English | Telugu
26 వసంతాలు పూర్తి చేసుకున్న 'ఋతురాగాలు'
Updated : May 31, 2022
ఏ సీరియల్ అంటే ఇష్టం అని అమ్మా వాళ్ళను అడిగితే ఇప్పటికీ చెప్పే పేరు ఋతురాగాలు. రూపాదేవి, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రధారులుగా నటించిన అద్భుతమైన ధారావాహిక ఇది. ఇదొక ఫామిలీ ఓరియెంటెడ్ డైలీ సీరియల్ గా అప్పట్లో ఎంతో పేరు తెచ్చుకుంది. ప్రతీ పల్లెనూ, ప్రతీ గడపను పలకరించింది. 1996 లో మొదలైన ఈ సీరియల్ 1999 వరకు సాగింది. దూరదర్శన్ రాజ్యమేలుతున్న ఆ రోజుల్లో ఎంతో కొత్తదనంతో సరికొత్త ప్రేమ కథతో అందరినీ ఆకట్టుకుని టాప్ రేటింగ్స్ ని సంపాదించుకుంది. సాయంత్రం 4 .30 ఐతే చాలు అప్పటివరకు ఇంటి గుమ్మాల్లో ఉన్నవారంతా టీవీల ముందు వాలిపోయేవారు. ఎలాంటి బ్రేక్ లేకుండా ప్రతి రోజు సరికొత్తగా సాగిన సీరియల్ గా ఇప్పటికి చెప్పుకుంటారు.
బిందునాయుడు, మంజుల నాయుడు కంబినేషన్ లో వచ్చిన ఈ డైలీ సీరియల్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సీరియల్ తర్వాత వీరిద్దరి పేర్లు ఏపీలో మారుమోగాయి. ఇప్పటికి కూడా ఋతురాగాలు అని పేరు చెప్తే చాలు వీళ్ళ పేర్లు కూడా టక టక చెప్పేస్తారు అప్పటి జెనెరేషన్ వాళ్ళు. ఇక ఈ సీరియల్ కోసం ప్రత్యేకంగా రాసిన టైటిల్ సాంగ్ 'వాసంత సమీరంలా ' ఇప్పటికి ఎంతో మంది పాడుకుంటూనే ఉంటారు. ఆ పాట సోషల్ మీడియాలో, వాట్సాప్ స్టేటస్ ల్లో ఇప్పటికీ చక్కర్లు కొడుతూ ఆనాటి రోజుల్ని గుర్తుచేస్తోంది.
యుద్ధనపూడి సులోచనరాణి గారు కథను అందించగా, పెద్ది రామారావు గారు స్క్రీన్ ప్లే అందించారు. ఆ కథకి జీవం పోసి, ఎందరో మంచి నటులను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన వన్ అండ్ ఓన్లీ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ మంజుల నాయుడు. ఈ సీరియల్ లో కావేరి , శ్రీధర్ పాత్రలకు నటులు జీవం పోశారని చెప్పొచ్చు. ఈ పాట ఎప్పుడు విన్నా అందులోని యాక్టర్స్ అంతా కళ్ళ ముందే కదలాడతారు. ఈ సీరియల్ ఇప్పుడు 26 వసంతాలు పూర్తి చేసుకుంది.