English | Telugu
కత్తితో తనను తాను గాయపర్చుకున్న కంటెస్టెంట్.. బిగ్ బాస్ హౌస్ నుంచి ఔట్!
Updated : Nov 10, 2021
బిగ్ బాస్ హౌస్ అంటేనే హై-స్పీడ్ డ్రామా. అది ఏ భాషలో షో అయినా కంటెస్టెంట్ల మధ్య హై వోల్టేజ్ డ్రామా నడవాల్సిందే. కోపాలు, తాపాలు, ప్రేమలు, అలకలు, అప్పుడప్పుడు కొట్టుకోవడాలు.. ఇలా వీక్షకులకు కావాల్సినంత మసాలాను ఈ రియాల్టీ షో అందిస్తోంది. లేటెస్ట్‌గా బిగ్ బాస్ 15 (హిందీ) హౌస్ నుంచి కంటెస్టెంట్ అఫ్సానా ఖాన్ తన చర్యతో వ్యూయర్స్‌ను షాక్‌కు గురిచేసింది. 'విఐపి జోన్' టాస్క్ సందర్భంగా తోటి హౌస్‌మేట్స్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగిన ఆమె, ఆ తర్వాత కిచెన్ ఏరియాలోనూ గొడవపడి, సహనం కోల్పోయి దగ్గర్లోని కత్తి తీసుకొని, తనను తాను కోసుకుంటానని బెదిరించింది.
తను చేసిన ఈ అనుచిత చర్యకు ఆమె తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. హౌస్ నుంచి బయటకు వెళ్లిపోవాలని బిగ్ బాస్ ఆమెను ఆదేశించాడు.
విఐపి టాస్క్‌లో తన క్లోజ్ ఫ్రెండ్స్ ఉమర్ రియాజ్, కరణ్ కుంద్రా తనకు సపోర్ట్‌గా నిలుస్తారని ఆశించిన అఫ్సానా, అలా జరగకపోయేసరికి బాగా అప్సెట్ అయ్యింది. వాళ్లు తనను మోసం చేశారన్నట్లు బాధపడింది. ఆందోళనకు గురైంది. కత్తితో తనను తాను గాయపరచుకోవడానికి ప్రయత్నించింది. దీంతో కంగారుపడిన నిర్వాహకులు హౌస్ లోపలకు ఒక మెడికల్ టీమ్‌ను పంపారు. ఆ తర్వాత ఆమెను హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సిందిగా ఆదేశించారు.
హౌస్‌లో 'విఐపి మెంబర్' అయినవాళ్లకే ఫైనల్ దాకా ఉండే అవకాశం లభిస్తుంది. దీని కోసం కంటెస్టెంట్లకు విఐపి జోన్ టాస్క్ ఇచ్చారు. ఈ సందర్భంలోనే అఫ్సానా ప్యానిక్ అయింది.