English | Telugu
బాలయ్య షోకి నాని.. అన్‌స్టాపబుల్ ఎంటర్‌టైన్‌మెంట్
Updated : Nov 8, 2021
ప్రముఖ ఓటీటీ వేదిక 'ఆహా'లో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' పేరుతో నటసింహం నందమూరి బాలకృష్ణ ఓ టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ ఎపిసోడ్ కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్ లో మంచు ఫ్యామిలీతో కలిసి బాలయ్య అలరించారు. ఓల్డ్ ఫార్మాట్ ను బ్రేక్ చేస్తూ బాలయ్య హోస్ట్ చేస్తున్న విధానానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సెకండ్ ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సెకండ్ ఎపిసోడ్ కు నేచురల్ స్టార్ నాని గెస్ట్ గా రాబోతున్నట్లు తాజాగా ఆహా అధికారికంగా ప్రకటించింది.
బిగ్ బాస్ షోతో పాటు పలు స్పెషల్ సినిమా ఈవెంట్స్ లో హోస్ట్ గా చేసిన అనుభవం నానికి ఉంది. ఇక బాలయ్య హోస్ట్ గా లేట్ గా ఎంట్రీ ఇచ్చినా ఓ రేంజ్ లో అలరిస్తున్నారు. అలాంటిది ఇప్పుడు వీరిద్దరూ కలిస్తే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పక్కా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దానికి తోడు నానికి బాలయ్య అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. 'కృష్ణ గాడి వీర ప్రేమ గాథ' సినిమాలో చేతి మీద 'జై బాలయ్య' టాటూతో బాలయ్య వీరాభిమానిగా కనిపించారు నాని. షోలో ఈ విషయం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశముంది.
'మనలో ఒకడు, సెల్ఫ్ మేడ్ కి సర్ నేమ్.. మన రెండో గెస్ట్ నాని' అని తెలుపుతూ ఆహా సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేసింది. ఫోటోలలో బాలయ్య , నానిలు చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈరోజు(సోమవారం) సాయంత్రం 5.04 గంటలకు రెండో ఎపిసోడ్ ప్రోమో విడుదల అవుతుందని ఆహా ప్రకటించింది.