భయోత్పాతం సృష్టిస్తున్న బొత్స మేనల్లుడు
posted on Jul 25, 2012 9:29AM
విజయనగరం జిల్లాలో జనం భయం,భయంగా ఒక నీడనేత పంచన బ్రతుకుతున్నారు.ఈ రాజకీయనాయకుడు మరెవరోకాదు సాక్షాత్తూ పిసిసి అధ్యక్షుడు, రాష్ట్రమంత్రి అయిన బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను. ఇతని వల్ల భయపడని అధికారిలేడు. బెదిరించని డిపార్టుమెంటుకూడా లేదు. ఇతని బాధపడలేని అధికారులు అయితే ట్రాన్సుఫర్‌చేయించుకొని వేరే చోటికి వెళ్లటం లేదంటే లాంగ్‌లీవు పెట్టి ఇంటిదగ్గర వుండటం చేస్తున్నారు. కలెక్టరు కూడా ఎదురు చెప్పట్లేదు సరికదా ముఖ్యమైన ఫైల్స్ అన్నీ అతనికి చూపి మరీ నిర్ణయం తీసుకుంటున్నారు. జిల్లా యస్‌పిది అదే తీరు. దీంతో ఇక్కడ ప్రజాస్వామ్యం లో ఉన్న పరిస్థితులేవీ కనబడటంలేదు.నయానో భయానో పనులు చేయించుకునే సదరు నాయకుడు అధికార పార్టీకి కొమ్ముకాస్తుండటం మినహా ఏ రాజకీయ పదవులూ లేవు. గత మూడేళ్లనుండి ఇతని ప్రవర్తన విపరీత రూపం దాల్చింది. ఇతని బెదిరింపులకు తట్టుకోలేని అధికారి ఒకరు ఈ మద్యనే విపరీతమైన వత్తిడికి గురై ఉద్యోగ బాద్యతల్లో ఉండగానే గుండెపోటుతో మరణించారు.
దీంతో అతని కుటుంబం అంత్యక్రియల సందర్బంలో ఈ నాయకుడిని , జిల్లా కలెక్టరుని అక్కడే తిట్టారు. తనకు అనుకూలంగా పనిచేయని అధికారులను, నాయకులను యస్‌టి, యస్ సి అట్రాసిటీ కేసుల్లో ఇరికిస్తానని మరీ భయపెడుతున్నాడు. ఈ నాయకుడి ప్రాబల్యం తగ్గించవలసినదిగా ప్రజలంతా ముఖ్యమంత్రిని కోరినా ఉపయోగంలేకపోయింది. కడుపురగిలిన జనం ఒక సారి కలెక్టరు ఆఫీసు ముందే ఈ రాజకీయనాయకుడి దిష్టిబొమ్మను దగ్దం చేశారు.మొన్న జరిగిన దళితుల ఊచకోత బాధితుల పక్షంగా పాల్గొన్న దళిత నేతలంతా రాజ్యాంగేతరశక్తిగా ఎదిగిన ఈ నీడనేతను అదుపులో పెట్టాలని డిమాండు చేశారు.