కెసిఆర్ పై ఆంధ్రా బ్రాహ్మణుల ఆగ్రహం
posted on Apr 17, 2011 @ 1:11PM
విశాఖపట్నం: ఆంధ్రా బ్రాహ్మణులపై విపరీత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు వెంటనే బ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పాలని ఆంధ్రా బ్రాహ్మణ సంఘం డిమాండ్ చేసింది. కెసిఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆంధ్రా బ్రాహ్మణులు ఆదివారం విశాఖపట్నంలోని శంకరమఠంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు కెసిఆర్‌పై ధ్వజమెత్తారు. ఎక్కడైనా బ్రాహ్మణులు చేసే పూజ ఒకటే విధంగా ఉంటుందన్నారు. వేదం ఒక్కటే, పూజ ఒక్కటే అనే విషయం తెలుసుకోవాలని సూచించారు. కెసిఆర్ వ్యాఖ్యలు సరికావన్నారు. అందరూ బావుండాలని కోరుకునేది బ్రాహ్మణులు అని అన్నారు. తాము మాత్రమే బావుండి ఇతరులు చెడిపోవాలని కోరుకుంటే సరికాదన్నారు. దానికి ప్రాంతాలతో సంబంధం లేదన్నారు. ఎవరి ఉద్యమం వారు చేసుకోవచ్చునని చెప్పారు. కానీ మధ్యలో తమను కించపరిస్తే సరికాదన్నారు. కెసిఆర్ ఇంతకుముందు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించారు, ఇప్పుడు బ్రాహ్మణుల మధ్య అఘాధం సృష్టించాలని అనుకుంటున్నారన్నారు. కాగా కెసిఆర్ వ్యాఖ్యలను తెలంగాణ బ్రాహ్మణులు కూడా పలువురు ఖండిస్తున్నారు.