రాజీనామాచేసినా ఎన్టీఆర్ కుటుంబంతోనే
posted on Apr 11, 2011 @ 11:28AM
విజయవాడ: పార్టీ పదవికి తాను రాజీనామా చేసినా ఎన్టీ రామారావు కుటుంబంతోనే ఉంటానని తెలుగుదేశం పార్టీ విజయవాడ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీ చెప్పారు. గ్రూపు రాజకీయాలు నడపడం తన వల్ల కాదని, వెన్నుపోటు పొడవలేనని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలుగుదేశం పార్టీకి నారా, నందమూరి కుటుంబ సభ్యులు రెండు కళ్లలాంటివారని ఆయన అన్నారు. తనకు చంద్రబాబుపై గౌరవం ఉందని, చంద్రబాబుపై తనకు అసంతృప్తి లేదని ఆయన అన్నారు. తన రాజకీయ భవిష్యత్తు నందమూరి కుటుంబ సభ్యులతో ముడిపడి ఉందని ఆయన చెప్పారు. నందమూరి హరికృష్ణకు క్షమాపణ చెప్పాలని అడిగితే ఇంత రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న వంశీ పార్టీ అర్బన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి దేవినేని ఉమా మహేశ్వర రావును కూడా అహ్వానించారు. పార్టీ పదవికి రాజీనామా చేయడం తన వ్యక్తిగత నిర్ణయమని ఆయన అన్నారు. తన అనుచరులతో మాట్లాడి రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.