English | Telugu
ఆగస్టు 22 నుంచి ప్రతి ఇంటికీ జూనియర్ ఎన్టీఆర్!
Updated : Aug 14, 2021
‘‘వస్తున్నా! ప్రతి ఇంటికి వచ్చేస్తున్నా... సోమవారం నుంచి గురువారం వరకూ, ప్రతిరోజూ రాత్రి 8.30 గంటలకు’’ అంటూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వచ్చేశారు.. బుల్లితెర ద్వారా ప్రతి ఒక్కరికి ఇంటికి వస్తున్నానని! లేటెస్ట్‌గా ఆయన హోస్ట్ చేస్తున్న షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’కి తెలుగు వెర్షన్. ఇంతకు ముందు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’గా ఒకప్పటి ‘మా’, ప్రస్తుత ‘స్టార్‌మా’లో టెలికాస్ట్ అయిన షో. ఇప్పుడు సన్ నెట్‌వర్క్‌కి చెందిన ‘జెమిని టీవీ’ చేతికొచ్చింది. అందుకని, ఎప్పట్నుంచి టెలికాస్ట్ అనేది చెప్పడానికి విడుదల చేసిన ప్రోమోలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు... మీ జెమిని టీవీ’లో అని జూనియర్ ఎన్టీఆర్ నొక్కి మరీ చెప్పాడు.
ఆగస్టు 22వ తేదీన, రాత్రి 8.30 గంటలకు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కర్టెన్ రైజర్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆ తర్వాత రోజు నుంచి అంటే ఆగస్ట్ 23 నుంచి రాత్రి 8.30 గంటలకు షో ప్రసారమవుతుంది. సోమవారం నుంచి గురువారం వరకు వారానికి నాలుగు రోజుల పాటు ఈ షో ఉంటుంది.
ప్రజెంట్ తారక్ ఉక్రెయిన్‌లో ఉన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ చేస్తున్నారు. అందుకని, ముందుగానే ఆగస్టు నెలకు, ఆ తర్వాత కొన్ని రోజులకు సరిపడా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఎపిసోడ్స్ షూటింగ్ చేశారు. ఈ నెల మూడో వారంలో ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని, మళ్లీ సెప్టెంబర్‌లో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఎపిసోడ్స్ షూటింగ్ చెయ్యాలని ప్లాన్ చేశారట.