బ్రాహ్మణి స్టీల్స్‌ను గాలి అమ్మేశారా!
posted on Apr 11, 2011 @ 10:51AM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో తలపెట్టిన బ్రాహ్మణి స్టీల్స్‌ను కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి విక్రయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఉత్తమ్ గాల్వా స్టీల్స్‌కు గాలి జనార్దన్ రెడ్డి దాన్ని అమ్మినట్లు సమాచారం. అయితే, డీల్ ధరను ఇరు కంపెనీలు కూడా రహస్యంగా ఉంచాయి. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ పేర బ్రాహ్మణి స్టీల్స్‌ను స్థాపించాలని గాలి జనార్దన్ రెడ్డి తలపెట్టారు. బ్రాహ్మణి స్టీల్స్ ఇక ఉత్తమ్ గాల్వా ఫెర్రస్ కానుంది. నిజానికి, రతన్ టాటాకు దాన్ని విక్రయించే ప్రయత్నాలు జరిగాయి. అయితే, జగన్‌తో కేంద్ర స్థాయిలో ఉన్న సంబంధాల వల్ల అది ఆగిపోయింది. కాగా, బ్రాహ్మణి స్టీల్స్‌కు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కడప జిల్లాలో ఎకరాకు 18,500 రూపాయల చొప్పున 10,670 ఎకరాలు కేటాయించారు. దానికి వాడుకునేందుకు అనంతపురం జిల్లాలో ఇనుము గనులను వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి అప్పగించింది. బ్రాహ్మణి స్టీల్స్ నిర్మాణంలో జాప్యం చేస్తూ ఇనుప ఖనిజాన్ని గాలి జనార్దన్ రెడ్డి ఎగుమతి చేసి పెద్ద యెత్తున సొమ్ము సంపాదించారనే విమర్శలు ఉన్నాయి. ఆయన అక్రమ మైనింగ్‌కు కూడా పాల్పడినట్లు తెలుస్తోంది. బ్రాహ్మణి స్టీల్స్ ప్రగతిని సమీక్షించి, నోటీసులు ఇవ్వాలని ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది.వైయస్ రాజశేఖర రెడ్డి మరణంతో గాలి జనార్దన్ రెడ్డి పనులకు ఆటంకాలు ఏర్పడుతూ వచ్చాయి. ఈ వాతావరణంలో గాలి జనార్దన్ రెడ్డి దాన్ని విక్రయించినట్లు చెబుతున్నారు.