పులివెందులపై కన్నేసిన తెలంగాణా ఎంపి.లు !
posted on Jul 25, 2012 @ 4:25PM
తెలంగాణపై వైసిపి పార్టీ నిర్ణయం చెప్పకుండానే తెలంగాణలో ప్రవేశించిన విజయమ్మ, కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో చేనేత కార్మికులకోసం చేపట్టిన ధర్నా తెలిసిందే. దీనికి ధీటుగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలు పులివెందులలో ప్రవేశించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి గాను వారు వైసిపి నేత జగన్ స్వంత జిల్లాలోనే చేనేత కుటుంబాల వారు వందలాదిగా ఉన్నందున ఈ కార్యక్రమాన్ని జరపనున్నట్లు తెలసింది. ఈ పథకం రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ఢిల్లీ నివాసంలో రూపు దాల్చిందని చెబుతున్నారు.
ఒక వైపు చంద్రబాబు నాయుడు బిసిలకు 100 సీట్ల పథకంతో ముందుకు సాగుతున్నారని, ఇంకోవైపు రాజకీయ లబ్దికోసమే విజయమ్మ సిరిసిల్లలో ధర్నా చేసారని వీటిని త్రిప్పికొట్టాలంటే తాము కూడా ఏదైనా నిర్ణయాత్మక కార్యక్రమంతో ముందుకు సాగాలని తెలంగాణ ఎంపిలు నిర్ణయం తీసుకున్నారు. త్వరలో కడపజిల్లా జమ్మలమడుగులో పర్వటించి అక్కడి చేనేత కార్మికుల వెతలను తెలుసుకొని నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపి పరిష్కారానికి ఒత్తిడి తేవాలని నిర్ణయించుకున్నారు. వైకాపాకు అడ్డుకట్టవేయడానికి ఇదే సరైన పరిష్కారంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, ఎంపిలు భావిస్తున్నారు. ఇలా అయితేనే రానున్న 2014 ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని భావిస్తున్నారు. విజయమ్మకు ఆమె నివాసం నుండి సిరిసిల్లకు వచ్చివెళ్లటానికి అసాధారణ భద్రత కల్పించిన ప్రభుత్వం తమకు కూడా అదే స్ధాయిలోతమకు కూడా భద్రత కల్పించాలని టికాంగ్రెస్ ఎంపిలు కోరుతున్నారు.