ప్రభుత్వంపై తెలుగుభాషోద్యమసమాఖ్య యుద్ధం
posted on Jul 24, 2012 @ 4:11PM
తెలుగుభాషోద్యమం గురించి రాష్ట్రవ్యాప్తంగా విశేషకృషి చేస్తున్న తెలుగుసమాఖ్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. త్వరలో తిరుపతిలో ప్రపంచతెలుగుమహాసభలను నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లలో కనీసం తమ వంతు పాత్రకు సమాఖ్యను ఆహ్వానించలేదు. ప్రభుత్వవైఖరిపైసమాఖ్యకేంద్రకార్యనిర్వాహకమండలి మండిపడుతోంది. అసలు ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించే అర్హత రాష్ట్రప్రభుత్వానికి లేదని నిర్వాహక మండలి అంటోంది.
ప్రాచీనభాషగా తెలుగుభాషకు జాతీయస్థాయిలో గుర్తింపునకు కృషి చేయాల్సిన రాష్ట్రప్రభుత్వం ఆ రీతిలో స్పందించటం లేదంటోంది. ప్రపంచతెలుగుమహాసభల గురించి కూడా ఇంగ్లీషులో జీఓ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తెలుగుభాషనే ప్రోత్సహించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు రాష్ట్రప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరుతోంది. ఎందుకంటే జీఓలు దగ్గర నుంచి అన్ని విధివిధానాలూ తమిళంలో ఉండటానికి ఆ రాష్ట్రప్రభుత్వం విశేషకృషి చేస్తోందని స్పష్టం చేసింది. ఆ విధమైన కృషి చేయకపోగా, తెలుగుభాషోద్యమ సమాఖ్యలను విస్మరించినందుకు సమాఖ్య అధ్యక్షుడు సామల రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రపంచతెలుగుమహాసభలు నిర్వహించే అర్హత లేదన్న విషయాన్ని అన్ని జిల్లాల్లోనూ చాటుతామని ఆయన ప్రకటించారు. అంటే ప్రభుత్వంపై పరోక్ష యుద్ధానికి సమాఖ్య సిద్ధమైందన్న మాట.