కొత్తకొత్తగా…అడుగులెయ్యండి!!
posted on Jul 24, 2024 @ 9:30AM
ఈకాలంలో అందరికి శరీరం మీద శ్రద్ధ పెరిగిందనే చెప్పుకోవాలి. ట్రెండింగ్ లో ఉన్న దేన్నీ వదలరు. తినే తిండి నుండి, తాగే ద్రవపదార్థాలు, సమయం, ప్లానింగ్, ఇంకా వ్యాయామాలు, జిమ్ లో కసరత్తులు ఇలా బోలెడు ఫాలో అవుతుంటారు. ఎంత బిజీ లైఫ్లో మునిగిపోయిన కనీసం వారానికి ఒకసారి అయినా ఔటింగ్ వెళ్లడం, స్నేహితులను కలవడం, ఎంజాయ్ చేయడం. ఇలాంటివన్నీ బోలెడు ఫాలో అవుతుంటారు.
ఇవన్నీ కూడా మనిషిని శారీరకంగానూ మరియు మానసికంగానూ దృఢంగా ఉంచేవే!!
అయితే ఇదంతా నాణేనికి ఒకవైపే. ముఖ్యంగా బాచ్లర్స్ వీటిని ఫాలో అవ్వగలరు. వాళ్లకున్న ఫ్రీడమ్ అలాంటిదే మరి. కానీ పెళ్ళైనవాళ్ళు అన్నిటినీ ఫాలో అవ్వాలన్నా ఎన్నో కారణాలు కనిపిస్తుంటాయి. వాటిలో నిజానికి కుటుంబం మరియు కుటుంబంతో కలసిపోయిన బాండింగ్ మొదలైనవి చిన్న అడ్డంకులుగా కనిపిస్తాయి. కానీ వాటిని బయటకు చెప్పలేరు. అందుకే చాలామంది కాంప్రమైజ్ అయిపోతుంటారు. అయితే లైఫ్ స్టైల్ లో కొన్ని మారినా అలవాట్లు మాత్రం మార్చుకోవాల్సిన అవసరం లేనే లేదు. ఇదిగో ఇలా చేస్తే కచ్చితంగా కొత్తగా మీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది.
టైం ప్లానింగ్!!
ఇది కేవలం మీకు మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యులకు కూడా ఎంతో గొప్పగా సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయం నిద్రలేవడం నుండి రాత్రి పడుకునేవరకు ప్రతిదీ ఒక సమయం ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. మొదట్లో ఇది కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అనుకున్న సమయానికి ఏది పూర్తవకుండా ఇబ్బంది పెడుతుంది. కానీ దాన్ని అట్లాగే వదిలెయ్యకూడదు. ఒక పని అనుకున్న సమయం కంటే ఓ అరగంట ఆలస్యం అయినా సరే దాన్ని పూర్తి చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలి. అలా చేస్తూ ఉంటే దాన్ని ఆ అరగంట సమయం ఎక్స్ట్రా తీసుకోకుండా కరెక్ట్ టైమ్ కు పూర్తిచేసే రోజు తప్పకుండా వస్తుంది. అంటే ఇదొక సాధనలాగా జరిగే ప్రక్రియ. సమయ ప్రణాళిక అనుకోగానే మొదట్లోనే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోదు. అందువల్ల కరెక్ట్ గా సెట్ అవట్లేదని నిరుత్సాహపడి దాన్ని వదిలేయకండి. ఈ సమయ ప్రణాళిక మీ నుండి మీ కుటుంబానికి, మీ పిల్లలకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పిల్లల జీవితం గొప్పగా సాగేందుకు సహాయపడుతుంది.
ప్రాధాన్యతలు!!
ప్రతి ఒక్కరి సమయ ప్రణాళికలో కొన్ని ప్రాధాన్యత ఎక్కువ ఉన్నవి, కొన్ని తక్కువ ఉన్నవి ఉంటాయి. అయితే ఇక్కడ ఒకే ఒక విషయం అందరూ పొరపాటు చేస్తారు. ఏదైనా ఆఫీస్ పని లేదా ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినపుడు శారీరక మరియు వ్యక్తిగత సమయాలను కుదించి వాటికి కేటాయిస్తారు. అయితే తిరిగి వాటిని భర్తీ చేయడం ఎలా అనే విషయాన్ని పట్టించుకోరు. కొన్నిసార్లు అడ్జస్ట్మెంట్ అనేది ముఖ్యమే కానీ శరీరాన్ని, మూడ్స్ ను డిస్టర్బ్ చేసేలా ఉండకూడదు. వృత్తి పరమైన ప్రాధాన్యతల్లో పడి శరీరానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను తగ్గించకూడదు. ప్రణాళిక వేసుకున్నాకా ప్రతి ఒక్కటీ ముఖ్యమైనదే అని, అన్నిటికి సమప్రధాన్యత, ప్రతి పనిని ఒకే విధమైన శ్రద్ధా భక్తులతో చేయాలి. అప్పుడే మీ ప్రణాళికలకు, ఆలోచనలకు సార్థకత.
ప్రోద్బలం, ప్రోత్సాహం!!
కుటుంబ సభ్యుల నుండి ఎదో ఒక విధంగా ఏదో ఒక పనిదగ్గర ఇబ్బంది ఎదురవుతూ ఉంటే సింపుల్ గా కుటుంబ సభ్యులలో ఉన్న ఆసక్తిని గమనించి వాళ్ళను ఆ పని వైపు ప్రోత్సహించాలి. అప్పుడు వాళ్ళు కూడా వారిలో ప్రత్యేకత ఉందని గమనించి తమకంటూ ఓ గుర్తింపు వైపు సాగిపోతారు. ఇలా చేయడం వల్ల ఇతరుల సమయాన్ని గౌరవించే అలవాటు కలుగుతుంది. అర్థం చేసుకునే గుణం పెరుగుతుంది. ఒకరికొకరు చర్చించుకుని సమయాన్ని ఎంతో సరదాగా గడపవచ్చు. నిజానికి ఎప్పుడూ వెన్నెల ఉంటే దాన్ని అంతగా ఇష్టపడేవాళ్ళా??
లేదు కదా!!
ఇది కూడా అంతే మనుషులు ఎప్పుడూ బంధించుకున్నట్టు ఉంటే ఆ బంధంలో కొత్తదనం కనిపించదు. చివరగా చెబుతున్నా ఎంతో ముఖ్యమైన మాట. మొదట బద్ధకాన్ని వదిలి జీవితాన్ని కొత్తగా మలచుకోవాలి అనే ఆలోచనతో ఆగిపోకుండా అటువైపు అడుగులు వేయాలి. అప్పుడే కొత్తదనం కిలకిలా నవ్వుతుంది జీవితంలో.
◆ వెంకటేష్ పువ్వాడ