించాలన్నది రేవంత్ రెడ్డి లక్ష్యం. లేటెస్ట్.గా అమరావతికి కేంద్ర ప్రభుత్వం 15 వేల కోట్ల రూపాయలను గ్రాంట్‌గా ప్రకటించిన నేపథ్యంలో అలెర్ట్ అయి హైదరాబాద్ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం వుందని రేవంత్ రెడ్డి గుర్తించారు. దీనికి తొలి అడుగుగా సమగ్ర మాస్టర్ ప్లాన్‌ని రూపొందించాలని సంకల్పించారు.
అసలు ‘సమగ్ర మాస్టర్ ప్లాన్’ వల్ల ఉపయోగాలు ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే, ప్రధాన నగరం మీద ఒత్తిడి తగ్గుతుంది. సరికొత్త నివాస ప్రాంతాలు, సరికొత్త వ్యాపార ప్రాంతాలు, సరికొత్త పారిశ్రామిక ప్రాంతాలు పెరుగుతాయి. తద్వారా నగర అభివృద్ధి విస్తృతం అవుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతుంది. అమరావతి ప్రభావం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద పడకుండా వుండాలంటే యథాతథ స్థితిని కొనసాగించడం కాకుండా, హైదరాబాద్ చుట్టూ సరికొత్త అవకాశాలను సృష్టించాలి. అప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వెనుకబడకుండా వుంటుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈసారి మాత్రం సమగ్ర మాస్టర్ ప్లాన్ విషయంలో చాలా పట్టుదలగా వున్నట్టు తెలుస్తోంది. మరి ఈ పట్టుదల గత ప్రభుత్వం ‘పట్టుదల’ మాదిరిగా మాటలకే పరిమితం అవుతుందో, ఆశించిన ఫలితాలను తెస్తుందో వేచి చూడాలి.